SpiceJet Layoffs: 1400 మంది ఉద్యోగులను తొలగించనున్న స్పైస్‌జెట్
SpiceJet Layoffs: ప్రముఖ విమానయాన సంస్థ 'స్పైస్‌జెట్' సుమారు 1,400 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. ఖర్చులను తగ్గించుకోవడానికి, పెట్టుబడిదారులను ఆకర్షించేందుకే ఉద్యోగులను తొలగిస్తున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం కంపెనీలో 9000 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో 15శాతం మందిని అంటే 1400 మందిని కంపెనీ తొలగించబోతోంది. స్పైస్‌జెట్ ప్రస్తుతం 30 విమానాలను నడుపుతోంది. ప్రస్తుతం ఉన్న సిబ్బందిలో కొందరు ఉద్యోగులు, పైలట్‌లు విదేశీ క్యారియర్‌ల నుంచి లీజు పద్ధితిలో కంపెనీ నియమించుకుంది.
జీతాలు చెల్లించడంలో జాప్యం
స్పైస్‌జెట్ కొన్ని నెలలుగా ఉద్యోగులకు జీతాలు చెల్లించడంలో జాప్యం చేస్తోంది. చాలా మందికి జనవరికి సంబంధించిన జీతాలు ఇంకా అందలేదు. ఉద్యోగులకు రూ.60కోట్ల మేరకు జీతాలను కంపెనీ చెల్లించాల్సి ఉంది. 2,200 కోట్ల నిధులను సమీకరించేందుకు ప్రయత్నిస్తున్నామని, అందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని స్పైస్‌జెట్ తెలిపింది. ఇన్వెస్టర్లును ఆకర్షించే ప్రయత్నంలో భాగంగానే ఖర్చులను తగ్గించే మార్గాలను అన్వేషిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. స్పైస్‌జెట్ 2019లో గరిష్టంగా 16,000 మంది ఉద్యోగులు, 118 విమానాలను కలిగి ఉంది.