CII: రికార్డు స్థాయిలో ప్రైవేటు పెట్టుబడులు.. రూ.7.7 లక్షల కోట్లకు చేరిన క్యాపెక్స్
ఈ వార్తాకథనం ఏంటి
భారతదేశంలో ప్రైవేటు రంగ మూలధన వ్యయాలు గణనీయంగా పెరిగినట్లు భారత పరిశ్రమల సమాఖ్య (Confederation of Indian Industry) వెల్లడించింది. 2025 సెప్టెంబరు నాటికి ఈ వ్యయాలు 67 శాతం పెరిగి రూ.7.7 లక్షల కోట్లకు చేరినట్లు తెలిపింది. ఏడాది క్రితం ఇదే మొత్తం రూ.4.6 లక్షల కోట్ల స్థాయిలో మాత్రమే ఉందని వివరించింది. సభ్య కంపెనీలు రాబోయే రెండు త్రైమాసికాల్లో ఇంధన, విద్యుత్ వినియోగాన్ని 3-5 శాతం వరకు తగ్గించేందుకు కట్టుబడి ఉన్నాయని సీఐఐ పేర్కొంది. అదే సమయంలో పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని పెంచే దిశగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.
వివరాలు
దశల వారీగా ఈ సుంకాల కోతను ఉపసంహరించుకోవాలి
పశ్చిమాసియా సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో దేశీయంగా రిటైల్ ధరలు పెరగకుండా చూడటానికి పెట్రోల్, డీజిల్‌పై కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాలను తగ్గించడాన్ని సీఐఐ ప్రశంసించింది. చమురు ధరలు స్థిరపడిన తర్వాత దశల వారీగా ఈ సుంకాల కోతను ఉపసంహరించుకోవాలని కూడా సూచించింది. ఈ నేపథ్యంలో ఆర్థిక వృద్ధిని వేగవంతం చేసే 5 అంశాలపై ఆధారిత పారిశ్రామిక కార్యాచరణ ప్రణాళికను సీఐఐ విడుదల చేసింది. దేశంలో పెట్టుబడులు పెరుగుతున్న ధోరణి ఆశాజనకమని సీఐఐ పేర్కొంది. ముడి చమురు ధరలు స్థిరమైన తర్వాత 6-9 నెలల వ్యవధిలో ఎక్సైజ్ సుంకాల తగ్గింపును దశలవారీగా ఉపసంహరించాలని సూచించింది.
వివరాలు
పెట్టుబడులు ఏడాది వ్యవధిలో భారీగా పెరిగాయి
ఈలోపు కంపెనీలు ఇంధన సమర్థ వినియోగం, అలాగే విద్యుత్ వాహనాల వినియోగం ద్వారా సంప్రదాయ ఇంధన వినియోగాన్ని 3-5 శాతం తగ్గిస్తాయని తెలిపింది. అలాగే సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు (MSME) 45 రోజుల్లో చెల్లింపుల హామీ ఇవ్వడం, దిగుమతి ప్రత్యామ్నాయంతో సరఫరా వ్యవస్థను బలోపేతం చేయడం, స్వచ్ఛంద ధరల నియంత్రణ, ఇంటర్న్‌షిప్ నియామకాలను పెంపు, ప్రైవేటు మూలధన వ్యయాన్ని ముందుగానే కేటాయించడం వంటి అంశాలను కూడా ప్రస్తావించింది. సీఎంఐఈ ప్రొవెస్ డేటాబేస్ నుంచి సేకరించిన సుమారు 1,200 కంపెనీల డేటా ఆధారంగా సీఐఐ చేసిన విశ్లేషణ ప్రకారం ప్రైవేటు రంగ పెట్టుబడులు ఏడాది వ్యవధిలో భారీగా పెరిగాయి.
వివరాలు
అగ్రస్థానంలో తయారీరంగం
నికర స్థిర ఆస్తులు, నిర్మాణంలో ఉన్న మూలధన పనుల్లో వార్షిక మార్పుగా కొలిచే ఈ పెట్టుబడులు రూ.4.6 లక్షల కోట్ల నుంచి 67 శాతం పెరిగి 2025 సెప్టెంబరు నాటికి రూ.7.7 లక్షల కోట్లకు చేరినట్లు వెల్లడైంది. ఇందులో తయారీ రంగం అగ్రస్థానంలో నిలిచింది. మొత్తం ప్రైవేటు మూలధన వ్యయంలో దాదాపు 50 శాతం అంటే రూ.3.8 లక్షల కోట్ల వాటా తయారీ రంగానిదే. లోహాలు, వాహనాలు, రసాయన రంగాలు ఇందులో ప్రధానంగా ముందున్నాయి. సేవల రంగం రూ.3.1 లక్షల కోట్ల పెట్టుబడులతో సుమారు 40 శాతం వాటాను కలిగి ఉంది.
వివరాలు
రెండో అర్ధభాగంలో 14శాతానికి చేరింది
ఇందులో ట్రేడింగ్, కమ్యూనికేషన్స్, ఐటీ/ఐటీఈఎస్ రంగాలు కీలక పాత్ర పోషించాయి. 2025-26 మూడో త్రైమాసికంలో తయారీ రంగ సామర్థ్య వినియోగం 75.6 శాతానికి పెరిగింది. అంతకుముందు త్రైమాసికంలో ఇది 74.3 శాతంగా ఉంది. కొత్త ఆర్డర్ల సంఖ్య ఏడాది ప్రాతిపదికన 10.3 శాతం పెరిగినట్లు గణాంకాలు చూపించాయి. అలాగే 2025-26 తొలి అర్ధభాగంలో 10 శాతంగా ఉన్న బ్యాంక్ రుణ వృద్ధి, రెండో అర్ధభాగంలో 14 శాతానికి చేరినట్లు తెలిపింది. ప్రపంచ ఆర్థిక అనిశ్చితుల నేపథ్యంలో పరిశ్రమలు ముందుకు వచ్చి జాతీయ ఆర్థిక భారాన్ని పంచుకోవాలని సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ కోరారు.