Loading...
Reliance: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ రికార్డు లాభాలు.. రూ.29,550 కోట్లకు చేరిన నికర లాభం
రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ రికార్డు లాభాలు.. రూ.29,550 కోట్లకు చేరిన నికర లాభం

Reliance: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ రికార్డు లాభాలు.. రూ.29,550 కోట్లకు చేరిన నికర లాభం

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 31, 2026
03:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

జియో ప్లాట్‌ఫామ్స్‌ రికార్డు స్థాయి లిస్టింగ్‌తో రిలయెన్స్ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) విలువ మరింత పెరిగిందని సంస్థ ఛైర్మన్‌ ముకేశ్‌ అంబానీ తెలిపారు. అంతర్జాతీయంగా అనిశ్చితులు, కమొడిటీల అధిక ధరలు కొనసాగుతున్నప్పటికీ చమురు నుంచి రసాయనాల (ఓ2సీ) వ్యాపారం మెరుగైన పనితీరు కనబరిచిందని పేర్కొన్నారు. రిటెయిల్‌ విభాగంలో ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌ మార్గాల్లో వినియోగదారుల సంఖ్య పెరిగిందని వెల్లడించారు. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ సెప్టెంబరు త్రైమాసికంలో రికార్డు స్థాయిలో రూ.29,550 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.22,092 కోట్లతో పోలిస్తే ఇది 33.8 శాతం అధికం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో వచ్చిన రూ.23,196 కోట్ల లాభంతో పోల్చినా సెప్టెంబరు త్రైమాసికంలో మెరుగైన ఫలితాలు సాధించింది.

వివరాలు

నికర లాభం ఎక్కువ

సమీక్షా త్రైమాసికంలో కంపెనీ యజమానులకు దక్కే నికర లాభం 40 శాతం పెరిగి రూ.25,548 కోట్లకు చేరుకుంది.

రిటెయిల్‌ విభాగం ఆశించిన స్థాయిలో రాణించకపోయినప్పటికీ.. చమురు వ్యాపారంలో మెరుగైన రిఫైనింగ్‌ మార్జిన్లు, డిజిటల్‌ వ్యాపారంలో వృద్ధి సంస్థ లాభాలు పెరగడానికి దోహదపడ్డాయి. దీంతో ఒక్కో షేరుపై ఆర్జన (ఈపీఎస్‌) రూ.13.32 నుంచి రూ.18.88కి పెరిగింది.

అన్ని వ్యాపార విభాగాల ఆదాయాలు పెరగడంతో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఏకీకృత ఆదాయం 27.8 శాతం వృద్ధి చెంది రికార్డు స్థాయిలో రూ.3.62 లక్షల కోట్లకు చేరుకుంది.

ఓ2సీ వ్యాపారంలో పెట్రోరసాయనాల మార్జిన్లు మెరుగుపడటం, డిజిటల్‌ సేవల్లో సగటు వినియోగదారు ఆదాయం పెరగడం సంస్థ లాభదాయకతకు తోడ్పడ్డాయి.

వివరాలు

2.31లక్షల కోట్లకు పైగా లాభం

పశ్చిమాసియాలో అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతున్నప్పటికీ ఓ2సీ విభాగం మంచి ఫలితాలు సాధించింది.

ఈ వ్యాపార విభాగం ఎబిటా 67.9 శాతం వృద్ధితో రూ.25,203 కోట్లకు చేరుకుంది. ఆదాయం సైతం 44.2 శాతం పెరిగి రూ.2.31 లక్షల కోట్లుగా నమోదైంది.

ఓ2సీ వ్యాపారం అత్యుత్తమ త్రైమాసిక పనితీరు కనబరిచిందని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అనంత్‌ అంబానీ పేర్కొన్నారు.

ADVERTISEMENT

వివరాలు

జియో ప్లాట్‌ఫామ్స్‌ ఆదాయంలో 11.3 శాతం వృద్ధి

ఇటీవల స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో నమోదైన జియో ప్లాట్‌ఫామ్స్‌ సెప్టెంబరు త్రైమాసికంలో మెరుగైన ఫలితాలు సాధించింది.

