India-UK trade deal: భారత్-యూకే ఒప్పందానికి షాక్.. స్కాచ్ విస్కీపై 162.5% పన్ను!
ఈ వార్తాకథనం ఏంటి
భారత్, బ్రిటన్ మధ్య ఎంతో ప్రతిష్ఠాత్మకంగా కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) అమల్లోకి వచ్చిన కొద్ది నెలల్లోనే కొత్త వివాదం తెరపైకి వచ్చింది. బ్రిటన్ నుంచి దిగుమతి చేసుకునే స్కాచ్ విస్కీపై కస్టమ్స్ సుంకాన్ని తగ్గించేందుకు ఈ ఒప్పందం ద్వారా నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది జులై 15 నుంచి అమల్లోకి వచ్చిన ఒప్పందం ప్రకారం.. స్కాచ్ విస్కీపై దిగుమతి సుంకాన్ని గతంలో ఉన్న 150 శాతం నుంచి 75 శాతానికి తగ్గించారు. అయితే, దేశీయంగా బ్లెండెడ్ విస్కీ తయారు చేసేందుకు బల్క్ రూపంలో స్కాచ్‌ను దిగుమతి చేసుకుంటున్న కంపెనీలకు మాత్రం ఇప్పుడు ఏకంగా 162.5 శాతం పన్ను భారం ఎదురవుతోంది. దీంతో మద్యం తయారీ పరిశ్రమలో ఆందోళన నెలకొంది.
వివరాలు
అసలు వివాదం ఏమిటి? 162.5 శాతం పన్ను ఎందుకు?
ఈ వ్యవహారంపై భారత కస్టమ్స్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు భిన్నమైన వాదనను వినిపిస్తున్నారు.
కంపెనీలు దిగుమతి చేసుకుంటున్న బల్క్ స్కాచ్ కాన్సంట్రేట్‌లు నేరుగా వినియోగించే విస్కీ కాదని వారు చెబుతున్నారు.
వీటిని భారత్‌లో ఇతర రకాల స్పిరిట్‌లతో కలిపి ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ (IMFL) తయారీకి ముడిసరుకుగా ఉపయోగిస్తున్నారని వివరిస్తున్నారు.
అందువల్ల వీటిని భారత్-యూకే వాణిజ్య ఒప్పందం కింద 75 శాతం రాయితీ పొందే పూర్తిస్థాయి స్కాచ్ విస్కీగా పరిగణించలేమని స్పష్టం చేస్తున్నారు.
వివరాలు
అసలు వివాదం ఏమిటి? 162.5 శాతం పన్ను ఎందుకు?
మే నెలలో ప్రవేశపెట్టిన కొత్త కస్టమ్స్ వర్గీకరణలోని 'కాంపౌండ్ ఆల్కహాలిక్ ప్రిపరేషన్స్' విభాగం కింద ఈ దిగుమతులను పరిగణించాలని అధికారులు భావిస్తున్నారు.
ఈ వర్గానికి 150 శాతం ప్రాథమిక కస్టమ్స్ సుంకం వర్తిస్తుంది. దీనికి అదనపు వినియోగపు పన్ను కూడా కలవడంతో మొత్తం పన్ను భారం 162.5 శాతానికి చేరుతోంది.
అంటే, భారత్-యూకే వాణిజ్య ఒప్పందం అమల్లోకి రాకముందు ఉన్న 150 శాతం దిగుమతి సుంకం కంటే కూడా ఇప్పుడు ఎక్కువ పన్ను చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
వివరాలు
లిక్కర్ దిగ్గజాలపై తీవ్ర ప్రభావం
భారత్‌లోకి దిగుమతి అవుతున్న మొత్తం స్కాచ్ విస్కీ పరిమాణంలో దాదాపు 80శాతం బల్క్ రూపంలోనే వస్తోంది.
ఈ నేపథ్యంలో కస్టమ్స్ వర్గీకరణపై నెలకొన్న వివాదం అంతర్జాతీయ మద్యం కంపెనీలను ఇబ్బందుల్లోకి నెట్టింది.
పెర్నోడ్ రికార్డ్, డియాజియో,బకార్డీ వంటి ప్రముఖ అంతర్జాతీయ సంస్థలతో పాటు దేశీయ మద్యం తయారీదారులకు చెందిన 80కి పైగా షిప్పింగ్ కంటైనర్లు భారత ఓడరేవుల్లోనే నిలిచిపోయాయి.
విచారణ పూర్తయ్యే వరకు 162.5శాతం సుంకాన్ని చెల్లించడంతో పాటు,బ్యాంక్ గ్యారెంటీలు సమర్పించి సరుకును విడుదల చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది.
అయినప్పటికీ,భారీ మొత్తంలో పన్ను చెల్లింపులు,బ్యాంక్ గ్యారెంటీల కారణంగా కంపెనీల వర్కింగ్ క్యాపిటల్‌పై తీవ్ర ఒత్తిడి పడుతోంది.
దిగుమతి చేసుకున్న ముడిసరుకు అందుబాటులో లేకపోవడం కూడా తయారీ కార్యకలాపాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
వివరాలు
లిక్కర్ దిగ్గజాలపై తీవ్ర ప్రభావం
మరోవైపు, భారత్-యూకే ఒప్పందం అమల్లోకి వచ్చిన వెంటనే కొన్ని కంపెనీలు మార్కెట్లో తమ విస్కీ ఉత్పత్తుల ధరలను తగ్గించాయి.
ఇప్పుడు అనూహ్యంగా 162.5 శాతం పన్ను భారం పడటంతో ఇప్పటికే తీసుకున్న నిర్ణయాల కారణంగా నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తోందని పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
బల్క్ స్కాచ్ దిగుమతులకు పన్ను రాయితీ ఇవ్వకపోతే దేశీయంగా మద్యం తయారీ రంగం దెబ్బతినే ప్రమాదం ఉందని భారతీయ మద్యం తయారీదారుల సంఘం హెచ్చరిస్తోంది.
అంతేకాకుండా, స్థానికంగా తయారయ్యే బ్లెండెడ్ విస్కీకి బదులుగా విదేశాల్లోనే బాటిళ్లలో నింపిన స్కాచ్ విస్కీ దిగుమతులు పెరిగే అవకాశం ఉందని పేర్కొంటోంది.
వివరాలు
లిక్కర్ దిగ్గజాలపై తీవ్ర ప్రభావం
ఈ వివాదానికి పరిష్కారం కనుగొనేందుకు భారత వాణిజ్య, ఆర్థిక మంత్రిత్వ శాఖల అధికారులు, బ్రిటన్, స్కాట్లాండ్ ప్రతినిధులు చర్చలు జరుపుతున్నారు.
బల్క్ స్కాచ్ దిగుమతులపై పన్ను వర్గీకరణ, వాణిజ్య ఒప్పందం ద్వారా లభించాల్సిన రాయితీలపై స్పష్టత తీసుకురావడమే ఈ చర్చల ప్రధాన ఉద్దేశం.
ఈ ప్రతిష్ఠంభన ఎప్పుడు తొలగుతుందో, మద్యం కంపెనీలకు ఎలాంటి ఉపశమనం లభిస్తుందో చూడాలి.