Loading...
Paytm Shares: పేటియం షేర్లలో ఒక్కరోజే రూ.131 పెరుగుదల.. అసలు కారణం ఇదేనా?
పేటియం షేర్లలో ఒక్కరోజే రూ.131 పెరుగుదల.. అసలు కారణం ఇదేనా?

Paytm Shares: పేటియం షేర్లలో ఒక్కరోజే రూ.131 పెరుగుదల.. అసలు కారణం ఇదేనా?

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 10, 2026
02:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ పేమెంట్‌ అగ్రిగేటర్‌ పేటియం మాతృ సంస్థ వన్‌97 కమ్యూనికేషన్‌ షేర్లు సోమవారం భారీగా పుంజుకున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో ఈ స్టాక్‌ 9.15 శాతం లాభంతో రూ.1,573.50 వద్ద ట్రేడవుతోంది. ఒక్కరోజులోనే షేరు ధర దాదాపు రూ.131 మేర పెరిగింది. దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు పెద్దగా కదలకుండా ఫ్లాట్‌గా కొనసాగుతున్న సమయంలో పేటియం షేర్లు మాత్రం దూసుకెళ్లడం గమనార్హం. బెర్న్‌స్టీన్‌ టార్గెట్‌ ధర పెంపు పేటీఎం షేర్లలో ఈ స్థాయి ర్యాలీకి ప్రధాన కారణం గ్లోబల్‌ బ్రోకరేజ్‌ సంస్థ బెర్న్‌స్టీన్‌ తీసుకున్న తాజా నిర్ణయమే. పేటియం టార్గెట్‌ ధరను గతంలో ఉన్న రూ.1,500 నుంచి ఏకంగా రూ.2,200కు పెంచింది.

వివరాలు 

2021 జులైలో స్టాక్‌ మార్కెట్‌లోకి పేటియం ప్రవేశించింది

స్టాక్‌కు 'ఔట్‌పెర్ఫార్మ్‌' రేటింగ్‌ను కొనసాగించింది. శుక్రవారం నాటి ముగింపు ధరతో పోలిస్తే పేటియం షేరు మరో 52 శాతానికి పైగా లాభపడే అవకాశం ఉందని బెర్న్‌స్టీన్‌ అంచనా వేసింది. దీంతో ఇన్వెస్టర్లలో పేటీఎం షేర్లపై ఆసక్తి పెరిగింది.

పేటియం 2021 జులైలో స్టాక్‌ మార్కెట్‌లోకి ప్రవేశించింది. అప్పట్లో కంపెనీ ఇష్యూ ధర రూ.2,150గా ఉంది.

అయితే లిస్టింగ్‌ తర్వాత పేటీఎం షేరు విలువ ఎప్పుడూ ఆ స్థాయికి తిరిగి చేరుకోలేదు.

ఇప్పుడు బెర్న్‌స్టీన్‌ ప్రకటించిన రూ.2,200 టార్గెట్‌ ధర మాత్రం పేటీఎం ఐపీఓ ధర కంటే కూడా ఎక్కువగా ఉంది.

ఐపీఓ సమయంలో ఉన్న ధరను మించి బ్రోకరేజ్‌ సంస్థ అంచనా వేయడం ఈ స్టాక్‌కు సానుకూల అంశంగా మారింది.

వివరాలు 

యూపీఐ ఛార్జీలతో మార్జిన్లు పెరిగే అవకాశం

యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్‌(మర్చంట్‌ డిస్కౌంట్‌ రేట్‌)ఛార్జీలు విధించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఓ బిల్లును తీసుకొచ్చింది.

ఈ ఛార్జీలు 2027-28 ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉందని బెర్న్‌స్టీన్‌ అంచనా వేస్తోంది.

అదే జరిగితే పేటీఎం నికర పేమెంట్‌ మార్జిన్లు 3-4బేసిస్‌ పాయింట్ల మేర పెరిగే అవకాశం ఉందని తన నివేదికలో పేర్కొంది.

గతంలో చేసిన అంచనాలతో పోలిస్తే 2029-30ఆర్థిక సంవత్సరానికి పేటియం ఎర్నింగ్స్‌ పర్‌ షేర్‌ (EPS) 30 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని బెర్న్‌స్టీన్‌ తెలిపింది.

యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు అమల్లోకి రావడం,దాని వల్ల పేమెంట్‌ మార్జిన్లు మెరుగుపడటం వంటి పరిణామాలు కంపెనీ ఆదాయాలపై సానుకూల ప్రభావం చూపవచ్చని బ్రోకరేజ్‌ సంస్థ అంచనా వేస్తోంది.

ADVERTISEMENT

వివరాలు 

వినియోగదారులపై భారం ఉండదన్న కేంద్రం

మరోవైపు డిజిటల్‌ లావాదేవీలపై విధించే ఛార్జీలు కేవలం వ్యాపారులకు మాత్రమే వర్తిస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేశారు.

ఈ ఛార్జీల వల్ల సాధారణ వినియోగదారులపై ఎలాంటి అదనపు భారం ఉండదని ఆమె పేర్కొన్నారు.

దీంతో ప్రతిపాదిత యూపీఐ ఛార్జీల ప్రభావం వినియోగదారుల కంటే వ్యాపారులు, పేమెంట్‌ సంస్థల ఆదాయాలపైనే ఉండే అవకాశం ఉందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

ADVERTISEMENT