LOADING...
Modi-Trump: వాణిజ్య ఒప్పందంపై DC నుండి సంకేతం.. మోదీ-ట్రంప్‌ భేటీతోనే చర్చలు కొలిక్కి..?
మోదీ-ట్రంప్‌ భేటీతోనే చర్చలు కొలిక్కి..?

Modi-Trump: వాణిజ్య ఒప్పందంపై DC నుండి సంకేతం.. మోదీ-ట్రంప్‌ భేటీతోనే చర్చలు కొలిక్కి..?

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 09, 2025
11:22 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌-అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం పై సుదీర్ఘ చర్చలు జరగుతున్నాయి. ఇరు దేశాల ప్రతినిధులు ఎన్నిసార్లు సమావేశమయ్యినా, ఇప్పటివరకు ఏకాభిప్రాయం కుదరలేదు. అయితే, ఈ ప్రతిష్టంభన తొలిగి ట్రేడ్‌ డీల్‌ ఓ కొలిక్కి రావాలంటే భారత ప్రధాని నరేంద్ర మోదీ , అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య ప్రత్యక్ష భేటీ అవసరమని అమెరికా ప్రభుత్వం భావిస్తోంది. వాస్తవానికి, వాషింగ్టన్ నుంచి ఇప్పటికే భారత వైపుకు ఈ సూచనలు చేరవలసిన పరిస్థితి ఉంది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ సీనియర్ అధికారులు ఒక ప్రసిద్ధ ఆంగ్ల పత్రిక ద్వారా వెల్లడించారు.

వివరాలు 

పరిస్థితులు మారే అవకాశం

"వాణిజ్య ఒప్పందం ప్రకటనకు ముందు, ప్రధాని మోదీతో భేటీ కావాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఆయన కార్యవర్గం భావిస్తున్నారు. అయితే, భారత విధాన ప్రకారం ఇది సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే, సాధారణంగా ట్రేడ్ డీల్ ఆమోదమైన తర్వాతే ఇరు దేశాధినేతలు పరస్పరం సమావేశమవుతారు. అయితే, పరిస్థితులు మారే అవకాశం ఉంది, ఎందుకంటే ట్రంప్ అధ్యక్షత్వంలో అనేక సార్లు అమలు చేస్తున్న ప్రోటోకాల్‌లను పక్కన పెట్టారు" అని అధికారులు పేర్కొన్నారు.

వివరాలు 

సెర్గియో గోర్ ఈ అంశంపై భారత ప్రభుత్వంతో చర్చించే అవకాశాలు

ప్రస్తుతం అమెరికాతో వాణిజ్య సంబంధాల చర్చలకు భారత వాణిజ్యమంత్రి పీయూష్ గోయెల్ నేతృత్వం వహిస్తున్నారు. ఇటీవల గోయల్ బృందం అమెరికాకు వెళ్లి అమెరికా వాణిజ్య ప్రతినిధి జెమీసన్ గ్రోర్‌తో పలు సార్లు సమావేశమయ్యారు. ఈ చర్చల నేపథ్యంలో, ట్రంప్,మోదీ మధ్య ప్రత్యక్ష సమావేశం అవసరమని అమెరికా అధికారులు భావిస్తున్నారు. అందుకే, భారత్‌లో యూఎస్ రాయబారిగా నియమితులు ఉన్న సెర్గియో గోర్ ఈ అంశంపై భారత ప్రభుత్వంతో చర్చించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.

వివరాలు 

కౌలాలంపూర్ వేదికగా ఆసియాన్, ఈస్ట్ ఇండియా నేతల సదస్సు

ఇదిలాఉండగా.. అక్టోబరు 26 నుండి 28 వరకు మలేసియాలోని కౌలాలంపూర్ వేదికగా ఆసియాన్, ఈస్ట్ ఇండియా నేతల సదస్సు జరగనుంది. ఈ సదస్సు సందర్భంలో ట్రంప్-మోదీ భేటీ జరిగే అవకాశాలు ఉన్నట్టు రిపోర్టులు ఉన్నాయి. అయితే, ఈ సదస్సుకు మోదీ పర్యటన ఇంకా ఖరారు కాలేదు. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం లోతుగా చర్చలు జరుపుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఒకవేళ ప్రధాని మోదీ మలేసియా వెళ్తే.. ఆపరేషన్‌ సిందూర్ అనంతరం ఇరుదేశాల నేతలు మొదటిసారి భేటీ అయ్యే అవకాశం ఉంది ప్రస్తుత పరిస్థితుల్లో, భారత్‌పై అమెరికా 50 శాతం టారిఫ్‌లు కొనసాగుతోన్న సంగతి తెలిసిందే.