Nvidia: ఎన్విడియా మార్కెట్ విలువలో భారీ కోత.. ఆవిరైన రూ.147 లక్షల కోట్ల ఆవిరి
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచంలోనే అతిపెద్ద చిప్ తయారీ సంస్థల్లో ఒకటైన నివిడియా (Nvidia) తీవ్ర ఒడుదొడుకులను ఎదుర్కొంటోంది. కేవలం నెల రోజులకు పైగా వ్యవధిలోనే కంపెనీ మార్కెట్ విలువ ఏకంగా 1.57 లక్షల కోట్ల డాలర్లు (సుమారు రూ.147.36 లక్షల కోట్లు) తగ్గిపోయింది. ఈ మొత్తం భారత్ వార్షిక స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో దాదాపు మూడో వంతుకు సమానం. చైనా గూఢచర్య ఆరోపణలు, సంస్థ సీఈవో జెన్సన్ హువాంగ్ చుట్టూ నెలకొన్న వివాదాలు, కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో పెట్టుబడుల భవిష్యత్తుపై అనుమానాలు కంపెనీ షేర్లను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి.
వివరాలు
గరిష్ఠ స్థాయి నుంచి భారీ పతనం
అక్టోబర్‌లో ఎన్విడియా మార్కెట్ విలువ 5.88 లక్షల కోట్ల డాలర్లకు చేరింది.
ఇది కంపెనీ 52వారాల గరిష్ఠ స్థాయి.అయితే నవంబర్ 9 నాటికి ఆ విలువ 4.31లక్షల కోట్ల డాలర్లకు పడిపోయింది.
దీంతో కేవలం నెల రోజులకు పైగా వ్యవధిలోనే 1.57లక్షల కోట్ల డాలర్ల సంపద ఆవిరైంది.
ఈ నష్టం టెస్లా మొత్తం మార్కెట్ విలువైన 1.49లక్షల కోట్ల డాలర్ల కంటే కూడా ఎక్కువ కావడం గమనార్హం.
నవంబర్ 9న ఎన్విడియా షేరు 178.67 డాలర్ల వద్ద ముగిసింది.
52 వారాల గరిష్ఠ ధర 243.37 డాలర్లతో పోలిస్తే 26 శాతానికి పైగా తగ్గింది. గత వారంలో 14 శాతం, గత నెల రోజుల్లో 22 శాతం మేర షేరు విలువ క్షీణించింది.
వివరాలు
ఏఐ పెట్టుబడులపై అనుమానాలు.. సీఈవో చుట్టూ వివాదాలు
కృత్రిమ మేధ రంగంలో ప్రస్తుతం భారీగా పెట్టుబడులు పెడుతున్నారు.
అయితే ఇదే స్థాయిలో భవిష్యత్తులోనూ పెట్టుబడులు కొనసాగుతాయా?వాటి ద్వారా ఆశించిన ఫలితాలు వస్తాయా?అనే సందేహాలు ఇన్వెస్టర్లలో వ్యక్తమవుతున్నాయి.
దీనికి తోడు నియంత్రణపరమైన అనిశ్చితి కూడా ఎన్విడియా షేర్లపై ఒత్తిడి పెంచుతోంది.
మరోవైపు కంపెనీ సీఈవో జెన్సన్ హువాంగ్ చుట్టూ గూఢచర్య ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.
సింగపూర్‌కు చెందిన డేటా సెంటర్ సంస్థ మెగాస్పీడ్లో గతంలో పనిచేసిన ఆలిస్ హువాంగ్‌తో తనకు వివాహేతర సంబంధం ఉన్నట్లు జెన్సన్ ఉద్యోగుల వద్ద అంగీకరించినట్లు వార్తలు వెలువడ్డాయి.
ఆమె చైనా నిఘా సంస్థ తరఫున పనిచేస్తున్నారనే అనుమానాలు ఉన్నట్లు అమెరికా నిఘావర్గాల రహస్య నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం.
ఈ పరిణామాలు కూడా కంపెనీపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి.
వివరాలు
త్రైమాసిక ఫలితాలపై ఇన్వెస్టర్ల దృష్టి
నవంబర్ 17న విడుదల కానున్న త్రైమాసిక ఆర్థిక ఫలితాల కోసం ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
2027 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఎన్విడియా 96.2బిలియన్ డాలర్ల ఆదాయాన్ని నమోదు చేసింది.
గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది రెట్టింపు కంటే ఎక్కువ. ఈ ఆదాయంలో డేటా సెంటర్ విభాగం కీలక పాత్ర పోషించింది. ఈ విభాగం ద్వారా 89బిలియన్ డాలర్ల ఆదాయం వచ్చింది.
అంటే కంపెనీ మొత్తం ఆదాయంలో 92 శాతానికి పైగా ఈ ఒక్క విభాగం నుంచే సమకూరింది.
ఇక మూడో త్రైమాసికంలో 108బిలియన్ డాలర్ల ఆదాయం వస్తుందని ఎన్విడియా అంచనా వేసింది.
తాజా ఫలితాలు ఏఐ చిప్‌లకు మార్కెట్లో ఉన్న డిమాండ్ ఎంత బలంగా ఉందో స్పష్టం చేయనున్నాయి.
వివరాలు
షేర్ల పతనంపై విశ్లేషకుల ఆశాభావం
ఎన్విడియా షేరు ధర గణనీయంగా తగ్గినప్పటికీ వాల్‌స్ట్రీట్ విశ్లేషకులు మాత్రం కంపెనీ భవిష్యత్తుపై ఆశాజనకంగానే ఉన్నారు.
వచ్చే 12 నెలల్లో ఎన్విడియా షేరు సగటు ధర 327.14 డాలర్లకు చేరుకునే అవకాశం ఉందని వారు అంచనా వేస్తున్నారు.
ప్రస్తుత పతనాన్ని మార్కెట్ పరిస్థితుల నేపథ్యంలో చూస్తున్న విశ్లేషకులు, ఏఐ చిప్‌లకు ఉన్న డిమాండ్ కంపెనీకి మద్దతుగా నిలుస్తుందని భావిస్తున్నారు.