ONDC : గ్రామీణ ప్రాంతాలకు సేవలను విస్తరించనున్న ఓఎన్‌డీసీ
వివిధ రకాల భాగస్వాములకు డిజిటల్ ప్లాట్ ఫామ్‌లలో సమానమైన అవకాశాలను అందించడం ద్వారా టెక్ ఇండస్ట్రీలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి ఓపెన్ నెట్ వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ONDC) ని రూపొందించారు. తాజాగా ఉపకరణాల మరమ్మత్తు, బోధనా సహాయం వంటి నైపుణ్యం-ఆధారిత ఆఫర్‌లను జోడించడం ద్వారా తన సేవలను విస్తరించాలని ఓఎన్‌డీసీ భావిస్తోంది. ప్రస్తుతం, ONDCలో ఆహారం, కిరాణా సామాగ్రి, మొబిలిటీ సేవలు అందుతాయి. అయితే ఇందులో నైపుణ్యం ఆధారిత సేవలను చేర్చాలని సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాల నుండి తమకు అనేక అభ్యర్థనలు అందాయని చీఫ్ బిజినెస్ ఆఫీసర్ శిరీష్ జోషి పేర్కొన్నారు.
అద్భుతమైన పురోగతిని సాధించిన ఓఎన్‌డీసీ
అర్బన్ కంపెనీ లాంటి వేదిక ఈ విస్తరణకు ఉపయోగకరంగా ఉంటుందని జోషి సూచించారు. ONDC ఇటీవలి కాలంలో అద్భుతమైన పురోగతిని సాధించింది. వారానికి సగటు ఆర్డర్‌లు రోజుకు 1,00,000 లావాదేవీలను అధించమించడం విశేషం. నెలవారీ లావాదేవీలు మూడు మిలియన్లకు మించి ఉన్నాయి. G20 వంటి ఈవెంట్‌ల ద్వారా ONDC ప్రపంచవ్యాప్త గుర్తింపును పొందింది. పట్టణ ప్రాంతాలలో దాని విస్తరణతో పాటు, ONDC స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SIDBI), NABARD, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, వ్యవసాయ మంత్రిత్వ శాఖ వంటి ఏజెన్సీలతో భాగస్వామ్యం చేయడం ద్వారా గ్రామీణ ప్రాంతాలకు విస్తరించాలని చూస్తోంది.