SBI MCLR Rate Hike: MCLR కింద రుణ రేట్లను 0.05% పెంచిన SBI
మీరు ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కస్టమర్ అయితే ఈ వార్త మీకోసమే. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు (MCLR)లో 0.05 శాతం పెంచినట్లు తెలిపింది. బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం, ఒక సంవత్సరం MCLR రేటు ప్రస్తుతం 9%కి చేరుకుంది. వ్యక్తిగత రుణాలు, ఆటో రుణాలు, గృహ రుణాలు వంటి రేట్లు ఈ MCLR రేటు ఆధారంగా నిర్ణయించబడతాయి. అదేవిధంగా, బ్యాంక్ మూడు, ఆరు నెలల MCLR రేట్లను కూడా పెంచింది. అయితే, ఒక రోజు, ఒక నెల, రెండు సంవత్సరాలు, మూడు సంవత్సరాల MCLRలను యథాతథంగా ఉంచింది.
రెపో రేటును 6.5 శాతంగా కొనసాగించాలని నిర్ణయించిన RBI
ఈ విషయంపై బ్యాంక్ ఛైర్మన్ సిఎస్ శెట్టి మాట్లాడుతూ, బ్యాంకు మొత్తం రుణాల 42% ఎంసీఎల్‌ఆర్ ఆధారంగా ఉన్నాయని, మిగిలిన రుణాలు బయటి బెంచ్‌మార్క్‌లపై ఆధారపడి ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం బ్యాంకింగ్ వ్యవస్థలో డిపాజిట్ రేట్లు అత్యధికంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, బ్యాంకు ఇటీవలే MCLR రేటును రెండుసార్లు పెంచిన విషయం తెలిసిందే. ఇక, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కూడా తన రెపో రేటును 6.5 శాతంగా కొనసాగించాలని నిర్ణయించింది. కానీ, రాబోయే నెలల్లో వడ్డీ రేట్లు తగ్గే అవకాశముంది.
మెచ్యూరిటీ పీరియడ్‌ల రుణాల రేట్లలో ఎలాంటి మార్పు లేదు
మరోవైపు, ప్రైవేట్ రంగ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు తన ఎంపిక చేసిన మెచ్యూరిటీ పీరియడ్‌ల రుణాల MCLRను 0.05 శాతం పెంచింది. ఒక సంవత్సరం కాలం కోసం ప్రామాణిక MCLR రేటు ప్రస్తుతం 9.45% గా ఉంది. అయితే, ఒక రోజు MCLR 9.1% నుండి 9.15%కి పెరిగింది, అలాగే ఒక నెల MCLR 9.15% నుండి 9.2%కి పెరిగింది. ఇతర మెచ్యూరిటీ పీరియడ్‌లతో సంబంధం ఉన్న రుణాల రేట్లలో ఎలాంటి మార్పు లేదు. ఈ కొత్త రేట్లు నవంబర్ 7, 2024 నుండి అమలులోకి వచ్చాయి.