Ola Electric layoffs: పునర్వ్యవస్థీకరణలో భాగంగా 500 ఉద్యోగులను తొలగించిన ఓలా ఎలక్ట్రిక్
ఓలా ఎలక్ట్రిక్ ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది. సంస్థ పునర్వ్యవస్థీకరణ చర్యల్లో భాగంగా 500 మందిని లేఆఫ్ చేసినట్లు సమాచారం. వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను దశలవారీగా తొలగిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ నిర్ణయం విక్రయానంతర సేవలపై వస్తున్న విమర్శలతో పాటు కంపెనీ మార్జిన్లు, లాభదాయకతను పెంపొందించుకోవడంపై దృష్టి సారించడం అనే ఉద్దేశంతో తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ తొలగింపు ప్రక్రియ జులై నెల నుంచి ప్రారంభమై ఇప్పటివరకు కొనసాగుతుందని, ఈ నెలాఖరుకల్లా పూర్తి కావచ్చని తెలుస్తోంది. కంపెనీ ప్రస్తుతం ఉన్న శ్రామికశక్తిని మరింత సమర్థవంతంగా వినియోగించి, వ్యయ నియంత్రణ లక్ష్యాలను సాధించడానికి చర్యలు తీసుకుంటోంది.
99 శాతం సమస్యలను పరిష్కరించాము: ఓలా
ఇటీవల ఓలా ఎలక్ట్రిక్‌పై వినియోగదారుల నుండి పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడం గమనార్హం. సుమారు 10,000 ఫిర్యాదులు రావడంతో సీసీపీఏ సంస్థ ఈ అంశంపై నోటీసులు జారీ చేసింది. దీనిపై స్పందించిన కంపెనీ 99 శాతం సమస్యలను పరిష్కరించామని పేర్కొంది. అయినప్పటికీ, సీసీపీఏ సమగ్ర దర్యాప్తునకు ఆదేశించింది. కాగా, ఎన్‌ఎస్‌ఈలో ఓలా ఎలక్ట్రిక్ షేర్లు స్వల్ప లాభంతో రూ.68 వద్ద కొనసాగుతున్నాయి.