Rules changing in October: ఎల్‌పీజీ ఇ-కేవైసీ నుంచి యూపీఐ ఛార్జీల వరకు.. అక్టోబరు నుంచి కొత్త రూల్స్
ఈ వార్తాకథనం ఏంటి
అక్టోబరు నుంచి అమల్లోకి రానున్న పలు ఆర్థిక మార్పులు సామాన్యులపై ప్రభావం చూపనున్నాయి. ఎల్‌పీజీ ఇ-కేవైసీ, గ్యాస్ సిలిండర్ ధరలు, యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు,బల్క్ డిపాజిట్ల వడ్డీ రేట్లకు సంబంధించి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఈ మార్పుల వివరాలు ఇలా ఉన్నాయి. ఎల్‌పీజీ ఇ-కేవైసీ తప్పనిసరి ఎల్‌పీజీ వినియోగదారులు బయోమెట్రిక్ ఆధార్ అథంటికేషన్(E-KYC)ప్రక్రియను సెప్టెంబర్ నెలాఖరులోగా పూర్తి చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. నిర్ణీత గడువులోపు ఇ-కేవైసీ పూర్తి చేయకపోతే రాయితీ వర్తించదు. అక్రమ గ్యాస్ కనెక్షన్లను అరికట్టడంతో పాటు రాయితీ దుర్వినియోగాన్ని నిరోధించేందుకు ఈ విధానాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. వినియోగదారులు ఆయిల్ కంపెనీల యాప్‌లు,గ్యాస్ ఏజెన్సీలు లేదా గ్యాస్ డీలర్ల వద్ద సెప్టెంబర్ నెలాఖరులోగా ఇ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు.
వివరాలు
సిలిండర్ ధరల్లో మార్పులు ఉండొచ్చు
అంతర్జాతీయ మార్కెట్‌లోని ధరలకు అనుగుణంగా చమురు సంస్థలు ప్రతి నెలా ఒకటో తేదీన గృహ, వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ల ధరలను సవరిస్తుంటాయి.
సెప్టెంబర్‌లో గృహ వినియోగ సిలిండర్ ధరను స్థిరంగా ఉంచినప్పటికీ.. వాణిజ్య సిలిండర్ ధరను రూ.10 మేర పెంచాయి.
ప్రస్తుతం కొనసాగుతున్న అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో అక్టోబరులో సిలిండర్ ధరల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.
యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు
ఇప్పటివరకు ఉచితంగా కొనసాగుతున్న యూపీఐ లావాదేవీల్లో కొన్ని చెల్లింపులకు అక్టోబరు 15 నుంచి ఛార్జీలు అమల్లోకి రానున్నాయి.
రూ.2,000కు మించిన లావాదేవీలపై 0.4శాతం మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) వర్తించనుంది.
అయితే చిరు వ్యాపారులు, వ్యక్తుల మధ్య జరిగే లావాదేవీలకు ఈ ఛార్జీ నుంచి మినహాయింపు ఉంటుంది.
వివరాలు
బల్క్ ఎఫ్‌డీలపై ఆర్‌బీఐ కొత్త నిబంధనలు
పెట్రోల్ పంపులు, బీమా వంటి చెల్లింపులకు మాత్రం ఫ్లాట్ ఎండీఆర్‌గా రూ.5 వర్తించనుంది.
బల్క్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను వెల్లడించే విషయంలో బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక ఆదేశాలు జారీ చేసింది.
రూ.3 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ విలువైన బల్క్ డిపాజిట్లకు సంబంధించిన వడ్డీ రేట్లను అక్టోబరు 1 నుంచి బ్యాంకులు ప్రతిరోజూ ఉదయం 10 గంటలలోగా తమ వెబ్‌సైట్లలో ప్రచురించాలి.
అదే తేదీన స్వీకరించిన డిపాజిట్లకు వడ్డీ రేటును నిర్ణయించే సమయంలో కస్టమర్ల మధ్య లేదా బ్యాంకు శాఖల మధ్య ఎలాంటి వివక్ష చూపకూడదని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.