
ఆర్‌బీఐ ప్రాధాన్య రంగ రుణాల జాబితాలో దేశీయ సోలార్ ప్యానల్ తయారీ పరిశ్రమ
ఈ వార్తాకథనం ఏంటి
ప్రాధాన్యత రంగ రుణ గ్రహీతల జాబితాలో సోలార్ ప్యానెల్ తయారీ రంగాన్ని చేర్చాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) ఆలోచిస్తోంది.
బ్యాంకర్లు, ఆర్థిక, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖల అధికారులు గత రెండు నెలలు పాటు జరిగిన సుదీర్ఘ సమావేశాల తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ సమావేశాల్లో సోలార్ ఫోటోవోల్టాయిక్ తయారీదారులు ఎదుర్కొంటున్న ఫైనాన్సింగ్ సమస్యలపై చర్చించారు.
వచ్చే రెండు మూడు నెలల్లో ఆర్బీఐ దీనిపై అధికార ప్రకటన చేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
ఇదిలా ఉంటే, సోలార్ రంగానికి సంబంధించి ఉత్పత్తి-అనుసంధాన ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకంలో మార్పులు చేయాలని పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ఆలోచిస్తోంది.
దేశీయ సోలార్ ప్యానల్ తయారీదారులకు ఉపయోగపడేలా సవరణల చేయనున్నట్లు తెలుస్తోంది.
ఆర్బీఐ
రుణదాతలు సలహాలు అందించాలి: ఆర్థిక మంత్రిత్వ శాఖ
ఈ రంగానికి ఫైనాన్సింగ్‌ను సులభతరం చేయడానికి ఒక పాలసీని రూపొందించడానికి రుణదాతలు సహకరించాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ కోరింది.
అంతకుముందు, సమస్యను పరిష్కరించడానికి బ్యాంకులు సిఫార్సులు పంపాయి. ఇదిలా ఉండగా, స్వేచ్చా వాణిజ్య ఒప్పందాల (ఎఫ్‌టీఏ) కింద ఆగ్నేయాసియా దేశాల నుంచి సుంకం రహిత దిగుమతులు తమపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని దేశీయ సోలార్ ప్యానెల్ తయారీదారులు ఆందోళన వ్యక్తం చేశారు.
గత మూడు నెలల్లో, భారతదేశం ఎఫ్‌టీఏలను కలిగి ఉన్న దేశాల నుంచి సోలార్ ప్యానెల్ దిగుమతులు 48శాతం పెరిగాయి.
2023 మొదటి అర్ధ భాగంలో చైనా నుంచి సోలార్ మాడ్యూల్ దిగుమతులు దాదాపు 80శాతం తగ్గాయి.