Birthright Citizenship: ట్రంప్‌కు మరో ఎదురుదెబ్బ.. జన్మహక్కు పౌరసత్వంపై కోర్టు కీలక తీర్పు
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మరోసారి న్యాయస్థానంలో చుక్కెదురైంది. అమెరికాలో జన్మించిన పిల్లలకు సహజంగా లభించే జన్మహక్కు పౌరసత్వాన్ని (Birthright Citizenship) పరిమితం చేయాలన్న ఆయన ప్రయత్నానికి ఫెడరల్ కోర్టు అడ్డుకట్ట వేసింది. ట్రంప్ ఆగస్టు 6న జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అమలును నిలిపివేస్తూ బుధవారం (స్థానిక కాలమానం ప్రకారం) తీర్పు వెలువరించింది. దీంతో జన్మహక్కు పౌరసత్వంపై ఆంక్షలు విధించాలన్న ట్రంప్ ప్రభుత్వానికి మరో న్యాయపరమైన ఎదురుదెబ్బ తగిలింది.
వివరాలు
ఆగస్టు 6న ట్రంప్ జారీ చేసిన ఉత్తర్వుల్లో ఏముంది?
గతంలో జన్మహక్కు పౌరసత్వంపై ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆంక్షలకు సంబంధించి జూన్‌లో అమెరికా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.
ఈ పరిణామం తర్వాత ట్రంప్ ఆగస్టు 6న మరో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు.
అమెరికాలో పుట్టినప్పటికీ తల్లిదండ్రుల్లో ఎవరూ అమెరికా పౌరులు కాని కొన్ని వర్గాల పిల్లలకు పౌరసత్వ గుర్తింపు నిరాకరించేలా ఈ ఉత్తర్వులను రూపొందించారు.
ప్రభుత్వం విదేశీ శత్రు దేశాలకు చెందినవారిగా గుర్తించిన వ్యక్తుల పిల్లలు, కొన్ని విదేశీ ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు ఈ ఆంక్షలు వర్తించేలా ఆదేశాలు జారీ చేశారు.
వివరాలు
ఆగస్టు 6న ట్రంప్ జారీ చేసిన ఉత్తర్వుల్లో ఏముంది?
అంతేకాకుండా అమెరికాలో ప్రసవం ద్వారా తమ పిల్లలకు పౌరసత్వం పొందాలనే ఉద్దేశంతో వాణిజ్యపరమైన ఏర్పాట్లు చేసుకునే తల్లిదండ్రుల పిల్లలను కూడా ఈ పరిధిలోకి తీసుకొచ్చారు.
డబ్బు చెల్లించి సరోగసీ ద్వారా పిల్లలను కనడం వంటి ఏర్పాట్లను సైతం ఇందులో చేర్చారు. ఈ ఉత్తర్వులు కేవలం రాయబారులకే పరిమితం కాలేదు.
కొన్ని రాయబార కార్యాలయాలు, కాన్సులేట్లలో పనిచేసే ఉద్యోగులు, అధికారిక విధుల్లో ఉన్న ఇతర సిబ్బందికి సంబంధించిన నిబంధనలను కూడా పొందుపరిచారు.
ఈ వర్గాలకు చెందిన పిల్లలకు జన్మహక్కు పౌరసత్వ రక్షణ వర్తించదని ట్రంప్ ప్రభుత్వం వాదించింది.
వివరాలు
ట్రంప్ ఆదేశాలను కోర్టులో సవాలు చేసిన ACLU
ట్రంప్ తీసుకొచ్చిన తాజా ఆంక్షలను అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ (ACLU),ఇతర పౌర హక్కుల సంఘాలు న్యాయస్థానంలో సవాలు చేశాయి.
సెప్టెంబర్ 28న వాషింగ్టన్‌లో పిటిషన్ దాఖలు చేసి.. ఆగస్టు 6న జారీ చేసిన ఉత్తర్వుల ద్వారా తీసుకొచ్చిన కొత్త పరిమితులను వ్యతిరేకించాయి.
ఈ న్యాయపోరాటంలో ఆసియన్ లా కాకస్, NAACP లీగల్ డిఫెన్స్ అండ్ ఎడ్యుకేషనల్ ఫండ్, డెమోక్రసీ డిఫెండర్స్ ఫండ్‌తో పాటు పలు జాతీయ,ప్రాంతీయ ACLU సంస్థలు భాగస్వాములయ్యాయి.
అమెరికాలో జన్మించిన పిల్లలకు రాజ్యాంగం కల్పించిన పౌరసత్వ హక్కుపై అధ్యక్షుడు తనంతట తానుగా కొత్త మినహాయింపులు విధించలేరని కోర్టు స్పష్టం చేసినట్లు ACLU వెల్లడించింది.
తాజా తీర్పుతో ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదించిన అదనపు ఆంక్షల అమలుకు తాత్కాలికంగా బ్రేక్ పడింది.
వివరాలు
గతంలోనూ సుప్రీంకోర్టులో ట్రంప్‌కు ఎదురుదెబ్బ
జన్మహక్కు పౌరసత్వాన్ని పరిమితం చేయాలన్న ట్రంప్ ప్రయత్నాలకు గతంలోనూ న్యాయపరమైన అడ్డంకులు ఎదురయ్యాయి.
జూన్‌లో అమెరికా సుప్రీంకోర్టు ట్రంప్ ప్రభుత్వం తొలుత తీసుకొచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌కు వ్యతిరేకంగా పౌరసత్వ హక్కుల పరిరక్షణకు సంబంధించిన తీర్పు ఇచ్చినట్లు ACLU పేర్కొంది.
అయితే,ఆ తర్వాత ట్రంప్ ప్రభుత్వం మరోసారి కొత్త వర్గాలను లక్ష్యంగా చేసుకుని ఆగస్టు 6న తాజా ఉత్తర్వులు జారీ చేసింది.
ఇప్పుడు వాషింగ్టన్ ఫెడరల్ కోర్టు ఆ ఆదేశాల అమలును కూడా నిలిపివేయడంతో ఈ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది.
అమెరికా రాజ్యాంగంలోని 14వసవరణ ప్రకారం దేశంలో జన్మించిన వారికి పౌరసత్వం కల్పించే అంశంపై ట్రంప్ ప్రభుత్వం,పౌర హక్కుల సంఘాల మధ్య న్యాయపోరాటం కొనసాగుతోంది.
తాజా తీర్పు ఈ వివాదంలో కీలకపరిణామంగా మారింది.