SSY,PPF Interest Rates: PPF,SSY,SCSS వడ్డీ రేట్లు యథాతథం.. ఈ రేట్లు ఎలా నిర్ణయిస్తారంటే?
ఈ వార్తాకథనం ఏంటి
మార్కెట్‌లో వచ్చే హెచ్చుతగ్గులతో సంబంధం లేకుండా భద్రమైన పెట్టుబడితో స్థిరమైన రాబడి పొందాలని భావించే మధ్యతరగతి కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికి పోస్టాఫీస్‌తో పాటు వివిధ చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను మార్చకుండా కొనసాగించాలని నిర్ణయించింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజా నిర్ణయం ప్రకారం.. ఈ పథకాలపై ప్రస్తుతం అమల్లో ఉన్న వడ్డీ రేట్లే కొనసాగనున్నాయి. వరుసగా తొమ్మిదో త్రైమాసికంలోనూ రేట్లలో ఎలాంటి మార్పు చేయకపోవడం గమనార్హం. దీంతో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), సుకన్య సమృద్ధి యోజన (SSY), సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) తదితర పథకాల్లో పెట్టుబడులు పెట్టే వారికి గతంలో లభిస్తున్న వడ్డీ ప్రయోజనాలే కొనసాగుతాయి.
వివరాలు
రూ.5 వేల నెలవారీ పొదుపుతో రూ.28.5 లక్షలు
చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో సుకన్య సమృద్ధి యోజన (SSY) ఆకర్షణీయమైన వడ్డీని అందిస్తోంది.
ప్రస్తుతం ఈ పథకంపై 8.2శాతం వడ్డీ అమల్లో ఉంది. ఆడపిల్ల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు లేదా సంరక్షకులు నెలకు రూ.5,000 చొప్పున పొదుపు చేస్తే.. ఏడాదికి రూ.60,000 చొప్పున జమ అవుతుంది.
15ఏళ్లలో మొత్తం రూ.9లక్షలు పెట్టుబడిగా చేరుతుంది.అయితే SSY ఖాతా 21ఏళ్లకు మెచ్యూర్ అవుతుంది.
ప్రస్తుత 8.2శాతం వడ్డీ రేటు కొనసాగుతుందని భావిస్తే.. మెచ్యూరిటీ సమయంలో సుమారు రూ.28.5లక్షల నిధి అందుతుంది.
అంటే పెట్టుబడిదారు జమ చేసిన రూ.9 లక్షలపై దాదాపు రూ.19.5లక్షలు వడ్డీ రూపంలో అదనంగా లభించే అవకాశం ఉంది.
ఈ పథకానికి వర్తించే నిబంధనల ప్రకారం పన్ను ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
వివరాలు
PPFలో రూ.5 వేల పెట్టుబడికి ఎంత రాబడి?
దీర్ఘకాలికంగా సురక్షితమైన పెట్టుబడి మార్గంగా భావించే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF)పై ప్రస్తుతం 7.1 శాతం వడ్డీ లభిస్తోంది.
ప్రతి నెలా రూ.5,000 చొప్పున 15 ఏళ్ల పాటు PPFలో పెట్టుబడి పెడితే.. మొత్తం రూ.9 లక్షలు జమ చేసినట్లవుతుంది.
15 ఏళ్ల కాలం పూర్తయ్యే నాటికి వడ్డీతో కలిపి సుమారు రూ.16 లక్షల నిధి సమకూరుతుంది.
PPFలో లభించే మొత్తానికి వర్తించే పన్ను నిబంధనల ప్రకారం ఈ రాబడికి పన్ను ప్రయోజనం ఉండటం మరో ముఖ్యమైన అంశం.
వివరాలు
పథకాల వారీగా తాజా వడ్డీ రేట్లు
సుకన్య సమృద్ధి యోజన (SSY) - 8.2 శాతం సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) - 8.2 శాతం నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (NSC) - 7.7 శాతం కిసాన్ వికాస్ పత్ర (KVP) - 7.5 శాతం 5 ఏళ్ల పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ - 7.5 శాతం మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ (MIS) - 7.4 శాతం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) - 7.1 శాతం 3 ఏళ్ల పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ - 7.1 శాతం 2 ఏళ్ల పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ - 7.0 శాతం
వివరాలు
ప్రతి మూడు నెలలకు ఒకసారి సమీక్ష
1 ఏడాది పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ - 6.9 శాతం 5 ఏళ్ల రికరింగ్ డిపాజిట్ (RD) - 6.7 శాతం పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్ - 4.0 శాతం
చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లను ప్రభుత్వం ప్రతి మూడు నెలలకోసారి సమీక్షిస్తుంది.
ప్రభుత్వ బాండ్ ఈల్డ్స్, మార్కెట్ పరిస్థితులు, ద్రవ్యోల్బణం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని తదుపరి త్రైమాసికానికి రేట్లపై నిర్ణయం తీసుకుంటుంది.
తాజా నిర్ణయంతో అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో వడ్డీ రేట్లలో ఎలాంటి కోత ఉండదు.
దీంతో డిసెంబర్ 31 వరకు చిన్న మొత్తాల పొదుపు పథకాలలో పెట్టుబడులు పెట్టే వారికి ప్రస్తుతం అమల్లో ఉన్న రేట్ల ప్రకారమే ప్రయోజనాలు కొనసాగనున్నాయి.