LOADING...
Gold & Silver Prices: ఆకాశాన్ని తాకుతున్న బంగారం, వెండి ధరలు.. పెట్టుబడిదారుల్లో ఉత్కంఠ
ఆకాశాన్ని తాకుతున్న బంగారం, వెండి ధరలు.. పెట్టుబడిదారుల్లో ఉత్కంఠ

Gold & Silver Prices: ఆకాశాన్ని తాకుతున్న బంగారం, వెండి ధరలు.. పెట్టుబడిదారుల్లో ఉత్కంఠ

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 11, 2026
04:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

2025లో బంగారం, వెండి ధరలు సృష్టించిన చారిత్రక రికార్డులు సామాన్యుల నుంచి పెట్టుబడిదారుల వరకూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి. ఈ బూమ్‌ ఇక్కడితో ఆగిపోతుందనుకుంటే అది పొరపాటేనని మార్కెట్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఎందుకంటే ఈ 'బుల్ రన్' 2026లో కూడా కొనసాగుతుందని, కొత్త ఏడాదిలో బంగారం, వెండి ధరలు మరింత ఎత్తుకు చేరుకునే అవకాశముందని వారు అంచనా వేస్తున్నారు. 2026లో ఈ విలువైన లోహాల ధరలు ఎలా ఉండబోతున్నాయన్నదే ఇప్పుడు పెట్టుబడిదారుల మధ్య ప్రధాన చర్చగా మారింది. ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA), MCX నుంచి వచ్చిన తాజా గణాంకాలను పరిశీలిస్తే ఇప్పటికే మార్కెట్‌లో వేడి పెరిగినట్టు స్పష్టంగా కనిపిస్తోంది.

Details

మరింత పెరగడానికి సిద్ధం

గత వారం బంగారం ధర 10 గ్రాములకు రూ.1,38,875కి చేరింది. జ్యువెలరీ షాపుల్లో 24 క్యారెట్ల బంగారం స్పాట్ ధర 10 గ్రాములకు రూ.1,37,122 స్థాయిలో కొనసాగుతోంది. బంగారంతో పోలిస్తే వెండి మరింత బలమైన ప్రదర్శన చూపిస్తోంది. MCXలో మార్చి గడువు ముగిసిన వెండి ధర కిలోగ్రాముకు రూ.2,52,002కి చేరుకుంది. వెండి తన మునుపటి ధరల శ్రేణిని దాటుకుని, స్పష్టమైన బుల్లిష్ దశలోకి ప్రవేశించినట్టు మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అంటే రాబోయే రోజుల్లో వెండి ధరలు మరింత పెరగడానికి సిద్ధంగా ఉన్నాయని అర్థం. ఈ విపరీతమైన ధరల పెరుగుదలకు కేవలం వివాహాల సీజన్ కారణం మాత్రమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భౌగోళిక-ఆర్థిక పరిస్థితులే ప్రధాన కారణమని నిపుణులు పేర్కొంటున్నారు.

Details

 వెండి రూ.3 లక్షల మార్క్‌ను తాకుతుందా?

గత ఏడాది వెండిలో పెట్టుబడి పెట్టిన వారికి అసాధారణ రాబడులు లభించాయి. 2025లో పెట్టుబడిదారులకు బంగారం సుమారు 66 శాతం రాబడిని అందించగా, వెండి 171 శాతం కంటే ఎక్కువ లాభాలను ఇచ్చింది. ఈ ధరల పెరుగుదల ఎక్కడ ఆగుతుందన్నదే ఇప్పుడు అతిపెద్ద ప్రశ్నగా మారింది. మార్కెట్ నిపుణుల అంచనాల ప్రకారం, 2026 చివరి నాటికి అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర ఔన్సుకు 5,000 డాలర్ల స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. అదే భారత మార్కెట్‌లో రూపాయల విలువలో పరిశీలిస్తే, బంగారం ధర 10 గ్రాములకు రూ.1.70 లక్షల నుంచి రూ.2 లక్షల మధ్య ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

Advertisement

Details

వెండి ఔన్సుకు 100 డాలర్ల స్థాయి

ఇదే సమయంలో వెండి అంచనాలు మరింత సంచలనంగా ఉన్నాయి. వెండి ఔన్సుకు 100 డాలర్ల స్థాయికి చేరుకోవచ్చని నిపుణులు భావిస్తున్నారు. దీనిని భారత మార్కెట్‌లోకి మారుస్తే, వెండి ధర కిలోగ్రాముకు రూ.2.8 లక్షల నుంచి రూ.3.3 లక్షల మధ్య ఉండే అవకాశముందని సమాచారం. మొత్తానికి 2026లో కూడా బంగారం, వెండి ధరలు ఆకాశమే హద్దుగా దూసుకుపోయే సూచనలు ఉన్నాయని, ఈ విలువైన లోహాలు పెట్టుబడిదారులకు మరోసారి ఆశ్చర్యకరమైన రాబడులు అందించే అవకాశాన్ని మార్కెట్ వర్గాలు కొట్టిపారేయడం లేదు.

Advertisement