Loading...
Budget Rule: జీతం మిగలడం లేదా? 70/10/10/10 బడ్జెట్‌ రూల్‌తో ఇలా ప్లాన్‌ చేయండి
జీతం మిగలడం లేదా? 70/10/10/10 బడ్జెట్‌ రూల్‌తో ఇలా ప్లాన్‌ చేయండి

Budget Rule: జీతం మిగలడం లేదా? 70/10/10/10 బడ్జెట్‌ రూల్‌తో ఇలా ప్లాన్‌ చేయండి

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 06, 2026
05:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

జీతం ఎంత వచ్చినా నెలాఖరుకు డబ్బు మిగలడం లేదా? వచ్చిన ఆదాయం ఎక్కడ ఖర్చవుతుందో తెలియకపోతే బడ్జెట్‌ వేసుకోవడం చాలా ముఖ్యం. ఇందుకోసం జీతాన్ని నాలుగు భాగాలుగా విభజించే 70/10/10/10 బడ్జెట్‌ విధానం ఉపయోగపడుతుంది. ఈ పద్ధతితో అవసరాలు, అత్యవసర పొదుపు, పెట్టుబడులు, రుణ చెల్లింపులకు ప్రత్యేకంగా డబ్బు కేటాయించుకోవచ్చు. జీతంలో 70 శాతం అవసరాల కోసం.. నెలవారీ ఆదాయంలో గరిష్ఠంగా 70 శాతం వరకు తప్పనిసరి ఖర్చులకు కేటాయించాలి. ఇంటి అద్దె, హోమ్‌లోన్‌ ఈఎంఐ, విద్యుత్‌ బిల్లు, కిరాణా సరుకులు, బీమా ప్రీమియం, ప్రయాణ ఖర్చులు వంటి వాటిని ఇందులో చేర్చుకోవచ్చు. ఉదాహరణకు నెలకు రూ.60 వేల జీతం వస్తే.. సుమారు రూ.42 వేల వరకు ఈ అవసరాలకు వినియోగించుకోవచ్చు.

వివరాలు 

10 శాతం అత్యవసర నిధికి..

మిగిలిన ఆదాయంలో 10 శాతాన్ని అత్యవసర పరిస్థితుల కోసం పక్కన పెట్టాలి.అకస్మాత్తుగా వచ్చే వైద్య ఖర్చులు, ఇంట్లో మరమ్మతులు,ఏడాదికి ఒకసారి ఎదురయ్యే కొన్ని ఖర్చులు వంటి వాటికి ఈ పొదుపు ఉపయోగపడుతుంది.

ఇలా ప్రత్యేకంగా ఎమర్జెన్సీ ఫండ్‌ ఏర్పాటు చేసుకుంటే ఊహించని ఖర్చుల కోసం క్రెడిట్‌ కార్డులు లేదా ఇతర రుణాలపై ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుంది.

మరో 10 శాతం పెట్టుబడులకు..

ఆదాయంలో మరో 10 శాతాన్ని దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసం పెట్టుబడి పెట్టొచ్చు.

మ్యూచువల్‌ ఫండ్స్‌, రిటైర్‌మెంట్‌ ప్లాన్లు తదితర మార్గాలను పరిశీలించవచ్చు.

అయితే పెట్టుబడులు ప్రారంభించే ముందు వ్యక్తిగత ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉందో లేదో చూసుకోవడం అవసరం.

తమ ఆదాయం,ఖర్చులు,రుణ బాధ్యతలకు అనుగుణంగా పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవాలి.

వివరాలు 

మిగిలిన 10 శాతం రుణాల కోసం..

చివరి 10 శాతాన్ని అప్పులను త్వరగా తీర్చేందుకు ఉపయోగించాలి.

ముఖ్యంగా అధిక వడ్డీ రేటు ఉన్న రుణాలకు సాధారణ ఈఎంఐకి అదనంగా చెల్లింపులు చేస్తే అసలు మొత్తం త్వరగా తగ్గడంతో పాటు భవిష్యత్తులో చెల్లించాల్సిన వడ్డీ భారం కూడా తగ్గుతుంది.

ఉదాహరణకు నెలకు రూ.80 వేల ఆదాయం ఉంటే.. రూ.8 వేల వరకు అదనపు రుణ చెల్లింపులకు కేటాయించవచ్చు.

అప్పులు తీరిన తర్వాత ఏం చేయాలి?

రుణాలు పూర్తిగా చెల్లించిన తర్వాత వాటి కోసం కేటాయించిన 10 శాతాన్ని మళ్లీ సాధారణ ఖర్చుల్లో కలిపేయకూడదు.

ఆ మొత్తాన్ని దీర్ఘకాలిక పెట్టుబడులు లేదా అత్యవసర పొదుపులకు మళ్లించడం ద్వారా ఆర్థిక భద్రతను మరింత పెంచుకోవచ్చు.

ADVERTISEMENT

వివరాలు 

ఇది అందరికీ ఒకేలా వర్తించదు..

70/10/10/10 అనేది కచ్చితంగా పాటించాల్సిన నిబంధన కాదు. ప్రతి ఒక్కరి ఆదాయం, కుటుంబ బాధ్యతలు, ఈఎంఐలు, అప్పుల స్థాయి వేర్వేరుగా ఉంటాయి.

ఎక్కువ రుణాలు లేదా ఈఎంఐలు ఉన్నవారు తమ పరిస్థితికి అనుగుణంగా ఈ నిష్పత్తిని మార్చుకోవచ్చు.

ముందుగా నెలవారీ ఖర్చులను పరిశీలించి, అవసరం లేని వ్యయాలను తగ్గించాలి.

ఆ తర్వాత అత్యవసర పొదుపు, రుణ చెల్లింపులు, పెట్టుబడులకు క్రమంగా ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడం మంచిది.

ADVERTISEMENT