సంస్థ ఏకీకృత నికర లాభం 13.7 శాతం వృద్ధితో రూ.8,387 కోట్లకు చేరుకుంది. ఎబిటా 16.6 శాతం పెరిగి రూ.21,879 కోట్లుగా నమోదైంది.

ఏకీకృత ఆదాయం 11.3 శాతం వృద్ధి చెంది రూ.47,485 కోట్లకు చేరుకుంది. జియో వినియోగదారుల సంఖ్య 54.24 కోట్లకు చేరింది.

వీరిలో 30 కోట్ల మంది 5జీ సేవలను వినియోగిస్తున్నారు. ఫిక్స్‌డ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్షన్లు 3 కోట్లకు, ఎయిర్‌ఫైబర్‌ కనెక్షన్లు 1.5 కోట్లకు చేరుకున్నాయి.

మరోవైపు సగటు వినియోగదారు ఆదాయం (ఆర్పు) కూడా పెరిగింది. గతంలో రూ.211.4గా ఉన్న ఆర్పు ప్రస్తుతం రూ.218.8కి చేరుకుంది.

ADVERTISEMENT

వివరాలు

రిలయన్స్‌ రిటెయిల్‌ లాభంలో 24.3 శాతం క్షీణత

రిలయన్స్‌ రిటెయిల్‌ ఆదాయం పెరిగినప్పటికీ నికర లాభం తగ్గింది. సంస్థ స్థూల ఆదాయం గతంలో నమోదైన రూ.86,169 కోట్ల నుంచి 6.43 శాతం వృద్ధి చెంది రూ.91,716 కోట్లకు చేరుకుంది.

అయితే నికర లాభం మాత్రం 24.3 శాతం తగ్గి రూ.2,611 కోట్లకు పరిమితమైంది. కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం 5.78 శాతం పెరిగి రూ.80,220 కోట్లుగా నమోదైంది.

సమీక్షా త్రైమాసికంలో రిలయన్స్‌ రిటెయిల్‌ కొత్తగా 303 స్టోర్లను ప్రారంభించింది. దీంతో మొత్తం స్టోర్ల సంఖ్య 19,947కు చేరుకుంది.

అయితే కొన్ని స్టోర్లను మూసివేయడంతో జూన్‌ త్రైమాసికంతో పోలిస్తే నికరంగా 222 స్టోర్లు తగ్గాయి.

వివరాలు

ఆకాశ్‌ అంబానీ తొలి ఇన్వెస్టర్‌ కాల్

డిజిటల్‌ కామర్స్‌, బీ2బీ వంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న విభాగాలున్న కొత్త వ్యాపార నమూనాకు ఆఫ్‌లైన్‌ వ్యాపారం ద్వారా వచ్చే లాభాలతో నిధులు సమకూరుస్తామని రిలయన్స్‌ రిటెయిల్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఈశా అంబానీ తెలిపారు.

జియో ప్లాట్‌ఫామ్స్‌ స్టాక్‌ మార్కెట్‌లో లిస్టింగ్‌ అయిన నేపథ్యంలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ త్రైమాసిక ఇన్వెస్టర్‌ కాల్‌లో తొలిసారిగా జియో ఎండీ ఆకాశ్‌ అంబానీ పాల్గొన్నారు.

సంస్థ భవిష్యత్తు ప్రణాళికలు, సాంకేతిక రంగంలో కొనసాగించనున్న పెట్టుబడులు, సామర్థ్యాలపై ఆయన మాట్లాడారు.

శాటిలైట్‌ కమ్యూనికేషన్స్‌, 6జీ మేధోసంపత్తి, కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత వాయిస్‌, డేటా సేవల రంగాల్లో తమ సామర్థ్యాలను మరింత అభివృద్ధి చేసుకుంటామని ఆకాశ్‌ అంబానీ పేర్కొన్నారు.

ADVERTISEMENT