Page Loader
RBI floating rate bond: ఫిక్స్‌డ్ డిపాజిట్‌ కంటే ఎక్కువ వడ్డీ.. ఆర్‌బీఐ గ్యారెంటీతో 8 శాతం మించి ఆదాయం!
ఫిక్స్‌డ్ డిపాజిట్‌ కంటే ఎక్కువ వడ్డీ.. ఆర్‌బీఐ గ్యారెంటీతో 8 శాతం మించి ఆదాయం!

RBI floating rate bond: ఫిక్స్‌డ్ డిపాజిట్‌ కంటే ఎక్కువ వడ్డీ.. ఆర్‌బీఐ గ్యారెంటీతో 8 శాతం మించి ఆదాయం!

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 09, 2025
10:53 am

ఈ వార్తాకథనం ఏంటి

రెపో రేటును తగ్గించిన తర్వాత దేశంలోని చాలా బ్యాంకులు తమ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించాయి. దీంతో అధిక వడ్డీ లభించే పెట్టుబడి అవకాశాల కోసం ప్రజలు వెతుకులాట మొదలుపెట్టారు. అయితే ఎక్కువ వడ్డీ ఉన్న చోట సాధారణంగా ఎక్కువ రిస్క్ కూడా ఉంటుంది. కానీ రిస్క్‌ లేకుండా మంచి వడ్డీ రాబడిని కోరేవారికి ఒక విశ్వసనీయమైన ఎంపికగా ఉంది.. అదే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రవేశపెట్టిన ఫ్లోటింగ్ రేట్ సేవింగ్స్ బాండ్స్, 2020. ఈ బాండ్లకు రిజర్వ్ బ్యాంక్ గ్యారెంటీ ఉంటుంది కాబట్టి పెట్టుబడికి పూర్తి భద్రత ఉంటుంది. దీర్ఘకాలంలో మంచి ఆదాయాన్ని ఈ బాండ్లు అందిస్తాయి.

వివరాలు 

ప్రతి ఆరు నెలలకొకసారి మారే బాండ్ల వడ్డీ రేటు

ఈ బాండ్లకు వడ్డీ రేటు స్థిరంగా ఉండదు.ప్రతి ఆరు నెలలకొకసారి ఇది మారుతుంది. ఈవడ్డీ రేటు'నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్(NSC)'వడ్డీ రేటుకు అనుసంధానంగా ఉంటుంది. అంటే NSCవడ్డీ పెరిగితే ఫ్లోటింగ్ రేట్ బాండ్ వడ్డీ కూడా పెరుగుతుంది.అదే విధంగా NSCవడ్డీ తగ్గితే ఈ బాండ్ వడ్డీ కూడా తగ్గుతుంది. NSCవడ్డీ కన్నా అదనంగా 0.35 శాతం వడ్డీ ఈ బాండ్లపై లభిస్తుంది.2025 జులై-డిసెంబరు ఆర్థిక సంవత్సర కాలానికి ఈ బాండ్‌పై వడ్డీ రేటును ఆర్‌బీఐ 8.05 శాతంగా నిర్ణయించింది. ప్రస్తుతం NSC వడ్డీ రేటు 7.7శాతంగా ఉండగా,ఈ బాండ్లపై అది 8.05శాతంగా ఉంది. వడ్డీ ప్రతి ఆరు నెలలకోసారి జమ అవుతుంది.జనవరి 1, జులై 1 తేదీలలో మీ ఖాతాలో నగదు రూపంలో జమవుతుంది.

వివరాలు 

దీర్ఘకాల పెట్టుబడికి అనువైనది.. 

ఈ ఫ్లోటింగ్ రేట్ సేవింగ్స్ బాండ్‌ వ్యవధి ఏడేళ్లు. మధ్యలో రిడీమ్ చేసుకునే అవకాశం ఉండదు. అయితే, సీనియర్ సిటిజన్లకు మాత్రం కొన్ని నిబంధనల ప్రకారం ముందస్తుగా విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంది. 60-70 ఏళ్ల మధ్య వయసున్నవారికి 6 సంవత్సరాల లాక్-ఇన్, 70-80 మధ్య వారికి 5 సంవత్సరాలు, 80 ఏళ్లు దాటినవారికి 4 సంవత్సరాల లాక్-ఇన్ పీరియడ్‌ ఉంటుంది. కనిష్ఠ పెట్టుబడి మొత్తం ₹1,000 మాత్రమే. గరిష్ఠ పరిమితి ఉండదు. కానీ వడ్డీ రేట్లు భవిష్యత్తులో పెరగవచ్చు లేదా తగ్గవచ్చు - కాబట్టి వడ్డీ తగ్గితే రాబడి తగ్గే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకోవాలి.

వివరాలు 

దీర్ఘకాల పెట్టుబడికి అనువైనది.. 

ఈ బాండ్లపై వచ్చే వడ్డీ ఆదాయంపై ఆదాయపు పన్ను (Income Tax) వర్తిస్తుంది. అలాగే వీటిని ఇతరులకు బదిలీ చేయడం, గిరవుగా పెట్టడం సాధ్యం కాదు. రుణ సదుపాయం కూడా లేదు. కాంపౌండింగ్ వడ్డీ లాభం ఉండదు.. అంటే వడ్డీపై వడ్డీ లభించదు. ఈ బాండ్‌ పథకం, ఏడేళ్ల పాటు డబ్బును వాడుకోకుండా ఉంచగలిగే వారికే తగినది. ఫిక్స్‌డ్ డిపాజిట్‌కి ప్రత్యామ్నాయంగా దీన్ని తీసుకోగలరు. ముఖ్యంగా తక్కువ పన్ను పరిధిలో ఉండే వారు, నష్టాల ముప్పు లేకుండా పెట్టుబడి చేయాలనుకునే వారు దీనిని ఎంచుకోవచ్చు.

వివరాలు 

సీనియర్ సిటిజన్లకు స్థిర ఆదాయ వనరు 

వృద్ధులకు ఇది విశ్వసనీయమైన స్థిర ఆదాయ వనరుగా ఉపయోగపడుతుంది. ఈ బాండ్లను ఎవరైనా భారతీయ నివాసితులు లేదా హిందూ అవిభాజ్య కుటుంబాలు (HUFs) కొనుగోలు చేయవచ్చు. అయితే ఎన్‌ఆర్‌ఐలు మాత్రం వీటిని కొనుగోలు చేయలేరు. కొనుగోలు ప్రక్రియ కూడా సులభమైనది - RBI ఆథరైజ్డ్ బ్యాంకుల శాఖల్లో లేదా ఆర్‌బీఐ రిటైల్ డైరెక్ట్‌ పోర్టల్ ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు. కానీ KYC పత్రాలు తప్పనిసరిగా సమర్పించాలి.

వివరాలు 

ఉదాహరణకు 

ఒకవేళ మీరు ₹1 లక్షను ఈ బాండ్లలో పెట్టుబడి పెడితే, 8.05% వడ్డీ రేటుతో ప్రతి ఆరు నెలలకు సుమారుగా ₹4,000 చొప్పున మీ ఖాతాలో వడ్డీ జమవుతుంది. అయితే ఈ వడ్డీ ఆదాయంపై మీరు పడే పన్ను మీ ఆదాయపు శ్లాబ్ ఆధారంగా ఉంటుంది. ఫారం 15G లేదా 15Hను సమర్పించి అర్హులైన వారు TDS నుంచి మినహాయింపు పొందవచ్చు.