LOADING...
Space X: ఐపీఓకు స్పేస్‌-ఎక్స్ రెడీ
ఐపీఓకు స్పేస్‌-ఎక్స్ రెడీ

Space X: ఐపీఓకు స్పేస్‌-ఎక్స్ రెడీ

వ్రాసిన వారు Sirish Praharaju
May 21, 2026
10:08 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాకు చెందిన ప్రముఖ అంతరిక్ష పరిశోధనా సంస్థ స్పేస్‌-X ఐపీఓ కోసం దరఖాస్తు చేసింది. దీంతో కంపెనీ షేర్లు త్వరలోనే అమెరికా స్టాక్ మార్కెట్‌లో కొనుగోలు,అమ్మకాలకు అందుబాటులోకి రానున్నాయి. వచ్చే నెలలో 'SPCX' టికర్ సింబల్‌తో ఈ ఐపీఓ ప్రారంభమయ్యే అవకాశం ఉందని సమాచారం. వాల్ స్ట్రీట్ చరిత్రలోనే ఇది అతిపెద్ద ఐపీఓలలో ఒకటిగా నిలిచే అవకాశముందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. స్పేస్‌ఎక్స్‌కు అధినేత అయిన ఎలాన్ మస్క్ ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు. కంపెనీ విలువ ప్రస్తుతం 1.25 ట్రిలియన్ డాలర్లుగా అంచనా వేస్తున్నారు. ఇందులో ఎక్కువ వాటా మస్క్‌కే ఉండటంతో ఆయన వాటా విలువ 600 బిలియన్ డాలర్లకు పైగా ఉండొచ్చని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

వివరాలు 

స్పేస్ ఎక్స్ పూర్తి పేరు 'స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ టెక్నాలజీస్

దీంతో ఆయన మొత్తం ఆస్తుల విలువ 1 ట్రిలియన్ డాలర్ల మార్క్‌ను దాటే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికే 2025లో 500 బిలియన్ డాలర్లకు పైగా వ్యక్తిగత సంపద కలిగిన తొలి వ్యక్తిగా మస్క్ రికార్డు సృష్టించారు. స్పేస్ ఎక్స్ పూర్తి పేరు 'స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ టెక్నాలజీస్'. గత ఏడాది కంపెనీకి 18.6 బిలియన్ డాలర్ల ఆదాయం వచ్చినప్పటికీ 4.9 బిలియన్ డాలర్ల నష్టం నమోదైంది. ఇక 2026 తొలి త్రైమాసికంలో 4.7 బిలియన్ డాలర్ల ఆదాయం వచ్చినా, 4.3 బిలియన్ డాలర్ల నష్టం చవిచూసింది. కంపెనీకి మొత్తం 102 బిలియన్ డాలర్ల ఆస్తులు ఉండగా, అప్పులు మాత్రం 60.5 బిలియన్ డాలర్ల వరకు ఉన్నట్లు వెల్లడైంది.

వివరాలు 

స్పేస్‌ఎక్స్‌ను ఇబ్బందులకు గురి చేస్తున్నపలు కేసులు

ఇక పలు కేసులు కూడా స్పేస్‌ఎక్స్‌ను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. పేటెంట్ ఉల్లంఘనలు, యూరోపియన్ యూనియన్ కంటెంట్ నిబంధనల ఉల్లంఘన, మ్యూజిక్ కాపీరైట్ వివాదాలు, డేటా లీక్ కేసులు కంపెనీపై నమోదయ్యాయి. అలాగే xAI సంస్థ రూపొందించిన 'గ్రోక్' ఏఐ చాట్‌బాట్‌ను ఉపయోగించి మహిళలు,బాలికల ఫేక్ అసభ్య చిత్రాలు తయారు చేస్తున్నారనే ఆరోపణలతో కూడా కేసులు ఎదుర్కొంటోంది. ఈ కేసుల కారణంగా భారీ న్యాయ వ్యయాలు వచ్చే అవకాశం ఉందని కంపెనీ పేర్కొంది. అదే సమయంలో ఎలాన్ మస్క్ తన ఏఐ సంస్థ xAIను రద్దు చేసి, భవిష్యత్తులో ఏఐ ప్రాజెక్టులను స్పేస్‌ఎక్స్ ఆధ్వర్యంలోనే ముందుకు తీసుకెళ్లాలని యోచిస్తున్నట్లు సమాచారం.

Advertisement