Loading...
Paytm Q2 Results: పేటీయం రాత మార్చిన కొత్త వ్యూహాలు.. ఏకంగా 976 శాతం పెరిగిన లాభాలు..
పేటీయం రాత మార్చిన కొత్త వ్యూహాలు.. ఏకంగా 976 శాతం పెరిగిన లాభాలు..

Paytm Q2 Results: పేటీయం రాత మార్చిన కొత్త వ్యూహాలు.. ఏకంగా 976 శాతం పెరిగిన లాభాలు..

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 27, 2026
10:07 am

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశంలోని ప్రముఖ కంపెనీలు 2026-27 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం (Q2) ఫలితాలను ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే ఐటీ కంపెనీలు తమ ఫలితాలను వెల్లడించగా.. ఆ తర్వాత బ్యాంకులు, ఫార్మా సంస్థలు, ఇతర ప్రముఖ కంపెనీలు కూడా క్యూ2 గణాంకాలను ప్రకటించాయి. తాజాగా ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ పేటియం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ తన ఆర్థిక ఫలితాలను వెల్లడించింది. ఈసారి సంస్థ లాభాల్లో భారీ పెరుగుదల నమోదైంది. జులై నుంచి సెప్టెంబర్ వరకు నికర లాభం రూ.226 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో లాభం కేవలం రూ.21కోట్లుగా ఉంది. దీంతో ఏడాది ప్రాతిపదికన లాభం ఏకంగా 976 శాతం పెరిగింది. అంటే దాదాపు పదింతల వృద్ధిని పేటీఎం నమోదు చేసింది.

వివరాలు 

3 శాతం పెరిగిన క్యూ2లో నికర లాభం

ఇదే సమయంలో కంపెనీ కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం కూడా పెరిగింది.

గత ఏడాదితో పోలిస్తే 28 శాతం వృద్ధి చెంది రూ.2,648 కోట్లకు చేరుకుంది.

ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో నమోదైన రూ.220 కోట్ల లాభంతో పోలిస్తే క్యూ2లో నికర లాభం 3 శాతం పెరిగింది.

మరోవైపు, వడ్డీ, పన్నులు, తరుగుదల, రుణ విమోచనకు ముందు ఆదాయాన్ని సూచించే ఎబిటా (EBITDA) 91.5 శాతం పెరిగి రూ.270 కోట్లకు చేరుకుంది.

గత ఏడాది ఇదే సమయంలో ఇది రూ.142 కోట్లుగా ఉంది. ఎబిటా మార్జిన్ కూడా 6.8 శాతం నుంచి 10.2 శాతానికి మెరుగుపడింది.

వివరాలు 

ఫైనాన్షియల్ సర్వీసెస్ డిస్ట్రిబ్యూషన్ విభాగంలో గణనీయంగా పెరిగిన ఆదాయం 

పేటీఎం లాభాలు పెరగడానికి ఖర్చులను తగ్గించుకోవడం కూడా ప్రధాన కారణంగా నిలిచింది.

గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.190 కోట్లుగా ఉన్న సంబంధిత ఖర్చులు ఈసారి కేవలం రూ.4 కోట్లకు తగ్గాయి.

మరోవైపు, ఫైనాన్షియల్ సర్వీసెస్ డిస్ట్రిబ్యూషన్ విభాగంలో ఆదాయం గణనీయంగా పెరిగింది.

గత ఏడాది రూ.611 కోట్లుగా ఉన్న ఈ విభాగం ఆదాయం 49 శాతం వృద్ధితో రూ.912 కోట్లకు చేరుకుంది.

ప్రస్తుతం పేటీఎంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న వ్యాపార విభాగాల్లో ఇది ముందుంది.

బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల భాగస్వామ్యంతో వ్యాపారులు, సాధారణ వినియోగదారులకు రుణాల పంపిణీ సేవలను కూడా సంస్థ విస్తరిస్తోంది.

క్యూ2 ఫలితాల ప్రకటన సందర్భంగా పేటీఎం బోర్డు మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది.

