Reliance : భారీ నిధుల సమీకరణలో రిలయెన్స్.. రూ.15 వేల కోట్ల బాండ్ల విక్రయాలు
రిలయెన్స్ ఇండస్ట్రీస్ రూ.15 వేల కోట్ల బాండ్ల విక్రయాలను చేపట్టాలని భావిస్తోంది. ఈ మేరకు పలు రంగాల్లో వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించేందుకు భారీగా నిధులను సమీకరించాలని రిలయెన్స్ భావిస్తోంది. ఇందులో భాగంగానే దేశీయ కరెన్సీ బాండ్లను విక్రయించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అపర కుబేరుడు ముకేశ్ అంబానీకి చెందిన రిలయెెన్స్ గ్రూప్ పెద్ద ఎత్తున నిధుల సమీకరణకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే సుమారుగా రూ. 15,000 కోట్లు విలువైన కరెన్సీ బాండ్ల విక్రయాల ద్వారా లక్ష్యాన్ని సాధించాలని సన్నద్ధమవుతోంది. ప్రస్తుతం చర్చలు తుది దశలో ఉన్నాయని, ఓ కీలక ప్రతినిధి వెల్లడించారు. స్థానిక కరెన్సీ బాండ్లలో రిలయెన్స్ భారీగా నిధుల సమీకరణ చేపట్టడం తొలిసారి అవుతుంది.
పెట్రోకెమికల్స్ నుంచి ఇతర రంగాలకు రిలయెన్స్
2020 తర్వాత దేశీయ బాండ్ల ద్వారా నిధులను సేకరించడం కూడా ఇదే ఫస్ట్ టైమ్ అని ఆంగ్లపత్రిక బ్లూమ్‌బెర్గ్ తెలిపింది. పెట్రో కెమికల్స్ వ్యాపారం నుంచి రిలయెేన్స్ ఇతర రంగాలకు విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలోనే భారీగా నిధులను జమ చేస్తోంది. ఈ మేరకు ఈ ఏడాది 'ఖతర్ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ'కి రిలయెన్స్ రిటైల్ వాటాలు విక్రయించింది. అంతేకాకుండా కేకేఆర్ అండ్ కంపెనీ నుంచి సైతం నిధులను సమీకరించడం గమనార్హం. భారత్ సహా ప్రపంచ వ్యాప్తంగా గత కొద్ది నెలలుగా రుణ రేట్లు పెరిగాయి. ఈ క్రమంలోనే రిలయన్స్ గ్రూపునకు క్రిసిల్ రేటింగ్స్ AAA క్రెడిట్ స్కోర్‌ను ఇచ్చింది. మూడీస్, ఫిచ్ మాత్రం రిలయెన్స్‌కు వరుసగా Baa2, BBB రేటింగ్‌ను ఇస్తూ వచ్చాయి.