Stock market: నష్టాలలో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ 260 పాయింట్లు.. నిఫ్టీ 24,600 పాయింట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. బలహీన అంతర్జాతీయ సంకేతాలతో పాటు, బుధవారం అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయాలు వెలువడనుండటం వల్ల మదుపర్లు అప్రమత్తంగా ఉండడం, మార్కెట్‌ను ఒత్తిడికి గురి చేస్తున్నాయి. ప్రారంభంలోనే సెన్సెక్స్ 260 పాయింట్లు పడిపోయి, నిఫ్టీ 24,600 పాయింట్ల కింద ట్రేడవుతోంది. ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్ 210 పాయింట్లు తగ్గి 81,537 వద్ద, నిఫ్టీ 69 పాయింట్లు కుంగి 24,598 వద్ద కొనసాగుతోంది.
బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 73.86 డాలర్ల వద్ద ట్రేడవుతోంది
సెన్సెక్స్ 30 సూచీలో టాటా మోటార్స్, అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, టెక్ మహీంద్రా, ఎన్టీపీసీ, ఎస్‌బీఐ, హెచ్‌యూఎల్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. కాగా, రిలయన్స్ ఇండస్ట్రీస్, నెస్లే ఇండియా, భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఏషియన్ పెయింట్స్, టైటాన్, ఎల్అండ్‌టీ, యాక్సిస్ బ్యాంక్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 73.86 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. బంగారం ఔన్సు ధర 2,672.90 డాలర్ల వద్ద, డాలర్‌తో రూపాయి మారకం విలువ 84.92 వద్ద కొనసాగుతోంది.
మిశ్రమంగా ముగిసిన అమెరికా మార్కెట్లు
అమెరికా మార్కెట్లు సోమవారం మిశ్రమంగా ముగిశాయి. ఆసియా-పసిఫిక్ మార్కెట్లు ఈ రోజు అదే ధోరణిలో ఉన్నాయని తెలుస్తోంది. ఆస్ట్రేలియా ASX 0.82%, జపాన్ నిక్కీ 0.16% లాభంతో ట్రేడవుతున్నాయి, కాగా హాంకాంగ్ హాంగ్‌సెంగ్ 0.52% మరియు షాంఘై 0.52% నష్టాల్లో ఉన్నాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు సోమవారం రూ.279 కోట్ల విలువైన షేర్లను విక్రయించగా, దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) కూడా రూ.234 కోట్ల విలువైన షేర్లను అమ్మేశారు.