Page Loader
Stock market: నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. 23,350 దిగువకు నిఫ్టీ

Stock market: నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. 23,350 దిగువకు నిఫ్టీ

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 21, 2024
04:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు (Stock Market) మరోసారి నష్టాలతో ముగిశాయి. గత ట్రేడింగ్ సెషన్‌లో లాభాలు నమోదు చేసిన సూచీలు, మళ్లీ నష్టాల ధోరణిని కొనసాగించాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు, అదానీ గ్రూప్ చైర్మన్‌పై అమెరికాలో నమోదైన అభియోగాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మార్కెట్లపై ఒత్తిడిని పెంచాయి. దీని ప్రభావంతో బీఎస్‌ఈలో నమోదైన కంపెనీల మొత్తం విలువ దాదాపు రూ.6 లక్షల కోట్లు తగ్గి, రూ.425 లక్షల కోట్లకు చేరుకుంది.

వివరాలు 

సూచీల ప్రదర్శన

సెన్సెక్స్ ఉదయం 77,711.11 పాయింట్ల (మునుపటి ముగింపు 77,578.38) వద్ద లాభాలతో ప్రారంభమైనప్పటికీ, కాసేపటికే నష్టాల్లోకి జారుకుంది. ఇంట్రాడేలో 76,802.73 పాయింట్ల కనిష్ఠాన్ని తాకిన సూచీ, చివరికి 422 పాయింట్ల నష్టంతో 77,155.79 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 168.60 పాయింట్ల నష్టంతో 23,349.90 వద్ద స్థిరపడింది. రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే మరో 7 పైసలు తగ్గి 84.49 వద్దకు చేరుకుని జీవనకాల కనిష్ఠాన్ని నమోదు చేసింది.

వివరాలు 

ప్రధాన షేర్ల ప్రభావం

సెన్సెక్స్‌ 30 సూచీలో అదానీ పోర్ట్స్, ఎన్టీపీసీ, ఎస్బీఐ, ఐటీసీ, ఏషియన్ పెయింట్స్ షేర్లు నష్టాల్లో ముగిశాయి. పవర్‌గ్రిడ్, అల్ట్రాటెక్ సిమెంట్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టాటా స్టీల్, టీసీఎస్ లాంటి షేర్లు కొంతమేర లాభపడ్డాయి. అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 73 డాలర్లకు చేరగా, బంగారం ఔన్సు ధర 2671 వద్ద ట్రేడ్ అయింది.

వివరాలు 

మార్కెట్‌పై ప్రభావం చూపిన అంశాలు: 

అదానీ గ్రూప్‌పై ఆరోపణలు: సోలార్ ఎనర్జీ ప్రాజెక్టుల కోసం అదానీ గ్రూప్ భారతదేశంలో లంచాలు ఇచ్చిందన్న ఆరోపణలపై గౌతమ్ అదానీ సహా పలువురిపై అమెరికాలో కేసు నమోదైంది. ఈ పరిణామం గ్రూప్ స్టాక్స్‌పై ప్రభావం చూపడంతో సూచీలను దెబ్బతీసింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ఉద్రిక్తతలు: రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం తీవ్రమవుతోంది. అమెరికా, ఉక్రెయిన్‌కు దీర్ఘశ్రేణి క్షిపణుల కోసం అనుమతులు ఇచ్చింది. పుతిన్ అణు విధానాల్లో మార్పులు చేయాలని సంకేతాలు ఇచ్చిన నేపథ్యంలో యుద్ధ భయాలు మదుపర్లను ప్రభావితం చేశాయి. విదేశీ మదుపర్ల అమ్మకాలు: దేశీయ మార్కెట్లో విదేశీ మదుపర్ల పెద్ద ఎత్తున అమ్మకాలు, బలహీన త్రైమాసిక ఫలితాలు మార్కెట్‌పై ఒత్తిడిని పెంచాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో,మార్కెట్లు కొంతకాలం పాటు ఒడిదుడుకులను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తోంది.