RBI: ఆ బ్యాంకులకు ఆర్బీఐ షాక్.. నిబంధనలను పాటించని హెచ్‌డిఎఫ్‌సి, యాక్సిస్ బ్యాంక్‌లకు భారీ జరిమానా
దేశంలో అన్ని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు, హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) పూర్తి నియంత్రణ ఉంటుంది. ఆర్ బి ఐ ,వీటి నిర్వహణ, పర్యవేక్షణ, అభివృద్ధికి సంబంధించిన నిర్ణయాలను తీసుకుంటుంది. అందులో భాగంగా, ఆ సంస్థలు RBI మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలి. కస్టమర్లకు నాణ్యమైన సేవలు అందించడంలో నిర్లక్ష్యం కనిపించినా, లేదా నియమ నిబంధనలను ఉల్లంఘించినా, RBI చర్యలు తీసుకోవడం తప్పదు. కొన్ని సందర్భాల్లో లక్షలు లేదా కోట్లలో జరిమానా విధించడం జరుగుతుంటుంది. అయితే, సమస్య తీవ్రంగా ఉంటే బ్యాంక్ లైసెన్స్ రద్దు చేసే అవకాశమూ ఉంటుంది, ముఖ్యంగా స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులకు.
రెండు బ్యాంకులకు కలిపి మొత్తం రూ. 2.91 కోట్ల జరిమానా
RBI గవర్నర్ శక్తికాంత దాస్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ చర్యలు మరింత కఠినంగా ఉన్నాయని తెలుస్తోంది. పెద్ద, చిన్న బ్యాంకులకు తేడా లేకుండా పారదర్శకంగా నిర్ణయాలు తీసుకుంటున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా, దేశంలోని పెద్ద ప్రైవేట్ బ్యాంకులు అయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకులపై కూడా చర్యలు తీసుకుంది. ఈ రెండు బ్యాంకులకు కలిపి మొత్తం రూ. 2.91 కోట్ల జరిమానా విధించినట్లు RBI మంగళవారం ప్రకటించింది. చట్టపరమైన, నియంత్రణా పరమైన నిబంధనలను ఉల్లంఘించినందుకు ఈ భారీ జరిమానా విధించబడింది.
యాక్సిస్ బ్యాంకుకు రూ. 1.91 కోట్ల జరిమానా
యాక్సిస్ బ్యాంకుకు రూ. 1.91 కోట్ల జరిమానా విధించడానికి కారణం, KYC, డిపాజిట్లపై వడ్డీ, వ్యవసాయ రుణాలకు సంబంధించిన మార్గదర్శకాలను పాటించకపోవడం. అదే సమయంలో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కూడా డిపాజిట్లపై వడ్డీ, రికవరీ ఏజెంట్ల పని విధానాలు, కస్టమర్ సేవలకు సంబంధించిన రూల్స్ పాటించకపోవడం వల్ల రూ. 1 కోటి జరిమానా విధించబడింది. ఈ తప్పిదాలు కనుగొన్న తర్వాత,బ్యాంకులకు నోటీసులు జారీ చేసి,వివరణ కోరగా,బ్యాంకుల నుండి వచ్చిన సమాధానాలపై జరిమానాలను ఖరారు చేసింది. గతంలో కూడా RBI,సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా,బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, పూనావాలా కార్పొరేషన్, కోటక్ మహీంద్రా బ్యాంకు వంటి అనేక సంస్థలపై చర్యలు తీసుకుంది. RBI ఆంక్షలు, జరిమానాలు ఆయా కంపెనీల షేర్లపై ప్రభావం చూపుతాయని అంచనా వేయవచ్చు.