SBI Mutual Fund: ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్ ఐపీఓకు సెబీ గ్రీన్ సిగ్నల్.. రూ.13 వేల కోట్ల సమీకరణే లక్ష్యం
ఈ వార్తాకథనం ఏంటి
ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్ భారీ ఐపీఓకు భారత మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ (SEBI) అనుమతి ఇచ్చింది. దేశంలోనే అతిపెద్ద అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీగా ఉన్న ఈ సంస్థ సుమారు రూ.13,000 కోట్ల విలువైన పబ్లిక్ ఇష్యూతో మార్కెట్‌లోకి అడుగుపెట్టనుంది. ఈ ఐపీఓ పూర్తిగా'ఆఫర్ ఫర్ సేల్ (OFS)'రూపంలో ఉండగా,గరిష్ఠంగా 20.37 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించనున్నారు. ఈ మేరకు మార్చిలో దాఖలు చేసిన డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (DRHP)కు సెబీ ఆమోదం తెలిపింది. ఈ ఐపీఓ ద్వారా సంస్థ ప్రమోటర్లైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI),అముండి ఇండియా హోల్డింగ్ తమ వాటాల్లో కొంత భాగాన్ని విక్రయించనున్నాయి.
వివరాలు
అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీల జాబితాలో..
ప్రస్తుతం ఎస్‌బీఐకు 61.98 శాతం, ఫ్రాన్స్‌కు చెందిన అముండికి 36.40 శాతం వాటా ఉంది. ఈ పబ్లిక్ ఇష్యూ వచ్చే నెలలో మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఐపీఓ అనంతరం ఎస్‌బీఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ (SBIFML) స్టాక్ మార్కెట్‌లో లిస్టయ్యే అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీల జాబితాలో చేరనుంది. ఇప్పటికే ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ, హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ వంటి సంస్థలు స్టాక్ ఎక్స్చేంజ్‌లలో లిస్టయ్యాయి. 1987లో ఎస్‌బీఐ ఆధ్వర్యంలో స్థాపించబడిన ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్,యూటీఐ తర్వాత భారతదేశంలో ఏర్పాటైన తొలి నాన్-యూటీఐ మ్యూచువల్ ఫండ్‌గా గుర్తింపు పొందింది. 2025 డిసెంబర్ నాటికి సంస్థ త్రైమాసిక సగటు నిర్వహణలోని ఆస్తుల (QAAUM) విలువ సుమారు రూ.12.5 లక్షల కోట్లకు చేరుకోవడం విశేషం.
వివరాలు
ప్రముఖ మర్చంట్ బ్యాంకర్ల కన్సార్టియం
దీంతో ఇది దేశంలోనే అతిపెద్ద అసెట్ మేనేజ్‌మెంట్ సంస్థగా నిలిచింది. ఈ భారీ ఐపీఓ నిర్వహణ కోసం కోటక్ మహీంద్రా క్యాపిటల్, యాక్సిస్ క్యాపిటల్, బీఓఎఫ్ఏ సెక్యూరిటీస్ ఇండియా తదితర ప్రముఖ మర్చంట్ బ్యాంకర్ల కన్సార్టియంను నియమించారు. మార్కెట్ పరిస్థితులను బట్టి ఈ ఐపీఓ పెట్టుబడిదారుల్లో మంచి ఆసక్తిని రేకెత్తించే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు.