LOADING...
Jio IPO Incoming: రూ.40,000 కోట్ల ఐపీఓకు రిలయన్స్‌ జియో సిద్ధం
రూ.40,000 కోట్ల ఐపీఓకు రిలయన్స్‌ జియో సిద్ధం

Jio IPO Incoming: రూ.40,000 కోట్ల ఐపీఓకు రిలయన్స్‌ జియో సిద్ధం

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 10, 2026
08:59 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలోనే అతిపెద్ద తొలి పబ్లిక్‌ ఆఫర్‌కు ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయెన్స్‌ జియో ప్లాట్‌ఫామ్స్‌ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ ఏడాదిలోనే తొలి పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓ) ద్వారా నిధులు సమీకరించనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. గత నవంబరులో రిలయన్స్‌ జియో విలువను 180 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.16.20 లక్షల కోట్లు)గా ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌ జెఫ్రీస్‌ అంచనా వేసింది. జియోలో 2.5% వాటా విక్రయించాలన్నది రిలయన్స్‌ ప్రణాళిక. అంటే ఈ స్వల్ప వాటా విక్రయంతోనే 4 - 4.5 బిలియన్‌ డాలర్ల (రూ.36,000 - 40,500 కోట్ల) వరకు సంస్థ సమీకరించే అవకాశం ఉంది. ఇదే జరిగితే ఇప్పటివరకు మనదేశంలో అతిపెద్ద ఐపీఓగా రిలయన్స్‌ జియో రికార్డు సృష్టించనుంది.

Details

దేశంలో అతిపెద్ద టెలికాం ఆపరేటర్‌గా జియో

ప్రస్తుతం 50 కోట్ల మందికి పైగా చందాదారులతో దేశంలో అతిపెద్ద టెలికాం ఆపరేటర్‌గా జియో ఉంది. జియో ఐపీఓ కోసం మదుపర్లు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు.గత ఆరేళ్లలో కృత్రిమ మేధ(ఏఐ)వంటి వైవిధ్య విభాగాల్లోకి జియో అడుగుపెట్టింది. కేకేఆర్, జనరల్‌ అట్లాంటిక్, సిల్వర్‌ లేక్, అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్‌ అథారిటీ వంటి అంతర్జాతీయ పెట్టుబడిదార్ల నుంచి ఈ సంస్థ నిధులు సమీకరించింది. ఐపీఓ కోసం ఇద్దరు బ్యాంకర్లు రిలయన్స్‌ జియో ఐపీఓ ముసాయిదాను సిద్ధం చేసేందుకు ప్రముఖ బ్యాంకర్లు మోర్గాన్‌ స్టాన్లీ, కోటక్‌ పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. 2026ప్రథమార్థంలోనే జియో ఐపీఓ ఉండొచ్చని గత ఆగస్టులో జరిగిన రిలయన్స్‌ ఏజీఎంలో ముకేశ్‌ అంబానీ ప్రకటించారు. మార్కెట్‌ పరిస్థితులకు అనుగుణంగా ఈ భారీ ఐపీఓ ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

Details

ఆర్థిక శాఖ ఆమోదం తరవాతే

పెద్ద కంపెనీల ఐపీఓ పరిమాణ నిబంధనలు మారడం కోసం రిలయన్స్‌ ఎదురుచూస్తోందని వెల్లడించాయి. అతిపెద్ద కంపెనీలు, పబ్లిక్‌ ఇష్యూ ద్వారా నిధులు సమీకరించాలంటే, సంస్థలో కనీసం 5% వాటా విక్రయించాలన్నది నిబంధన. దీన్ని 2.5 శాతానికి తగ్గించాలన్న సెబీ ప్రతిపాదనకు ఆర్థిక శాఖ అనుమతి లభించాల్సి ఉంది. జియో కంపెనీ భారీ పరిమాణం నేపథ్యంలో, ఐపీఓ ద్వారా 2.5% వాటానే విక్రయించాలని మాతృసంస్థ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ భావిస్తోంది. జియో విలువను 200-240 బి.డాలర్లు (సుమారు రూ.18- 21.60 లక్షల కోట్లు)గా లెక్కకట్టాలని కొంత మంది బ్యాంకర్లు కోరుతున్నట్లు సమాచారం. దీనిపై రిలయన్స్‌ ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

Advertisement

Details

ప్రస్తుత వాటాదార్ల షేర్ల విక్రయంపై నిర్ణయం

జియో ఐపీఓ పూర్తిగా ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌)గా రానుందా అనే దానిపై స్పష్టత లేదు. కొత్త షేర్ల జారీ లేదా ప్రస్తుత వాటాదార్ల షేర్ల విక్రయంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దక్షిణ కొరియా సంస్థ హ్యుందాయ్‌ అనుబంధ హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా రూ.27,870 కోట్ల ఐపీఓ కూడా పూర్తిగా ఓఎఫ్‌ఎస్‌ రూపంలోనే వచ్చింది

Advertisement