NPS Central launched: పెన్షన్ ఖాతాల నిర్వహణ ఇక సులభం.. ఒకే వేదికపై అన్ని సేవలు.. NPS సెంట్రల్ ప్రారంభం
ఈ వార్తాకథనం ఏంటి
జాతీయ పెన్షన్ వ్యవస్థ (NPS) చందాదారులకు సేవలను మరింత సులభతరం చేసేందుకు పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA) NPS Central పేరుతో కొత్త డిజిటల్ వేదికను ప్రారంభించింది. 2026 అక్టోబర్ 1న NPS దివస్ సందర్భంగా అందుబాటులోకి వచ్చిన ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా పెన్షన్ ఖాతాల నిర్వహణ, పెట్టుబడులు, కొత్తగా నమోదు చేసుకోవడం వంటి సేవలను ఒకే చోట పొందవచ్చు. NPS పరిధిలోని Protean, KFintech, CAMS సంస్థల సేవలను ఒకే వేదికపైకి తీసుకొచ్చారు.
వివరాలు
PRAN గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు
ఇప్పటికే NPS ఖాతా ఉన్నవారు తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, పుట్టిన తేదీ వివరాలతో పాటు ఓటీపీ ద్వారా లాగిన్ కావచ్చు.
ప్రతిసారీ శాశ్వత రిటైర్మెంట్ ఖాతా సంఖ్య (PRAN) గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు.
ఈ వేదికపై అన్ని ఖాతాలు, పెట్టుబడుల వివరాలను ఒకే డ్యాష్‌బోర్డ్‌లో చూడొచ్చు.
కొత్త పథకాలను పరిశీలించడం, వాటి రాబడులు, ఛార్జీలను పోల్చడం, పెట్టుబడులు పెట్టడం, వ్యక్తిగత వివరాలను మార్చడం, ఖాతా స్టేట్‌మెంట్లు డౌన్‌లోడ్ చేసుకోవడం, వివిధ మార్గాల్లో చేసిన చెల్లింపులను ట్రాక్ చేయడం వంటి సదుపాయాలు ఉన్నాయి.
ఫిర్యాదుల కోసం పెన్షన్ సహాయక్ పోర్టల్‌ను కూడా ఉపయోగించవచ్చు.
వివరాలు
కొత్త చందాదారులకు AI సాయం
NPSలో కొత్తగా చేరాలనుకునేవారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సహాయంతో నమోదు ప్రక్రియను పూర్తి చేయవచ్చు.
కేవైసీ కోసం సెంట్రల్ కేవైసీ (CKYC), డిజిలాకర్ సదుపాయాలు ఉన్నాయి. పెట్టుబడి పథకాలు, వాటి పనితీరును పోల్చి పెన్షన్ ఫండ్‌ను ఎంచుకోవచ్చు.
నమోదు పూర్తయిన తర్వాత ఎలక్ట్రానిక్ PRAN (e-PRAN) అందుతుంది.
వర్తించే నిబంధనలకు లోబడి ఈ వేదిక ద్వారా నమోదు చేసుకోవడానికి ఎలాంటి ఛార్జీలు లేవు. అలాగే NPS Swasthya పథకంలోనూ నమోదు చేసుకోవచ్చు.
భవిష్యత్తులో NPSపై రుణాలు, సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP), NPS Vatsalya ఖాతాలు, రీ-కేవైసీ, కార్పొరేట్ నమోదు వంటి సేవలను దశలవారీగా అందుబాటులోకి తీసుకురావాలని PFRDA భావిస్తోంది.
మొత్తంగా పెన్షన్ సేవలను సులభంగా, వేగంగా పొందేందుకు ఈ వేదిక ఉపయోగపడనుంది.