NSE IPO: కనిష్ఠ స్థాయికి NSE IPO GMP.. లిస్టింగ్ లాభాలపై మదుపర్లలో టెన్షన్!
ఈ వార్తాకథనం ఏంటి
ఎన్నో అంచనాలు, సుదీర్ఘ ఎదురుచూపుల తర్వాత పబ్లిక్ ఇష్యూకు వచ్చిన నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE IPO)పై మదుపర్ల ఆశలు క్రమంగా సన్నగిల్లుతున్నాయి. ముఖ్యంగా ఈ పబ్లిక్ ఇష్యూ గ్రే మార్కెట్ ప్రీమియం (GMP) మునుపెన్నడూ లేని కనిష్ఠ స్థాయికి చేరడం ఇందుకు కారణంగా కనిపిస్తోంది. ఎన్‌ఎస్‌ఈ ఐపీఓ ధరల శ్రేణిని ప్రకటించిన సమయంలో గ్రే మార్కెట్ ప్రీమియం (GMP) రూ.192గా ఉంది. అయితే తాజాగా అది రూ.58కి పడిపోయింది. అంటే అనధికారిక మార్కెట్‌లో ఐపీఓ ప్రీమియం విలువ దాదాపు 70 శాతం క్షీణించినట్లయింది. GMPలో ఈ భారీ పతనం లిస్టింగ్ సమయంలో వచ్చే లాభాలపై మదుపర్లలో ఆందోళనకు కారణమవుతోంది.
వివరాలు
రూ.22,562 కోట్ల సమీకరణ లక్ష్యం
ఎన్‌ఎస్‌ఈ రూ.22,562 కోట్లను సమీకరించే లక్ష్యంతో ఐపీఓకు వచ్చింది. ఈ పబ్లిక్ ఇష్యూకు ఒక్కో షేరుకు రూ.1,700-1,785 ధరల శ్రేణిని నిర్ణయించారు.
ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ ప్రారంభమైన రెండో రోజైన శుక్రవారం నాటికే పూర్తి సబ్‌స్క్రిప్షన్‌ను అందుకుంది. సెప్టెంబర్ 21తో ఐపీఓ సబ్‌స్క్రిప్షన్‌కు గడువు ముగియనుంది.
అంటే సబ్‌స్క్రిప్షన్‌కు మరో రోజు మాత్రమే మిగిలి ఉంది. సెప్టెంబర్ 24న ఎన్‌ఎస్‌ఈ షేర్లు బీఎస్‌ఈలో లిస్ట్ కానున్నాయి.
ఈ నేపథ్యంలో లిస్టింగ్‌కు ముందు గ్రే మార్కెట్ ప్రీమియం భారీగా తగ్గిపోవడం మదుపర్లలో ఆందోళనకు దారితీస్తోంది.
వివరాలు
GMP ఎందుకు పడిపోతోంది?
ఎన్‌ఎస్‌ఈ ఐపీఓ పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (OFS) రూపంలో జరుగుతోంది. అంటే ఈ ఐపీఓ ద్వారా ఎన్‌ఎస్‌ఈకి నేరుగా ఒక్క రూపాయి కూడా నిధులు సమకూరవు.
ఐపీఓలో తమ వాటాలను విక్రయిస్తున్న షేర్‌హోల్డర్లకే మొత్తం నిధులు వెళ్తాయి.
దేశంలో అతిపెద్ద స్టాక్ ఎక్స్ఛేంజ్‌గా ఎన్‌ఎస్‌ఈకి గుర్తింపు ఉన్నప్పటికీ.. సంస్థ విస్తరణకు లేదా టెక్నాలజీ అభివృద్ధికి ఐపీఓ ద్వారా కొత్త మూలధనాన్ని సమీకరించకపోవడం మదుపర్లలో నిరాసక్తతకు కారణమవుతోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
వివరాలు
లిస్టింగ్ లాభాలు దక్కే అవకాశం
మరోవైపు, మదుపర్లకు కనీసం కొంతమేర లిస్టింగ్ లాభాలు దక్కే అవకాశం ఉండాలనే ఉద్దేశంతోనే ఐపీఓకు ముందు ఎన్‌ఎస్‌ఈ ఇష్యూ పరిమాణాన్ని తగ్గించిందనే అభిప్రాయాన్ని కూడా నిపుణులు వ్యక్తం చేస్తున్నారు
ఈ పరిణామాల నేపథ్యంలో ఐపీఓ ధరల శ్రేణి ప్రకటించిన సమయంలో రూ.192గా ఉన్న GMP తాజాగా రూ.58కు పడిపోవడం.. సెప్టెంబర్ 24న జరగనున్న ఎన్‌ఎస్‌ఈ లిస్టింగ్‌పై మదుపర్ల ఆసక్తి, అంచనాలపై ప్రభావం చూపుతోంది