Sebi chief on allegations: అవన్నీ తప్పుడు ఆరోపణలు.. మౌనం వీడిన సెబీ చీఫ్ మాధవీ పురీ బచ్
సెబీ చీఫ్ మాధవీ పురీ బచ్ (Madhabi Puri Buch) తనపై వచ్చిన ఆరోపణలకు తొలిసారిగా స్పందించారు. సెబీ చీఫ్‌గా ఉంటూ పరస్పర విరుద్ధ ప్రయోజనాలను పొందారన్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. అవి నిరాధారమైనవి, దురుద్దేశాలతో కూడినవని అన్నారు. సెబీ నిబంధనలకు కట్టుబడి పనిచేస్తున్నానని, తన భర్త ధావల్ బచ్‌తో కలిసి ఒక ఉమ్మడి ప్రకటనను విడుదల చేశారు. ఇటీవల అదానీ గ్రూప్ సహా మరికొన్ని సంస్థలపై దర్యాప్తులో ఇటీవల ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. హిండెన్‌బర్గ్ నివేదికలో, అదానీ గ్రూప్‌పై మాధవీ చీఫ్‌గా ఉన్నప్పుడు నెమ్మదిగా దర్యాప్తు చేయడం, ఆమె భర్త పెట్టుబడులు పెట్టడమే కారణంగా పేర్కొంది.
పిడిలైట్ కంపెనీ సెబీ కిందకి రాదు
కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఆరోపణలను తెరపైకి తెచ్చి,ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి వేతనం పొందుతున్నారని, దర్యాప్తు చేస్తున్న కంపెనీల నుంచి ఆమె భర్త ధావల్ బచ్‌కి చెందిన కన్సల్టెన్సీ ఆదాయం పొందుతున్నారని విమర్శించింది. మహీంద్రా గ్రూప్ ధావల్ బచ్ రూ.4.78కోట్లు పొందారని ఆరోపించినప్పటికీ,ఈనియామకం మూడేళ్ల ముందే జరిగిందని మహీంద్రా చెప్పింది. డాక్టర్ రెడ్డీస్ కూడా రూ.6.58లక్షలు చెల్లించిందని,అవి మాధవీ సెబీ ఛైర్‌పర్సన్ కావడానికి ముందునుంచే జరిగాయనీ వివరించింది. పిడిలైట్ కూడా తమ కంపెనీ సెబీ కిందకి రాలేదని పేర్కొంది.ఈ ఆరోపణలపై హిండెన్‌బర్గ్ ఇంకా స్పందించలేదు కానీ,ఈ ఉమ్మడి ప్రకటనతో ఈ అంశాలపై వారు వివరణ ఇచ్చారు. వారి ఆదాయపు పన్ను రిటర్నుల ఆధారంగా ఆరోపణలు చేయడం తప్పని, అది గోప్యతా ఉల్లంఘనగా పేర్కొన్నారు.
ఐసీఐసీఐ బ్యాంక్ ఆదాయంపై వివరణ
ధావల్ బచ్‌పై కూడా మహీంద్రా,ఐసీఐసీఐ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్,పిడిలైట్ వంటి కంపెనీల నుంచి సేవలు అందించినందుకు ఆయన కన్సల్టెన్సీకి చెల్లింపులు చేశారని వివరించారు. ఆయన వృత్తి నైపుణ్యాలను తప్పుగా అర్ధం చేసుకోవడం బాధాకరమని,ధావల్ బచ్ 35 సంవత్సరాల అనుభవంతో ఐఐటీ దిల్లీ ఇంజినీర్‌గా ఉన్నారని పేర్కొన్నారు. ఐసీఐసీఐ బ్యాంక్ ఆదాయంపై కూడా మాధవీ బచ్ వివరణ ఇచ్చారు.ఉద్యోగ విరమణ తర్వాత 10 సంవత్సరాల పాటు స్టాక్ ఆప్షన్‌లు ఉపయోగించుకోవచ్చని వివరించారు.ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ నుంచి ఆమె యాన్యుటీ పొందుతున్నారని చెప్పారు. అద్దె ఆదాయంపై కూడా వోకార్డ్ అసోసియేట్‌కు ప్రాపర్టీ అద్దెకివ్వడం ద్వారా వచ్చిన ఆదాయంపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. సెబీ ఆ కంపెనీపై ఎలాంటి దర్యాప్తు చేయలేదని,మార్కెట్ నిబంధనల ప్రకారం అగ్రిమెంట్ కుదుర్చుకున్నామని తెలిపారు.