Jensen Huang: ఉద్యోగులకు సాధ్యమైనంత ఎక్కువ జీతాలు ఇవ్వాలి: ఎన్విడియా సీఈవో హువాంగ్
ఈ వార్తాకథనం ఏంటి
కృత్రిమ మేధ (AI) రంగం వల్ల కంపెనీలు భారీ లాభాలు ఆర్జిస్తున్న నేపథ్యంలో, ఆ సంపదలో ఉద్యోగులకూ తగిన వాటా దక్కాలని నివిడియా (Nvidia) సీఈవో జెన్సన్ హువాంగ్ అభిప్రాయపడ్డారు. తైపీ నగరంలో జరుగుతున్న కంప్యూటెక్స్ (Computex) టెక్నాలజీ ప్రదర్శనలో మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన, "ఉద్యోగులకు సాధ్యమైనంత ఎక్కువ జీతాలు చెల్లించాలి" అని పేర్కొన్నారు. ఇటీవల శామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ తమ కార్మిక సంఘంతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం వేలాది మంది చిప్ ఇంజినీర్లకు భారీ బోనస్‌లు అందనున్న విషయం గురించి ప్రశ్నించగా హువాంగ్ స్పందించారు.
వివరాలు
ప్రపంచంలోనే అత్యంత విలువైన పబ్లిక్ కంపెనీలలో ఒకటిగా ఎన్విడియా
"ఆ అంశంలో నేను నిపుణుడిని కాదు. కానీ ఉద్యోగులకు వీలైనంత ఎక్కువగా చెల్లించాలని నేను నమ్ముతాను. నా ఉద్యోగులను అడిగినా అదే చెబుతారు. నేను చేయగలిగినంత ఎక్కువగా వారికి చెల్లిస్తాను. అయితే నా విధానం మాత్రమే సరైందని చెప్పలేను" అని అన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఏఐ విప్లవానికి కేంద్రంగా నిలిచిన ఎన్విడియా, సెమీకండక్టర్ రంగంలో భారీ మార్పులకు కారణమైంది. ఏఐ చిప్‌లకు పెరిగిన డిమాండ్‌తో గత ఐదేళ్లలో కంపెనీ షేర్ ధర 1,170 శాతానికి పైగా పెరిగింది. దీంతో ప్రపంచంలోనే అత్యంత విలువైన పబ్లిక్ కంపెనీలలో ఒకటిగా ఎన్విడియా నిలిచింది. షేర్ ఆధారిత వేతన విధానాల కారణంగా కంపెనీలో చాలాకాలంగా పనిచేస్తున్న ఉద్యోగులు కూడా గణనీయమైన సంపదను సంపాదించారు.
వివరాలు
అర్హులైన ఉద్యోగులకు ఈ ఏడాది సుమారు 3.3 లక్షల డాలర్ల వరకు బోనస్‌లు
ఇదే సమయంలో దక్షిణ కొరియాలో ఉద్యోగుల వేతనాలు, బోనస్‌ల అంశం చర్చనీయాంశంగా మారింది. శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ ఇటీవల తమ యూనియన్‌తో ఒప్పందం కుదుర్చుకోవడంతో సమ్మె ముప్పు తప్పింది. ఈ ఒప్పందం ప్రకారం అర్హులైన ఉద్యోగులకు ఈ ఏడాది సుమారు 3.3 లక్షల డాలర్ల వరకు బోనస్‌లు అందే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఏఐ సర్వర్లు, డేటా సెంటర్లకు అవసరమైన హై-బ్యాండ్‌విడ్త్ మెమరీ (HBM) చిప్‌ల సరఫరాలో శామ్‌సంగ్ కీలక పాత్ర పోషిస్తోంది. దీంతో ఏఐ పెట్టుబడుల పెరుగుదల వల్ల కంపెనీ లాభాలు కూడా గణనీయంగా పెరిగాయి.
వివరాలు
విండోస్ ల్యాప్‌టాప్‌ల కోసం కొత్త ఏఐ ప్రాసెసర్
జెన్సన్ హువాంగ్ శుక్రవారం దక్షిణ కొరియా పర్యటనకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఎస్‌కే గ్రూప్, హ్యుందాయ్ మోటార్ గ్రూప్ వంటి ప్రముఖ సంస్థల ప్రతినిధులతో ఆయన సమావేశం కానున్నారు. స్థానిక మీడియా కథనాల ప్రకారం రోబోటిక్స్, స్వయంచాలక వ్యవస్థలు, అలాగే రోబోలు, వాహనాలు, పారిశ్రామిక యంత్రాలతో నేరుగా పనిచేసే 'ఫిజికల్ ఏఐ' సాంకేతికతలపై చర్చలు జరగనున్నాయి. అలాగే కంప్యూటెక్స్ కార్యక్రమంలో సోమవారం ఎన్విడియా విండోస్ ల్యాప్‌టాప్‌ల కోసం కొత్త ఏఐ ప్రాసెసర్‌ను ఆవిష్కరించింది. దీంతో ఏఐ ఆధారిత వ్యక్తిగత కంప్యూటర్ల మార్కెట్లో ఆపిల్, ఏఎండీ, ఇంటెల్ కంపెనీలతో పోటీ మరింత తీవ్రమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.