Noel Tata: టాటా గ్రూప్‌లో ముగిసిన నోయెల్ టాటా శకం.. కొత్త చైర్మన్ల నియామకం
ఈ వార్తాకథనం ఏంటి
టాటా గ్రూప్‌లో కీలక నాయకత్వ మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా కుటుంబానికి చెందిన నోయెల్ టాటా గ్రూప్‌లోని పలు కంపెనీల బాధ్యతల నుంచి వైదొలిగారు. టాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ (టీఐసీ) చైర్మన్, డైరెక్టర్ పదవులకు ఆయన రాజీనామా చేయడంతో 16 ఏళ్లకు పైగా కొనసాగిన ఆయన సారథ్యానికి ముగింపు పడింది. ఆయన అందించిన సేవలను గుర్తించిన కంపెనీ బోర్డు.. గౌరవప్రదంగా 'చైర్మన్ ఎమెరిటస్' పదవిని కట్టబెట్టింది. టాటా గ్రూప్ పాలనాపరమైన నిబంధనల ప్రకారం.. నాన్ ఎగ్జిక్యూటివ్, నాన్ ఇండిపెండెంట్ డైరెక్టర్ల పదవీ విరమణ వయసు 70 ఏళ్లు. ఈ నెలలో నోయెల్ టాటా 70 ఏళ్లు పూర్తి చేసుకోవడంతో ఈ నిబంధన అమల్లోకి వచ్చింది. దీంతో నిన్నటితో ఆయన పదవీకాలం ముగిసింది.
వివరాలు
కొత్త నాయకత్వం.. కీలక నియామకాలు
ఆయన స్థానంలో ప్రముఖ కార్పొరేట్ న్యాయవాది,ఏజెడ్‌బీ అండ్ పార్ట్‌నర్స్ సహ వ్యవస్థాపకుడు బహ్రామ్ వాకిల్ నేటి నుంచి కొత్త చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు.
నోయెల్ టాటా నాయకత్వంలో సంస్థ గణనీయమైన అభివృద్ధి సాధించిందని,వాటాదారులకు దీర్ఘకాలిక విలువను అందించిందని కంపెనీ తన ప్రకటనలో పేర్కొంది.
కొత్త చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్నబహ్రామ్ వాకిల్‌కు కార్పొరేట్ పునర్‌వ్యవస్థీకరణ,దివాలా చట్టాలు,ప్రాజెక్ట్ ఫైనాన్స్ వంటి రంగాల్లో విశేష అనుభవం ఉంది.
ఈ ఏడాది మార్చి నుంచే ఆయన టాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ వైస్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.
మరోవైపు నియోస్ట్రాట్ అడ్వైజర్స్ ఎల్‌ఎల్‌పీ వ్యవస్థాపకుడు అబిజర్ షబ్బీర్ దివాంజీని అదనపు నాన్ ఎగ్జిక్యూటివ్ ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా నియమిస్తూ కంపెనీ బోర్డు నిర్ణయం తీసుకుంది.
ఐదేళ్ల పాటు ఆయన ఈ బాధ్యతల్లో కొనసాగనున్నారు.
వివరాలు
ఇతర కంపెనీల్లోనూ మార్పులు
నాయకత్వ మార్పులు టాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్‌కే పరిమితం కాలేదు. వయోపరిమితి నిబంధనల కారణంగా నోయెల్ టాటా ట్రెంట్, వోల్టాస్, టాటా ఇంటర్నేషనల్ కంపెనీల చైర్మన్ పదవుల నుంచి కూడా తప్పుకున్నారు.
ఈ మార్పుల్లో భాగంగా ట్రెంట్ కొత్త చైర్మన్‌గా బహ్రామ్ వాకిల్ బాధ్యతలు చేపట్టనున్నారు.
వోల్టాస్‌కు సునీల్ డిసౌజా నాయకత్వం వహించనున్నారు. టాటా ఇంటర్నేషనల్ చైర్మన్‌గా టాటా స్టీల్ మేనేజింగ్ డైరెక్టర్ టీవీ నరేంద్రన్ బాధ్యతలు స్వీకరించనున్నారు.
వివరాలు
ఇతర కంపెనీల్లోనూ మార్పులు
అయితే, టాటా గ్రూప్ హోల్డింగ్ సంస్థ అయిన టాటా సన్స్‌లో మాత్రం నోయెల్ టాటా కొనసాగనున్నారు.
టాటా ట్రస్ట్స్ తరఫున నామినీ డైరెక్టర్‌గా, టాటా ట్రస్ట్స్ చైర్మన్‌గా ఆయన తన బాధ్యతలను కొనసాగించనున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా, టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ పునర్నియామకం, గ్రూప్‌లో నాయకత్వ మార్పులు, పాలనాపరమైన అంశాలపై చర్చలు జరుగుతున్న సమయంలో నోయెల్ టాటా పదవుల నుంచి వైదొలగడం ప్రాధాన్యం సంతరించుకుంది.