SpiceJet: విమానం ఆలస్యం.. తండ్రి అంత్యక్రియలకు వెళ్లలేక కన్నీరుమున్నీరైన కొడుకు.. స్పైస్‌జెట్ తీరుపై ఆగ్రహం
ఈ వార్తాకథనం ఏంటి
ఓ వైపు తండ్రి మరణం.. మరోవైపు స్వగ్రామానికి వెళ్లేందుకు విమానం ఆలస్యం కావడంతో ఓ ప్రయాణికుడు తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. తండ్రి అంత్యక్రియలకు సమయానికి చేరుకునే అవకాశం లేకపోవడంతో విమానాశ్రయంలో స్పైస్ జెట్ సిబ్బందిని వేడుకున్నాడు. ఈ హృదయవిదారక ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఢిల్లీ నుంచి పాట్నా వెళ్లాల్సిన విమానం ఆలస్యం కావడంతో ఆ ప్రయాణికుడు కన్నీరుమున్నీరయ్యాడు. తన తండ్రి అంత్యక్రియలకు వెళ్లేందుకు సాయం చేయాలని సిబ్బందిని అభ్యర్థించాడు.
వివరాలు
సోషల్ మీడియాలో ఘటనను ప్రస్తావించిన ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు
ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం (DUSU) అధ్యక్షుడు యశ్ దబాస్ ఈ ఘటనను సోషల్ మీడియాలో వెలుగులోకి తీసుకొచ్చారు.
బాధిత ప్రయాణికుడికి సంబంధించిన వీడియోను ఆయన షేర్ చేశారు.
విమానం ఆలస్యంపై స్పైస్‌జెట్ గ్రౌండ్ స్టాఫ్‌ను ఆయన ప్రశ్నించడం అందులో కనిపించింది.
మరోవైపు విమానం కోసం ప్రయాణికులు ఎదురుచూస్తున్నారు.
పాట్నా వెళ్లాల్సిన విమానం 34వ గేట్ నుంచి బయలుదేరాల్సి ఉండగా.. అప్పటివరకు బోర్డింగ్ కూడా ప్రారంభం కాలేదని యశ్ దబాస్ వీడియోలో పేర్కొన్నారు.
వివరాలు
ఇంతటి బాధ్యతారాహిత్యం ఎందుకు? : దబాస్
విమానం ఆలస్యంపై యశ్ దబాస్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
తండ్రి అంత్యక్రియలకు వెళ్లలేక ఓ కొడుకు ఇబ్బందులు పడుతుంటే.. ఇంతటి బాధ్యతారాహిత్యం ఎందుకని విమాన సిబ్బందిని ప్రశ్నించారు.
"ఓ కొడుకు తన తండ్రి అంత్యక్రియలకు చేరుకోలేకపోతున్నాడు. మీరెందుకు ఇంత పెద్ద పాపం మూటగట్టుకుంటున్నారు?" అని నిలదీశారు.
మరోవైపు బాధిత ప్రయాణికుడు తన ఫోన్‌లో ఓ వీడియో చూపిస్తూ.. "మా నాన్న చనిపోయారు. దయచేసి నన్ను అక్కడికి చేర్చండి" అంటూ సిబ్బందిని వేడుకున్నాడు.
వివరాలు
ప్రయాణికులను ఇంతలా ఇబ్బంది పెడతారా?
ఈ వీడియోను షేర్ చేసిన యశ్ దబాస్.. స్పైస్‌జెట్ తీరుపై తీవ్రంగా మండిపడ్డారు.
తండ్రి మరణవార్త విని బాధలో ఉన్న ఓ కొడుకు ఇంటికి చేరుకునేందుకు ప్రయత్నిస్తుంటే.. విమానం ఆలస్యం కావడంతో నానా ఇబ్బందులు పడాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రయాణికులను ఇలాంటి పరిస్థితుల్లోకి నెట్టినందుకు విమానయాన సంస్థ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
ప్రయాణికుల పట్ల బాధ్యతతో పాటు కనీస మానవత్వం చూపించాలని సోషల్ మీడియా వేదికగా స్పైస్‌జెట్‌ను ట్యాగ్ చేస్తూ వ్యాఖ్యానించారు.
వివరాలు
స్పైస్‌జెట్ విమాన సర్వీసుల్లో వరుస అంతరాయాలు
స్పైస్‌జెట్ విమాన సర్వీసుల్లో వరుసగా అంతరాయాలు ఎదురవుతున్న నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఈ నెల ప్రారంభంలోనూ ఢిల్లీ విమానాశ్రయంలో స్పైస్‌జెట్ విమానం గంటల తరబడి ఆలస్యమైంది.
చివరకు ఆ విమానాన్ని రద్దు చేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
దీంతో ఆగ్రహించిన ప్రయాణికులు విమానయాన సంస్థ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. విమానం ఎందుకు రద్దు చేశారో చెప్పాలని నిలదీశారు.
మరోవైపు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న స్పైస్‌జెట్.. కాగితాలపై దాదాపు 50 విమానాలు ఉన్నట్లు చూపుతున్నప్పటికీ, ప్రస్తుతం కేవలం ఐదు విమానాలే సేవలు అందిస్తున్నాయని బిజినెస్ టుడే కథనం పేర్కొంది.