LOADING...
Star Health: క్లెయిమ్ తిరస్కరణ వీడియో వైరల్.. వివరణ ఇచ్చిన స్టార్‌హెల్త్
క్లెయిమ్ తిరస్కరణ వీడియో వైరల్.. వివరణ ఇచ్చిన స్టార్‌హెల్త్

Star Health: క్లెయిమ్ తిరస్కరణ వీడియో వైరల్.. వివరణ ఇచ్చిన స్టార్‌హెల్త్

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 17, 2026
04:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

అనుకోని వైద్య అత్యవసర పరిస్థితుల్లో ఆర్థిక భద్రత కల్పిస్తుందనే నమ్మకంతో చాలా మంది ఆరోగ్య బీమా పాలసీలు తీసుకుంటారు. కానీ అవసరం వచ్చిన సమయంలో అదే పాలసీ ఉపయోగపడకపోతే పరిస్థితి ఎంత కష్టంగా ఉంటుందో లఖ్‌నవూకు చెందిన ఓ వ్యక్తి అనుభవం చెబుతోంది. తన తల్లి పేరుతో తీసుకున్న ఆరోగ్య బీమా పాలసీపై క్లెయిమ్‌ను స్టార్‌హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ సంస్థ తిరస్కరించడంతో ఈ విషయం వివాదంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కంపెనీ దీనిపై స్పందించింది.

వివరాలు 

రూ.50వేల ప్రీమియం చెల్లించిన లఖ్‌నవూకు చెందిన వ్యక్తి

లఖ్‌నవూకు చెందిన ఆ వ్యక్తి తన తల్లి కోసం ప్రతి ఏడాది సుమారు రూ.50వేల ప్రీమియం చెల్లిస్తూ ఆరోగ్య బీమా పాలసీ కొనసాగిస్తున్నాడు. అయితే ఆమె అనారోగ్యానికి గురైన సమయంలో క్లెయిమ్ కోసం లఖ్‌నవూలోని స్టార్‌హెల్త్ కార్యాలయాన్ని సంప్రదించాడు. అక్కడ గంటల తరబడి ఎదురు చూసే పరిస్థితి ఎదురవడంతో పాటు చివరికి క్లెయిమ్‌ను తిరస్కరించారు. అంతేకాకుండా,"మా ద్వారా పాలసీ తీసుకోలేదు కదా" అంటూ ఓ ఏజెంట్ స్పందించాడని అతడు ఆరోపించాడు. ఈ సంఘటనపై 'కురుపెంచ్‌హెల్త్' అనే ఎక్స్ (ట్విట్టర్) ఖాతా ద్వారా వీడియోతో సహా పోస్ట్ చేయగా అది విస్తృతంగా వైరల్ అయ్యింది. ప్రముఖ రచయిత నీలేశ్ మిశ్రా కూడా అదే పోస్ట్‌ను రీపోస్ట్ చేస్తూ విమర్శలు చేయడంతో చర్చ మరింత ముదిరింది.

వివరాలు 

అధికారికంగా స్పందించిన స్టార్‌హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్

ఈ నేపథ్యంలో స్టార్‌హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ సంస్థ అధికారికంగా స్పందించింది. లఖ్‌నవూ క్లెయిమ్ తిరస్కరణపై ప్రకటన విడుదల చేస్తూ తమ వాదనను వివరించింది. "ఆరోగ్యానికి సంబంధించిన అంశాలు భావోద్వేగాలకు సంబంధించినవని మేం అర్థం చేసుకుంటున్నాం. కానీ వాస్తవాలను పక్కనపెట్టి మాపై ఆరోపణలు చేయడం సరైంది కాదు. క్లెయిమ్ పరిశీలన సమయంలో పాలసీదారునికి ముందుగానే ఉన్న వైద్య సమస్యలు (ప్రీ-ఎగ్జిస్టింగ్ కండిషన్లు) గుర్తించాం. వాటికి సంబంధించిన ఆధార పత్రాలు ఇవ్వాలని కోరినా సమాధానం రాకపోవడంతో క్లెయిమ్‌ను తిరస్కరించాల్సి వచ్చింది" అని సంస్థ తెలిపింది.

Advertisement

వివరాలు 

నిర్దిష్ట వెయిటింగ్ పీరియడ్ అనంతరం కవరేజ్

ఈ సంఘటనను పరిశీలిస్తే, ఆరోగ్య బీమా తీసుకునే సమయంలో ముందుగా ఉన్న అనారోగ్య సమస్యలను పూర్తిగా వెల్లడించకపోవడం ప్రధాన కారణంగా కనిపిస్తోంది. కొన్ని సందర్భాల్లో ఇలాంటి సమస్యలు ఉన్నా నిర్దిష్ట వెయిటింగ్ పీరియడ్ అనంతరం కవరేజ్‌ను బీమా సంస్థలు అనుమతిస్తాయి. అందుకే పాలసీ తీసుకునే సమయంలో సరైన సమాచారం ఇవ్వడం, ప్రీమియాన్ని క్రమం తప్పకుండా చెల్లించడం ఎంతో అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement