'Donald Trump Never Learns': మిత్రదేశాలపై టారిఫ్‌లతో ట్రంప్‌పై సొంత దేశంలోనే విమర్శలు
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలపై డెమోక్రటిక్ పార్టీ నేతలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే యుద్ధాలు, వాణిజ్య పోరుతో అంతర్జాతీయంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ.. తాజాగా మిత్రదేశాలపైనా టారిఫ్‌లు విధించడంపై మండిపడుతున్నారు. మధ్యంతర ఎన్నికల్లో ఎదురైన ఓటమితో రాజకీయంగా ఇబ్బందుల్లో ఉన్న ట్రంప్.. తన నిర్ణయాలతో అమెరికాను మరింత సమస్యల్లోకి నెడుతున్నారని విమర్శిస్తున్నారు.
వివరాలు
ట్రంప్ ఎప్పటికీ తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోరు: డెమోక్రాట్లు
డెమోక్రటిక్ పార్టీకి చెందిన సెనేటర్ చక్ షూమర్ తాజా టారిఫ్‌ల నిర్ణయంపై తీవ్రంగా స్పందించారు.
డొనాల్డ్ ట్రంప్ ఎప్పటికీ తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోరని విమర్శించారు.
అమెరికా ముందున్న అసలు సమస్య చైనా అని, అయితే ట్రంప్ ప్రభుత్వం ఆ అంశాన్ని పట్టించుకోవడం లేదని అన్నారు.
చైనాపై దృష్టి పెట్టాల్సిన సమయంలో అమెరికా మిత్రదేశాలను దూరం చేసుకుంటున్నారని ఆరోపించారు.
ఈ నిర్ణయాల వల్ల అమెరికా కుటుంబాలపై ఆర్థిక భారం పెరుగుతోందని, కార్మికులకు ఎలాంటి ప్రయోజనం కలగడం లేదని పేర్కొన్నారు.
అంతేకాకుండా, వాణిజ్య ఒప్పందాలకు సంబంధించిన షరతులను నిర్ణయించే అవకాశాన్ని కూడా చైనాకే కల్పిస్తున్నారని విమర్శించారు.
వచ్చే జనవరిలో పరిస్థితులు మారతాయని చక్ షూమర్ వ్యాఖ్యానించారు.
వివరాలు
ట్రంప్ నిర్ణయంపై పెన్సిల్వేనియా గవర్నర్ ఆగ్రహం
పెన్సిల్వేనియా గవర్నర్ జాష్ షాపిరో కూడా ట్రంప్ నిర్ణయంపై ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
ట్రంప్ అనాలోచితంగా తీసుకుంటున్న టారిఫ్‌ల నిర్ణయాల వల్ల అమెరికన్ల జేబులకు చిల్లులు పడుతున్నాయని విమర్శించారు.
చైనా అనైతిక వాణిజ్య విధానాలను అడ్డుకోవడంలో విఫలమవుతున్న విషయాన్ని ట్రంప్ గుర్తించడం లేదని అన్నారు.
అలాంటి సమయంలో అమెరికా తన మిత్రదేశాలపైనే భారీగా సుంకాలు విధిస్తోందని మండిపడ్డారు.
ఈ విధానాల వల్ల మిత్రదేశాలకు అమెరికా దూరమవుతోందని, అంతర్జాతీయంగా ఏకాకిగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
మరోవైపు దేశంలో నిత్యావసరాలు, ఇతర వస్తువుల ధరలు పెరిగి అమెరికన్లపై ఆర్థిక భారం మరింత ఎక్కువవుతుందని పేర్కొన్నారు.
వివరాలు
మోదీజీ వెనక్కి తగ్గొద్దు.. అమెరికాకు ప్రతీకార సుంకాలు విధించండి: సీటీఐ
వాణిజ్య ఒప్పందం కుదరకపోతే భారత్‌పై ఏకపక్షంగా 25 శాతం టారిఫ్‌లు విధించాలని అమెరికా తీసుకున్న నిర్ణయాన్ని ది ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ (సీటీఐ) తీవ్రంగా తప్పుబట్టింది.
అమెరికా చర్యలకు భారత్ కూడా తగిన విధంగా స్పందించాలని ఆ సంస్థ కోరింది.
ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్లు సీటీఐ ఛైర్మన్ బ్రిజేశ్ గోయల్ వెల్లడించారు.
భారత్ నుంచి అమెరికాకు అనేక రకాల ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయని ఆయన గుర్తుచేశారు.
వీటిలో ఔషధాలు, వస్త్రాలు, వైద్య రంగానికి అవసరమైన సరఫరా వస్తువులు, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ పరికరాలు, సముద్ర ఉత్పత్తులు, ముత్యాలు, లోహాలు, తోలు వస్తువులు ఉన్నాయి.
వివరాలు
మోదీజీ వెనక్కి తగ్గొద్దు.. అమెరికాకు ప్రతీకార సుంకాలు విధించండి: సీటీఐ
మరోవైపు అమెరికా నుంచి భారత్‌కు పప్పుదినుసులు, ఖనిజాలు, పానీయాలు, ఆహార ఉత్పత్తులు దిగుమతి అవుతున్నాయని వివరించారు.
అమెరికా భారత్‌పై 25 శాతం సుంకాలు విధించాలని నిర్ణయించిన నేపథ్యంలో.. అక్కడి నుంచి దిగుమతి చేసుకునే ఉత్పత్తులపైనా భారత్ అదే స్థాయిలో 25 శాతం ప్రతీకార సుంకాలు విధించాలని సీటీఐ కోరింది.
అమెరికా ఏకపక్ష నిర్ణయాలకు భారత్ తలొగ్గకుండా, దేశ ప్రయోజనాలను కాపాడేలా తగిన చర్యలు తీసుకోవాలని బ్రిజేశ్ గోయల్ సూచించారు.