Loading...
PNB: గ్రేటర్ నోయిడా పీఎన్‌బీ ఖాతాల్లో రూ.35 కోట్లు మాయం.. మేనేజర్ సహా పలువురు సస్పెండ్
మేనేజర్ సహా పలువురు సస్పెండ్

PNB: గ్రేటర్ నోయిడా పీఎన్‌బీ ఖాతాల్లో రూ.35 కోట్లు మాయం.. మేనేజర్ సహా పలువురు సస్పెండ్

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 29, 2026
11:34 am

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడా పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ (పీఎన్‌బీ) ఖాతాదారులకు భారీ షాక్‌ తగిలింది. ఐచ్ఛర్‌ ప్రాంతంలోని బ్యాంకు శాఖలో పొదుపు ఖాతాలు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల నుంచి సుమారు రూ.35 కోట్ల నిధులు మాయమైనట్లు ఆరోపణలు వచ్చాయి. తమ అనుమతి లేకుండానే ఖాతాల్లోని డబ్బులు బదిలీ అయ్యాయని, లావాదేవీల గురించి బ్యాంకు నుంచి ఎలాంటి సందేశాలు కూడా రాలేదని పలువురు ఖాతాదారులు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు, శాఖ మేనేజర్‌తో పాటు పలువురు బ్యాంకు ఉద్యోగులను యాజమాన్యం సస్పెండ్‌ చేసింది.

వివరాలు 

ఖాతాదారుల్లో ఆందోళన.. సమాధానం చెప్పాలంటూ డిమాండ్

బ్యాంకు ఖాతాల్లోని డబ్బులు మాయమవడంతో ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు.

తమ డబ్బు ఎక్కడికి వెళ్లిందో చెప్పాలని బ్యాంకు అధికారులను నిలదీస్తున్నారు.

హనీఫ్‌ ఖాన్‌ అనే ఖాతాదారుడి పొదుపు ఖాతాలో రూ.39 లక్షలు ఉన్నాయి.

అయితే, తన అనుమతి లేకుండా డబ్బులు బదిలీ అయ్యాయని, ఇందుకు సంబంధించి తనకు ఎలాంటి సందేశం రాలేదని, తాను ఎటువంటి పత్రాలపైనా సంతకం చేయలేదని ఆయన తెలిపారు.

విజేంద్ర సింగ్‌ అనే రైతు పరిస్థితి కూడా ఇలాగే ఉంది. భూసేకరణకు సంబంధించి అధికారులు ఇచ్చిన పరిహారం ఆయన ఖాతాలో జమైంది.

అయితే, ఆ ఖాతాలో రూ.87-88 లక్షల వరకు ఉన్న మొత్తం అనూహ్యంగా రూ.లక్షకు పడిపోయింది. తన అనుమతి లేకుండానే డబ్బులు బదిలీ అయ్యాయని ఆయన ఆరోపించారు.

వివరాలు 

టీ అమ్ముకునే మహిళ సేవింగ్స్ మాయం

ఈ వ్యవహారంలో భూసేకరణ పరిహారం అందుకున్నవారికి ఎక్కువ నష్టం జరిగినట్లు తెలుస్తోంది.

బిరోండా గ్రామానికి చెందిన 60 ఏళ్ల సంతోష్‌ అనే మహిళ టీ, సమోసాలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తోంది.

జేవర్‌ విమానాశ్రయ ప్రాజెక్టు కోసం సేకరించిన భూమికి పరిహారంగా ఆమె ఖాతాలో రూ.1.29 కోట్లు జమయ్యాయి.

అయితే, కుటుంబ సభ్యులు ఖాతాను పరిశీలించగా అందులో రూ.1.18 కోట్లు మాయమైనట్లు గుర్తించారు.

ఆ డబ్బే ఆమె సేవింగ్స్ కావడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. దీనిపై సమాధానం చెప్పాలంటూ బ్యాంకు అధికారులను సంప్రదించారు.

ADVERTISEMENT

వివరాలు 

అనుమతి లేని లావాదేవీలు.. అక్రమంగా నగదు ఉపసంహరణ

పొదుపు ఖాతాలతో పాటు ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల నుంచి కూడా అనుమతి లేకుండా డబ్బులు బదిలీ చేసినట్లు, అక్రమంగా నగదు ఉపసంహరించినట్లు ఆరోపణలు వచ్చాయి.

పలువురు ఖాతాదారుల బ్యాలెన్స్‌ భారీగా తగ్గిపోగా, మరికొందరు తమ ఖాతాల్లో ఉండాల్సిన డబ్బు కనిపించడం లేదని చెబుతున్నారు.

ఈ నగదు ఎక్కడికి బదిలీ అయిందనే విషయం ఇంకా స్పష్టంగా తెలియలేదు.

అయితే, ఖాతాదారులకు ఎలాంటి హెచ్చరిక సందేశాలు రాకుండానే ఈ లావాదేవీలు ఎలా జరిగాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ADVERTISEMENT

వివరాలు 

ఉద్యోగులపై పీఎన్‌బీ వేటు.. కేసు నమోదు

ఖాతాదారుల ఫిర్యాదుల నేపథ్యంలో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ అధికారులు శాఖ మేనేజర్‌తో పాటు పలువురు ఉద్యోగులను సస్పెండ్‌ చేశారు.

బాధితుల ఫిర్యాదులను పరిష్కరిస్తామని బ్యాంకు యాజమాన్యం అధికారులకు హామీ ఇచ్చింది.

అయితే, ఈ వ్యవహారంలో అసలు ఎంత మొత్తం మాయమైంది? ఎంతమంది ఖాతాదారులు నష్టపోయారు? అనే వివరాలు పోలీసుల దర్యాప్తు పూర్తయిన తర్వాతే వెల్లడికానున్నాయి.

ఈ ఘటనపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌)లోని సెక్షన్‌ 316(5) కింద నమ్మకద్రోహానికి సంబంధించిన కేసు నమోదు చేశారు.

ADVERTISEMENT