Jio IPO: రూ.37,700 కోట్ల జియో ఐపీఓకు సెబీ గ్రీన్‌సిగ్నల్.. దేశంలోనే అతిపెద్దదిగా!
ఈ వార్తాకథనం ఏంటి
ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయెన్స్ ఇండస్ట్రీస్ డిజిటల్ సేవల విభాగమైన జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) ప్రతిపాదనకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆమోదముద్ర వేసింది. ఈ ఐపీఓ ద్వారా 3.8 బిలియన్ డాలర్లు (సుమారు రూ.37,700 కోట్లు) సమీకరించాలని జియో ప్లాట్‌ఫామ్స్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇదే జరిగితే దేశంలోనే అతిపెద్ద ఐపీఓగా నిలిచే అవకాశం ఉంది. ఐపీఓకు అనుమతి కోరుతూ జియో ప్లాట్‌ఫామ్స్ ముసాయిదా పత్రాలను జూన్‌లో సెబీకి సమర్పించింది. వీటికి శుక్రవారం (ఆగస్టు 28న) సెబీ ఆమోదం తెలిపింది.
వివరాలు
27 కోట్ల తాజా షేర్ల జారీ
ఈ ఐపీఓలో భాగంగా జియో ప్లాట్‌ఫామ్స్ 27 కోట్ల తాజా షేర్లను జారీ చేయనుంది. ఇవి కంపెనీలో 2.9 శాతం వాటాకు సమానం.
ఐపీఓ సందర్భంగా కంపెనీ విలువను 137 బిలియన్ డాలర్లు (సుమారు రూ.13,00,000 కోట్లు)గా అంచనా వేసినట్లు తెలుస్తోంది.
ఈ విలువ ఆధారంగా ఐపీఓ ద్వారా రూ.37,700 కోట్ల వరకు సమీకరించవచ్చని జియో అంచనా వేస్తోంది.
దేశీయ అతిపెద్ద స్టాక్ ఎక్స్ఛేంజ్ నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) కూడా ఐపీఓకు రానుంది. దాని ఇష్యూ పరిమాణం రూ.30,000 కోట్లుగా ఉండే అవకాశం ఉంది.
దీంతో పోలిస్తే జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓ పరిమాణమే పెద్దదిగా ఉండనుంది.
వివరాలు
మరో నాలుగు సంస్థల ఐపీఓలకు కూడా సెబీ ఆమోదం
పబ్లిక్ ఇష్యూ ద్వారా సమీకరించే నిధుల్లో దాదాపు రూ.27,500 కోట్లను జియో ప్లాట్‌ఫామ్స్ అనుబంధ సంస్థ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్‌కు ఉన్న రుణాలను చెల్లించేందుకు వినియోగించనుంది.
మిగిలిన మొత్తాన్ని సాధారణ కార్పొరేట్ అవసరాలకు ఉపయోగించనుంది.
జియో ప్లాట్‌ఫామ్స్‌తో పాటు మరో నాలుగు సంస్థల ఐపీఓ ప్రతిపాదనలకు కూడా సెబీ ఆమోదముద్ర వేసింది. వీటిలో పారస్ హెల్త్‌కేర్, ఎంకే సన్స్ ఫైన్ జ్యువెల్స్, భారత్ పీఈటీ, సద్భావ్ ఫ్యూచర్‌టెక్ ఉన్నాయి.
వివరాలు
పారస్ హెల్త్‌కేర్
పారస్ హెల్త్‌కేర్ ఐపీఓ ద్వారా రూ.1,800 కోట్ల వరకు సమీకరించనుంది. ఇందులో రూ.500 కోట్ల విలువైన తాజా షేర్లను జారీ చేయనుంది.
మరో రూ.1,300 కోట్ల విలువైన షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) కింద ప్రస్తుత వాటాదార్లు విక్రయించనున్నారు.
ఐపీఓ ద్వారా సమీకరించిన నిధులను రుణాల చెల్లింపునకు, అనుబంధ సంస్థలో పెట్టుబడులు పెట్టేందుకు, సాధారణ కార్పొరేట్ అవసరాల కోసం కంపెనీ వినియోగించనుంది.
వివరాలు
ఎంకే సన్స్ ఫైన్ జ్యువెల్స్
ఎంకే సన్స్ ఫైన్ జ్యువెల్స్ ఐపీఓలో 1.36 కోట్ల తాజా షేర్లను జారీ చేయనుంది. దీనితో పాటు 34 లక్షల షేర్లను ఓఎఫ్‌ఎస్ ద్వారా విక్రయించనున్నారు.
కొత్త విక్రయ కేంద్రాల ఏర్పాటుకు, రుణాల చెల్లింపునకు, సాధారణ కార్పొరేట్ అవసరాల కోసం ఐపీఓ ద్వారా సమీకరించే నిధులను కంపెనీ వినియోగించనుంది.
భారత్ పీఈటీ
భారత్ పీఈటీ ఐపీఓ పరిమాణం రూ.760 కోట్లుగా ఉండనుంది. ఇందులో రూ.120 కోట్ల విలువైన తాజా షేర్లను జారీ చేయనున్నారు.
మరో రూ.640 కోట్ల విలువైన షేర్లను ఓఎఫ్‌ఎస్ ద్వారా విక్రయించనున్నారు.
ఐపీఓ ద్వారా సమీకరించే నిధులను రుణాల చెల్లింపునకు, మూలధన వ్యయాలకు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనున్నారు.
వివరాలు
సద్భావ్ ఫ్యూచర్‌టెక్
సద్భావ్ ఫ్యూచర్‌టెక్ ఐపీఓలో భాగంగా 2.55 కోట్ల విలువైన తాజా షేర్లను జారీ చేయనున్నారు.
ఓఎఫ్‌ఎస్ ద్వారా రూ.235 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు విక్రయించనున్నారు.
ఈ ఐపీఓ ద్వారా సమీకరించే నిధులను నిర్వహణ మూలధనం, సాధారణ కార్పొరేట్ అవసరాల కోసం కంపెనీ వినియోగించనుంది.