Sony- Zee విలీనం రద్దు.. నాయకత్వంపై కుదరని ఏకాభిప్రాయం
సోనీ కంపెనీ జీతో తన 10 బిలియన్ డాలర్ల విలీనాన్ని రద్దు చేసుకుంది. ఈ విషయాన్ని సోమవారం ఉదయం Zee కంపెనీకి Sony సంస్థ లేఖ ద్వారా ఈ విషయాన్ని తెలియజేసింది. ఈ విషయమై రెండు సంస్థల మధ్య గత రెండేళ్లుగా చర్చలు నడుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ చర్చలకు ముగింపు పలుకుతూ సోనీ కంపెనీ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. జీ కంపెనీ షరతులను నెరవేర్చనందున సోనీ ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్లు బ్లూమ్‌బెర్గ్ పేర్కొంది. రెండు మీడియా దిగ్గజాల సంయుక్త సంస్థకు ఎవరు నాయకత్వం వహించాలనే దానిపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఒప్పందం వీగిపోయింది.
వెనక్కి తగ్గని జీ సంస్థ
విలీన సంస్థకు జీ సీఈవో పునీత్ గోయెంకా నాయకత్వం వహిస్తారా? లేదా? అనే అంశంపై రెండు సంస్థల మధ్య రెండేళ్లుగా ప్రతిష్టంభన నెలకొంది. నిధుల మళ్లింపు ఆరోపణల నేపథ్యంలో పునీత్ గోయెంకా సెబీ విచారణను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో పునీత్ గోయెంకా బదులు అదే సంస్థలోని వేరొకరు విలీన కంపెనీ నాయకత్వ బాధ్యతలు చేపట్టాలని సోనీ ప్రతిపాదన పెట్టింది. అయితే జీ సంస్థ మాత్రం పునీత్ గోయెంకానే నాయకుడిగా ఉండాలని పట్టుబట్టింది. ఈ అంశంపై గత రెండేళ్లుగా రెండు సంస్థల మధ్య చర్చలు నడుస్తున్నాయి. ఇప్పుడు ఆ చర్చలకు సోనీ కంపెనీ చెక్ పెడుతూ విలీనాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.