గూగుల్ పే ద్వారా లోన్ తీసుకునే సదుపాయం: 15వేల రూపాయల నుండి మొదలు
చిన్న వ్యాపారులను ప్రోత్సహించడానికి గూగుల్ సంస్థ గూగుల్ పే(GPay) ద్వారా లోన్లు అందించడానికి సిద్ధమవుతోంది. 15వేల రూపాయల చిన్న మొత్తాలను లోన్ రూపంలో చిన్న వ్యాపారులకు అందించడానికి గూగుల్ పే రెడీ అవుతోంది. చిన్న వ్యాపారులకు ఆర్థికంగా సహాయం అందించే ఉద్దేశంతో లోన్లను తీసుకొస్తున్నారు. పెట్టుబడి అవసరం ఉన్నవారికి అప్పుగా డబ్బును అందించడానికి గూగుల్ పే సంస్థ ePayLater తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం వల్ల చిన్న వ్యాపారులు అప్పుగా అమౌంట్ ని తమ పెట్టుబడి అవసరాల కోసం పొందవచ్చు. అంతేకాదు, వ్యక్తిగత లోన్స్ అందించడానికి యాక్సిస్ బ్యాంక్(Axis Bank) తో గూగుల్ పే భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది.
యూపీఐ లావాదేవీల్లో గూగుల్ పే రెండవ స్థానం
యూపీఐ ఫ్లాట్ ఫామ్ ద్వారా వ్యాపారులకు అప్పుగా అమౌంట్ అందివ్వడానికి ఐసిఐసిఐ బ్యాంక్ తో గూగుల్ పే భాగస్వామ్యం కుదుర్చుకుంది. గూగుల్ ఫర్ ఇండియా 2023 ఈవెంట్ లో భాగంగా గూగుల్ పే(GPay) వైస్ ప్రెసిడెంట్ అంబరీష్ కెంగే మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా యూపీఐ సేవల ద్వారా గత సంవత్సరం 167లక్షల కోట్ల లావాదేవీలు జరిగాయని వెల్లడి చేశాడు. యూపీఐ లావాదేవీల్లో గత సంవత్సరం గూగుల్ పే రెండవ స్థానంలో నిలిచిందని, నెలకు సుమారుగా నాలుగు బిలియన్ల లావాదేవీలు గూగుల్ పే ద్వారా జరిగాయని ఆయన అన్నారు.