Loading...
SBI: సమ్మె వేళ ఎస్‌బీఐ కస్టమర్లకు భారీ ఊరట.. ఏటీఎం చార్జీలు లేవు!
సమ్మె వేళ ఎస్‌బీఐ కస్టమర్లకు భారీ ఊరట.. ఏటీఎం చార్జీలు లేవు!

SBI: సమ్మె వేళ ఎస్‌బీఐ కస్టమర్లకు భారీ ఊరట.. ఏటీఎం చార్జీలు లేవు!

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 25, 2026
05:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగ సంఘాలు మూడు రోజుల సమ్మెకు పిలుపునిచ్చిన వేళ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తన ఖాతాదారులకు ఊరటనిచ్చే ప్రకటన చేసింది. సమ్మె జరిగే మూడు రోజుల పాటు ఏటీఎం లావాదేవీలపై అదనపు చార్జీలు విధించబోమని వెల్లడించింది. ఈ మేరకు ఎస్‌బీఐ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది.

వివరాలు 

మూడు రోజుల పాటు సమ్మె

యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు దేశవ్యాప్తంగా మూడు రోజుల బ్యాంకు సమ్మెకు పిలుపునిచ్చింది.

ఈ నేపథ్యంలో కస్టమర్లు ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేందుకు ఎస్‌బీఐ ప్రత్యేక చర్యలు చేపట్టింది.

సమ్మె జరిగే మూడు రోజుల్లో ఎస్‌బీఐ ఖాతాదారులు దేశంలోని ఏ బ్యాంకుకు చెందిన ఏటీఎంనైనా ఉపయోగించుకోవచ్చు.

నగదు విత్‌డ్రా చేయడంతో పాటు ఇతర ఏటీఎం లావాదేవీలు నిర్వహించినా అదనపు చార్జీలు ఉండవని బ్యాంకు స్పష్టం చేసింది.

వివరాలు 

బ్రాంచ్ సేవలకు అంతరాయం ఉండొచ్చు

సమ్మె సమయంలో ఎస్‌బీఐ బ్రాంచ్‌లు సాధారణంగానే తెరిచి ఉంటాయని బ్యాంకు తెలిపింది.

అయితే ఉద్యోగులు ఎంతమేరకు సమ్మెలో పాల్గొంటారనే దానిపై బ్రాంచ్ సేవలపై ప్రభావం పడే అవకాశం ఉందని పేర్కొంది.

అందువల్ల అత్యవసరమైన బ్యాంకింగ్ పనులు ఉన్న ఖాతాదారులు వాటిని ముందుగానే పూర్తి చేసుకోవాలని సూచించింది.

ADVERTISEMENT

వివరాలు 

ఏటీఎంలతో పాటు ఏడీడబ్ల్యూఎంలు

సమ్మె సమయంలో నగదు అవసరాల కోసం ఏటీఎంలను వినియోగించుకోవచ్చని ఎస్‌బీఐ తెలిపింది.

వీటితో పాటు ఆటోమేటెడ్ డిపాజిట్ అండ్ విత్‌డ్రాయల్ మెషీన్లు (ఏడీడబ్ల్యూఎంలు) కూడా అందుబాటులో ఉంటాయని వెల్లడించింది.

దీంతో బ్రాంచ్ సేవలకు అంతరాయం ఏర్పడినా నగదు అవసరాలను వీటి ద్వారా తీర్చుకోవచ్చని పేర్కొంది.

డిజిటల్ సేవలకు ఎలాంటి బ్రేక్ లేదు

బ్యాంకుల సమ్మె ప్రభావం డిజిటల్ బ్యాంకింగ్ సేవలపై ఉండదని ఎస్‌బీఐ స్పష్టం చేసింది.

ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో, మొబైల్ బ్యాంకింగ్ సేవలు యథావిధిగా కొనసాగుతాయని తెలిపింది.

అలాగే యూపీఐ,ఐఎంపీఎస్, నెఫ్ట్, ఆర్టీజీఎస్ వంటి డిజిటల్ చెల్లింపులు, నిధుల బదిలీ సేవల్లోనూ అంతరాయం ఉండదని పేర్కొంది.

సాధారణ చెల్లింపులు, నగదు బదిలీల కోసం కస్టమర్లు ఈ డిజిటల్ మార్గాలను వినియోగించుకోవాలని సూచించింది.

ADVERTISEMENT

వివరాలు 

సీఎస్‌పీల ద్వారా కొన్ని సేవలు

కస్టమర్ సర్వీస్ పాయింట్లు (సీఎస్‌పీలు) కూడా కొన్ని బ్యాంకింగ్ సేవలను అందిస్తాయని ఎస్‌బీఐ వివరించింది.

సమ్మె నేపథ్యంలో బ్రాంచ్‌లపై ఆధారపడకుండా అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయ సేవలను వినియోగించుకోవాలని ఖాతాదారులకు సూచించింది.

ముందుగానే ఆర్థిక కార్యకలాపాలు ప్లాన్ చేసుకోండి

మూడు రోజుల సమ్మె నేపథ్యంలో తమ ఆర్థిక లావాదేవీలను ఖాతాదారులు ముందుగానే ప్లాన్ చేసుకోవాలని ఎస్‌బీఐ విజ్ఞప్తి చేసింది.

ముఖ్యంగా అత్యవసరమైన బ్రాంచ్ పనులు, నగదు అవసరాలను ముందుగానే చూసుకోవాలని సూచించింది.

ఏటీఎంలు, ఏడీడబ్ల్యూఎంలు, డిజిటల్ బ్యాంకింగ్ సేవలు, సీఎస్‌పీలను అవసరానికి అనుగుణంగా ఉపయోగించుకోవచ్చని తెలిపింది.

ADVERTISEMENT