ADVERTISEMENT

వివరాలు 

పేటీయం వ్యూహం ఎలా మారింది?

సంస్థ అనుబంధ కంపెనీ పేటీఎం క్లౌడ్ టెక్‌లో రూ.500కోట్లు,సింగపూర్‌లోని తన అనుబంధ సంస్థలో మరో రూ.500 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ఆమోదం తెలిపింది.

ఈ పెట్టుబడులు సంస్థ వ్యాపార విస్తరణ ప్రణాళికల్లో భాగంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ఒకప్పుడు సంక్షోభాన్ని ఎదుర్కొన్న పేటీఎం.. ఇప్పుడు తిరిగి లాభాల బాట పట్టడం ఆసక్తికరంగా మారింది.

2024 ప్రారంభంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI)నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై కఠిన ఆంక్షలు విధించింది.

దీంతో సంస్థ కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం పడింది. పేటీఎం వ్యాపారం దెబ్బతినడంతో పాటు కంపెనీ షేరు ధర కూడా భారీగా పడిపోయింది.

షేరు ధర ఒక దశలో ఇష్యూ ధరతో పోలిస్తే 70 నుంచి 80 శాతం వరకు తగ్గింది.

ADVERTISEMENT

వివరాలు 

బ్యాంకింగ్ భాగస్వామ్యాల విస్తరణ 

అయితే, ఆ పరిస్థితుల నుంచి బయటపడేందుకు సంస్థ తన వ్యాపార విధానాలను మార్చుకుంది.

ఖర్చుల నియంత్రణ, కొత్త ఆదాయ మార్గాలు, ఇతర బ్యాంకులతో భాగస్వామ్యాలపై దృష్టి పెట్టి క్రమంగా పుంజుకుంది.

పేటీయం తీసుకున్న కీలక నిర్ణయాల్లో మొదటిది బ్యాంకింగ్ భాగస్వామ్యాలను విస్తరించడం.

గతంలో యాప్ ద్వారా జరిగే అనేక లావాదేవీలకు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కీలకంగా ఉండేది.

ఆర్బీఐ ఆంక్షల కారణంగా ఆ వ్యవస్థలో కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఆ తర్వాత పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్ కూడా రద్దయింది.

అయినప్పటికీ, సంస్థ ప్రత్యామ్నాయ మార్గాలను వేగంగా ఏర్పాటు చేసుకుంది.

ఎస్‌బీఐ సహా ఇతర ప్రముఖ బ్యాంకులతో భాగస్వామ్యాలు కుదుర్చుకుని, వినియోగదారుల యూపీఐ ఐడీలను ఆ బ్యాంకులకు మార్చింది.

వివరాలు 

సౌండ్‌బాక్స్, ఇతర పరికరాల సబ్‌స్క్రిప్షన్ల ద్వారా సంస్థకు ఆదాయం

దీంతో పేటీఎం యాప్ ద్వారా చెల్లింపుల సేవలు కొనసాగేందుకు మార్గం ఏర్పడింది.

మరోవైపు, వినియోగదారులతో పాటు వ్యాపారులను కూడా తన ప్లాట్‌ఫామ్‌లో కొనసాగించడం పేటీయంకు కీలకంగా మారింది.

ముఖ్యంగా దుకాణదారులు ఉపయోగించే సౌండ్‌బాక్స్ పరికరాలు,క్యూఆర్ కోడ్ చెల్లింపు సేవలను మరింత ఆకర్షణీయంగా అందించడంపై దృష్టి పెట్టింది.

దీనివల్ల వ్యాపారులు ఈ సేవలను కొనసాగించేందుకు ఆసక్తి చూపే అవకాశం పెరిగింది. సౌండ్‌బాక్స్, ఇతర పరికరాల సబ్‌స్క్రిప్షన్ల ద్వారా సంస్థకు క్రమం తప్పకుండా ఆదాయం లభిస్తోంది.

ఖర్చుల నియంత్రణపైనా పేటీఎం ప్రత్యేక దృష్టి పెట్టింది. అనవసర వ్యయాలను తగ్గించడంతో పాటు కృత్రిమ మేధ (AI)వినియోగాన్ని పెంచింది.

