SpaceX: స్పేస్-X నష్టం రూ.5,100 కోట్లు.. అయినా ఆదాయంలో భారీ జంప్
ఈ వార్తాకథనం ఏంటి
ఎలాన్ మస్క్ నేతృత్వంలోని స్పేస్-X జూన్ త్రైమాసికంలో 541 మిలియన్ డాలర్ల (సుమారు రూ.5,100 కోట్ల) నికర నష్టాన్ని నమోదు చేసింది. స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్టింగ్ అనంతరం కంపెనీ ప్రకటించిన తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ఇవే కావడం విశేషం. కృత్రిమ మేధ (ఏఐ) మౌలిక సదుపాయాల అభివృద్ధిపై భారీగా పెట్టుబడులు పెట్టడం వల్ల ఈ నష్టం నమోదైనట్లు కంపెనీ వెల్లడించింది. అయితే మార్కెట్ విశ్లేషకులు అంచనా వేసిన నష్టంతో పోలిస్తే వాస్తవ నష్టం సగానికి కూడా తక్కువగా ఉండటం గమనార్హం. నష్టం నమోదైనప్పటికీ కంపెనీ ఆదాయం మాత్రం గణనీయంగా పెరిగింది. గతేడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే మొత్తం ఆదాయం 90శాతం వృద్ధి చెంది 7.8బిలియన్ డాలర్లకు (సుమారు రూ.74,100 కోట్లకు) చేరుకుంది.
వివరాలు
స్టార్‌లింక్ వినియోగదారుల సంఖ్య 1.2కోట్లు
స్పేస్-Xకు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న శాటిలైట్ ఇంటర్నెట్ సేవల సంస్థ స్టార్‌లింక్ మరోసారి బలమైన వృద్ధిని నమోదు చేసింది.
గతేడాదితో పోలిస్తే స్టార్‌లింక్ ఆదాయం 66శాతం పెరిగింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా స్టార్‌లింక్ వినియోగదారుల సంఖ్య రెట్టింపై 1.2కోట్లకు చేరినట్లు కంపెనీ వెల్లడించింది.
ఇక పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఏఐ మౌలిక సదుపాయాల విస్తరణ కోసం స్పేస్‌ఎక్స్ భారీగా మూలధన వ్యయాలు చేసింది.
గతేడాది ఈ ఖర్చులు 3 బిలియన్ డాలర్ల (సుమారు రూ.28,500 కోట్ల) కంటే తక్కువగా ఉండగా, తాజా త్రైమాసికంలో అవి 18 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.1.71 లక్షల కోట్లకు) పెరిగాయి.
ఈ భారీ పెట్టుబడుల ప్రభావమే కంపెనీ త్రైమాసిక ఫలితాల్లో నష్టంగా ప్రతిఫలించినట్లు సంస్థ పేర్కొంది.