SEBI backtracks: ఉద్యోగుల నిరసనతో వెనక్కి తగ్గిన సెబీ.. ఉద్యోగుల సమస్యలు అంతర్గతంగా పరిష్కారం
సెబీ (SEBI) సెప్టెంబర్ 4న విడుదల చేసిన ప్రకటనను వెనక్కి తీసుకుంది. ఉద్యోగుల నుంచి వచ్చిన నిరసనల కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది. కొందరు ఉద్యోగులు పని విధానంపై తమ అభిప్రాయాలు వ్యక్తం చేయగా, సెబీ వారిపై బయటి వ్యక్తుల ప్రోద్బలం ఉందని ఆరోపిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే, ఉద్యోగుల నిరసనలతో ఈ ప్రకటనను వెనక్కి తీసుకుంటూ, ఇకపై ఉద్యోగుల సమస్యలను అంతర్గతంగానే పరిష్కరించుకుంటామని కొత్త ప్రకటనలో స్పష్టం చేసింది.
అంతర్గత విషయాలు నిర్ణీత సమయాల్లో పరిష్కరించుకోవాలని నిర్ణయం
తాజా ప్రకటనలో సెబీ, ఉద్యోగ ప్రతినిధులతో ఇటీవల సుహృద్భావ వాతావరణంలో సమావేశం జరిగిందని పేర్కొంది. ఇకపై సంస్థకు సంబంధించిన అన్ని అంతర్గత విషయాలు నిర్ణీత సమయాల్లో పరిష్కరించుకోవాలని నిర్ణయించినట్లు తెలియజేసింది. సంస్థను అత్యున్నత ప్రమాణాలతో తీర్చిదిద్దడంలో ఉద్యోగుల పాత్రను ప్రశంసిస్తూ, వారి సమస్యలను అంతర్గతంగా పరిష్కరించేందుకు ఒక విధానాన్ని రూపొందించనున్నట్లు ప్రకటించింది.
సెబీ చీఫ్ మాధబి పురీ బచ్‌పై వివాదాలు
సెబీ చీఫ్ మాధబి పురీ బచ్‌పై వివాదాలు చుట్టుముట్టిన సమయంలో, సెబీ ఉద్యోగులు ఆగస్టులో కేంద్ర ఆర్థిక శాఖకు లేఖ రాసిన సంగతి తెలిసిందే. లేఖలో, ఆమె బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సంస్థ పనివిధానం సరిగా లేదని ఆరోపించారు. ఈ పరిణామాల మధ్య, సెబీ సెప్టెంబర్ 4న విడుదల చేసిన ప్రకటనలో బయటి వ్యక్తుల ప్రమేయం ఉందని ఖండించింది. అయితే, సెబీ కార్యాలయం వద్ద ఉద్యోగులు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేయడంతో, ఆ ప్రకటనను ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో, తాజా ప్రకటన వెలువడింది.