AI Data Centre Power Demand: డేటా సెంటర్లకు పవర్ కష్టాలు.. టర్బైన్లు, జెట్ ఇంజిన్లకు పెరుగుతున్న గిరాకీ
ఈ వార్తాకథనం ఏంటి
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగం పెరుగుతున్న కొద్దీ డేటా సెంటర్లకు విద్యుత్ అవసరాలు కూడా భారీగా పెరుగుతున్నాయి. అయితే ఈ కేంద్రాలకు నిరంతరం విద్యుత్ అందించే గ్యాస్ టర్బైన్లు కొత్తవి కొనాలంటే ఏళ్ల తరబడి ఎదురుచూడాల్సి వస్తోంది. దీంతో టెక్నాలజీ సంస్థలు, విద్యుత్ కంపెనీలు పాత టర్బైన్లు, వాడుకలో లేని యంత్రాలు, రిటైర్ అయిన విమానాల జెట్ ఇంజిన్ల కోసం వెతుకుతున్నాయి. అవసరానికి తగ్గ పరికరాలు దొరకకపోవడమే ఇప్పుడు ఏఐ రంగం ఎదుర్కొంటున్న కీలక సవాలుగా మారింది.
Details
కొత్త టర్బైన్ల కోసం 2030 వరకు నిరీక్షణ
ఎనర్జీ కన్సల్టెన్సీ సంస్థ వుడ్ మెకంజీ విశ్లేషకురాలు అరోరా టెనోరియో ప్రకారం, అమెరికాలో కొత్త టర్బైన్ల సరఫరా చర్చలు 2030-2031 కాలానికి చేరుకున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా గ్యాస్ టర్బైన్ల ఆర్డర్లు 100 గిగావాట్లను దాటాయి. కానీ వార్షిక తయారీ సామర్థ్యం 60-70 గిగావాట్ల మధ్యే ఉంది.
దీంతో పాత, రీఫర్బిష్డ్ పరికరాలకు గిరాకీ పెరిగింది. అయితే వాటి నిర్వహణ చరిత్ర, మిగిలిన పని సామర్థ్యం వంటి అంశాలు కొనుగోలుదారులకు సవాలుగా మారుతున్నాయి.
Details
కొత్త వాటితో పోలిస్తే పాత టర్బైన్లు చౌక
పరికరాల ధరల్లోనూ భారీ వ్యత్యాసం ఉంది. ఒరిజిన్ పార్ట్నర్స్ వివరాల ప్రకారం, బాగా నిర్వహించిన పాత టర్బైన్ ఒక్క మెగావాట్ సామర్థ్యానికి సుమారు 15-17 లక్షల డాలర్లు పలుకుతోంది.
రీఫర్బిష్డ్ యూనిట్ ధర 13 లక్షల డాలర్ల వరకు ఉండగా, కొత్త టర్బైన్‌కు 20-25 లక్షల డాలర్లు ఖర్చవుతోంది.
చిన్న టర్బైన్లను ఒకే కేంద్రంలో పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి.
Details
గ్యాస్ ఇంజిన్ల వైపు కూడా కంపెనీల చూపు
విద్యుత్ అవసరాలకు ప్రత్యామ్నాయ మార్గాలను కూడా సంస్థలు అన్వేషిస్తున్నాయి.
ఫిన్లాండ్కు చెందిన వార్ట్సిలా సంస్థ 2025 వసంతకాలం నుంచి అమెరికా డేటా సెంటర్ల కోసం గ్యాస్ ఇంజిన్ల ఆధారిత విద్యుత్ యూనిట్లకు సుమారు 3 గిగావాట్ల ఆర్డర్లు పొందింది.
అయినప్పటికీ పాత టర్బైన్లు, జెట్ ఇంజిన్లు మాత్రమే ఈ కొరతను పూర్తిగా తీర్చలేవని నిపుణులు చెబుతున్నారు.
గ్రిడ్ అనుసంధానం, అనుమతులు వంటి సమస్యలూ ఉన్నాయి. ఏఐ విస్తరణలో కంప్యూటింగ్ సామర్థ్యంతో పాటు విద్యుత్ సరఫరా కూడా ఎంత కీలకమో ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.