దీంతో తక్కువ ఖర్చుతో ఎక్కువ ఉత్పాదకత సాధించేందుకు ప్రయత్నించింది.

ఫలితంగా కార్యకలాపాల సామర్థ్యం మెరుగుపడి, ఆపరేటింగ్ మార్జిన్లు పెరిగాయి.

వివరాలు 

రుణాల పంపిణీ సేవల్లోనూ కొత్త విధానం 

అలాగే, ప్రధాన వ్యాపారమైన డిజిటల్ చెల్లింపులపై మరింత దృష్టి పెట్టేందుకు సంస్థ తన వ్యాపార విభాగాలను పునర్వ్యవస్థీకరించింది.

రుణాల పంపిణీ సేవల్లోనూ పేటీఎం కొత్త విధానాన్ని అనుసరిస్తోంది. గతంలో మాదిరిగా నేరుగా రుణాలు ఇచ్చే బదులు, ఇతర బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలతో (NBFCలు) భాగస్వామ్యం కుదుర్చుకుని రుణాల పంపిణీ సేవలను అందిస్తోంది.

ఈ సేవల ద్వారా కమిషన్లు, ఫీజుల రూపంలో ఆదాయం పొందుతోంది. రుణాలను నేరుగా ఇవ్వాల్సిన అవసరం లేకుండా భాగస్వామ్య సంస్థల ద్వారా ఈ వ్యాపారాన్ని నిర్వహించడం వల్ల రుణాలకు సంబంధించిన ప్రత్యక్ష రిస్క్‌ను తగ్గించుకుంటూ ఆదాయాన్ని పెంచుకునే అవకాశం లభించింది.

వివరాలు 

పేటీయం షేరు రూ.310 నుంచి రూ.1,600 దాటింది!

పేటీయం వ్యాపారంలో వచ్చిన మార్పులతో పాటు కొత్త యూజర్లను చేర్చుకునేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) నుంచి అనుమతులు లభించడం కూడా సంస్థకు కలిసొచ్చింది.

వరుస త్రైమాసికాల్లో లాభాలు పెరగడంతో ఇన్వెస్టర్లలో విశ్వాసం క్రమంగా బలపడింది. దీని ప్రభావం కంపెనీ షేరు ధరపై కూడా కనిపించింది.

2021 నవంబర్ 18న పేటీఎం షేరు ధర రూ.1,955 స్థాయిలో ఉండగా, 2024 మే 9న రూ.310కు పడిపోయింది.

ఇది షేరు చరిత్రలో నమోదైన కనిష్ఠ స్థాయిగా నిలిచింది. అయితే, అక్కడి నుంచి షేరు ధర మళ్లీ పుంజుకుంది.

గత నెల సెప్టెంబర్ 16న రూ.1,855.50 వద్ద 52 వారాల గరిష్ఠాన్ని నమోదు చేసింది.

వివరాలు 

పేటీయం షేరు రూ.310 నుంచి రూ.1,600 దాటింది!

ప్రస్తుతం అక్టోబర్ 26 నాటికి పేటీఎం షేరు ధర రూ.1,654.70గా ఉంది. కంపెనీ మార్కెట్ విలువ సుమారు రూ.1.06 లక్షల కోట్లుగా నమోదైంది.

మొత్తంగా చూస్తే, ఆర్బీఐ ఆంక్షలతో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్న పేటీఎం.. తన వ్యాపార వ్యూహాలను మార్చుకోవడం, ఖర్చులను నియంత్రించడం, బ్యాంకులతో భాగస్వామ్యాలను పెంచుకోవడం, రుణాల పంపిణీ సేవలను విస్తరించడం ద్వారా తిరిగి పుంజుకుంది.

ఈ మార్పులు సంస్థ లాభాల పెరుగుదలకు దోహదం చేశాయి. అయితే, భవిష్యత్తులోనూ ఇదే స్థాయి వృద్ధిని కొనసాగించడం, పోటీని తట్టుకోవడం పేటీఎంకు కీలకం కానుంది.

ADVERTISEMENT