LOADING...
RBI: వచ్చే వారం రెపో రేటు 5.25%కి తగ్గించేలా ఆర్బీఐ సంకేతాలు
వచ్చే వారం రెపో రేటు 5.25%కి తగ్గించేలా ఆర్బీఐ సంకేతాలు

RBI: వచ్చే వారం రెపో రేటు 5.25%కి తగ్గించేలా ఆర్బీఐ సంకేతాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 28, 2025
12:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

రూపాయి విలువలో ఒత్తిడి, ఆర్థిక పరిణామాల మధ్య రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వచ్చే డిసెంబర్ 5న కీలక వడ్డీ రేటు అయిన రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 5.25%కి తీసుకురావొచ్చని రాయిటర్స్ సర్వే సూచిస్తోంది. ఇటీవల ఆహార ధరలు గణనీయంగా తగ్గడం, పన్ను తగ్గింపులు రావడం వల్ల వినియోగదారుల ద్రవ్యోల్బణం తగ్గిన నేపధ్యంలో ఈ నిర్ణయం తీసుకునే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. ఈ రేటు కనీసం వచ్చే ఏడాది చివరి వరకు మారకుండా ఉండొచ్చని చాలా మంది ఆర్థిక నిపుణుల అభిప్రాయం.

రేటు స్థిరత్వం 

ఆర్థిక మార్పుల నేపథ్యంలో ఆర్బీఐ వైఖరి

ఇటీవల ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా, "కొత్త ఆర్థిక సూచీలు చూస్తుంటే, రేట్లు తగ్గించే అవకాశం ఇంకా ఉందని తెలుస్తోంది" అని చెప్పారు. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో మొత్తం 100 బేసిస్ పాయింట్ల వరకూ తగ్గించిన తర్వాత, ఆగస్టు నుంచి రేట్లను యథాతథంగా కొనసాగిస్తోంది ఆర్బీఐ. రూపాయి విలువ ఇటీవల డాలర్‌కి ఎదురు ₹89.49 వరకు పడిపోయినా, బలహీనంగా ఉన్న వినియోగాన్ని నిలబెట్టేందుకు రేటు కోతలు అవసరమయ్యాయని కేంద్ర బ్యాంకు భావిస్తోంది.

పోల్ ఫలితాలు 

రెపో రేటు తగ్గింపుపై నిపుణుల అంచనా

నవంబర్ 18 నుంచి 26 వరకు నిర్వహించిన రాయిటర్స్ సర్వేలో పాల్గొన్న 80 మంది ఆర్థిక నిపుణుల్లో 62 మంది (సుమారు 80%) డిసెంబర్ పాలసీ మీటింగ్‌లో రెపో రేటు 5.25%కి తగ్గుతుందని అంచనా వేశారు. మిగిలిన 18 మంది రేట్లలో మార్పు ఉండదని పేర్కొన్నారు. డాయిచ్ బ్యాంక్ ఇండియా చీఫ్ ఎకనామిస్ట్ కౌశిక్ దాస్ మాట్లాడుతూ, "డిసెంబర్ పాలసీలో ఆర్బీఐ 2025-26 ద్రవ్యోల్బణ అంచనాను ప్రస్తుత 2.6% నుంచి ఇంకా తగ్గించే అవకాశం ఉన్నందున, 25 బేసిస్ పాయింట్ల రేటు కోతకు మరింత బలం లభిస్తోంది" అన్నారు.

Advertisement

మార్కెట్ ఔట్ లుక్ 

వ్యాపార ఉద్రిక్తతల మధ్య ఆర్థిక వృద్ధిపై అంచనాలు

అమెరికా భారత వస్తువులపై 50% దిగుమతి సుంకం విధించిన ప్రభావంతో ప్రైవేట్ ఇన్వెస్టర్లు జాగ్రత్తగా వ్యవహరిస్తుండగా, ఈ ఏడాది భారత స్టాక్ మార్కెట్‌ల నుంచి దాదాపు 17 బిలియన్ డాలర్ల విదేశీ నిధులు బయటకు వెళ్లాయి. అయినప్పటికీ, జూలై-సెప్టెంబర్ (Q2)లో భారత్ 7.3% ఆర్థిక వృద్ధిని నమోదు చేసి ఉండొచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. వేరే సర్వేలు కూడా 2026 మధ్య నాటికి భారత స్టాక్ మార్కెట్లు కొత్త గరిష్ఠాలను తాకే అవకాశం ఉందని సూచిస్తున్నాయి.

Advertisement