Oil Prices: హర్మూజ్ జలసంధిలో మళ్లీ ఉద్రిక్తత.. ముడి చమురు ధరలకు రెక్కలు.. సరఫరాపై ఆందోళన
ఈ వార్తాకథనం ఏంటి
హర్మూజ్ జలసంధిలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అమెరికా,ఇరాన్ మధ్య నౌకలను లక్ష్యంగా చేసుకుని పరస్పర దాడులు జరగడం అంతర్జాతీయ చమురు మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన మార్గాల్లో ఒకటైన హర్మూజ్ జలసంధి సమీపంలో పరిణామాలు చోటుచేసుకోవడంతో ముడి చమురు సరఫరాకు దీర్ఘకాలికంగా అంతరాయం ఏర్పడొచ్చన్న ఆందోళనలు మార్కెట్లను కుదిపేస్తున్నాయి. అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకారం.. ఇరాన్‌కు చెందిన ఆయిల్ ట్యాంకర్లపై దాడులు జరిగాయి. దీనికి ప్రతిస్పందనగా ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ నేవీ కూడా రంగంలోకి దిగింది. అమెరికా నౌకలతో పాటు,అనుమతి లేని మార్గాల్లో ప్రయాణిస్తున్న ట్యాంకర్లను లక్ష్యంగా చేసుకున్నట్లు వెల్లడించింది. వరుసగా చోటుచేసుకుంటున్న ఈదాడులను విశ్లేషకులు పెద్దస్థాయి ఘర్షణకు సంకేతాలుగా అభివర్ణిస్తున్నారు.
వివరాలు
నౌకల రాకపోకలకు భారీగా అంతరాయం
అమెరికా-ఇరాన్ ఘర్షణల ప్రభావం హర్మూజ్ జలసంధిపై స్పష్టంగా కనిపిస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా జరిగే చమురు సరఫరాలో దాదాపు 20 శాతం ఈ జలసంధి మీదుగానే సాగుతుంది.
అలాంటి కీలక మార్గంలో ప్రస్తుతం నౌకల రాకపోకలు గణనీయంగా తగ్గిపోయాయి. గతంలో రోజుకు 100కు పైగా నౌకలు ఈ మార్గంలో ప్రయాణించేవి.
ఇప్పుడు ఆ సంఖ్య కేవలం 10కి పడిపోయింది. పరిస్థితులు మరింత తీవ్రతరం అయితే హర్మూజ్ ప్రాంతంలో కొత్తగా 'రిస్ట్రిక్టెడ్ జోన్'ను ప్రకటించేందుకు ఇరాన్ సిద్ధమవుతున్నట్లు సమాచారం.
వివరాలు
చమురు ధరలకు భారీ ఊపు
హర్మూజ్‌లో నెలకొన్న పరిణామాల ప్రభావం అంతర్జాతీయ చమురు ధరలపైనా పడింది.
అంతర్జాతీయ బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 0.54శాతం పెరిగి 96.80 డాలర్లకు చేరుకుంది.
అమెరికా బెంచ్‌మార్క్ డబ్ల్యూటీఐ క్రూడ్ ధర కూడా 0.72శాతం పెరిగి 92.14డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
అంతకుముందు వారంలోనే ఈ రెండు ధరలు 8 నుంచి 10శాతం వరకు పెరగడం గమనార్హం.
ఉత్పత్తిలో మార్పులు వద్దన్న ఒపెక్ ప్లస్
మరోవైపు.. సెప్టెంబర్ 6న సమావేశమైన ఒపెక్ ప్లస్ దేశాలు అక్టోబర్ నెలకు సంబంధించిన చమురు ఉత్పత్తి విధానంలో ఎలాంటి మార్పులు చేయకూడదని నిర్ణయించాయి.
హర్మూజ్‌లో సరఫరా పరిస్థితులు అనిశ్చితంగా ఉన్న సమయంలో ఉత్పత్తి విధానంలో మార్పులు లేకపోవడం మార్కెట్లపై మరింత ప్రభావం చూపే అవకాశం ఉంది.
వివరాలు
ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం
హర్మూజ్ జలసంధిలో చమురు సరఫరాకు ఏర్పడుతున్న అంతరాయాలు కొనసాగితే ముడి చమురు ధరలు మరింత పెరిగే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
కొన్ని సంస్థల అంచనాల ప్రకారం.. 2026 చివరివరకు చమురు ఎగుమతులు పరిమిత స్థాయిలోనే కొనసాగే అవకాశం ఉంది.
పరిస్థితులు పూర్తిగా సాధారణ స్థితికి రావడానికి 2027వరకు సమయం పట్టొచ్చని పేర్కొంటున్నాయి.
చమురు సరఫరాలో దీర్ఘకాలిక అంతరాయం ఏర్పడితే దాని ప్రభావం కేవలం ఇంధన మార్కెట్లకే పరిమితం కాకపోవచ్చు.
ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరగడంతో పాటు ఆర్థిక వృద్ధి మందగించే ప్రమాదం ఉంది. ఇక ముందు అమెరికా,ఇరాన్ మధ్య ఎలాంటి దాడులు చోటుచేసుకుంటాయి?దౌత్యపరమైన చర్చలు ఏ దిశగా సాగుతాయి?అన్న అంశాలపైనే అంతర్జాతీయ చమురు మార్కెట్ల తదుపరి గమనం ఆధారపడి ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.