Stock Market Opening Bell: స్వల్ప లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాలు, అలాగే ఈ వారంలో రాబోయే ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలపై మదుపర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఈ ప్రభావంతో సూచీలు ట్రేడింగ్‌ను స్థిరంగా మొదలుపెట్టాయి. ఉదయం 9.30 గంటల సమయానికి సెన్సెక్స్ 119 పాయింట్ల లాభంతో 80,964 వద్ద, నిఫ్టీ 42 పాయింట్ల లాభంతో 24,498 వద్ద కొనసాగుతున్నాయి. రూపాయి-డాలర్ మారకం విలువ 84.68 వద్ద ఉంది.
దక్షిణ కొరియా రాజకీయ అనిశ్చితి.. ప్రతికూల ప్రభావం
నిఫ్టీ షేర్లలో భారత్ ఎలక్ట్రానిక్స్, అపోలో హాస్పిటల్స్, ట్రెంట్, ఎన్టీపీసీ, ఐటీసీ రాణిస్తుండగా, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, సిప్లా, భారతీ ఎయిర్‌టెల్ ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. అమెరికా మార్కెట్లు మంగళవారం మిశ్రమంగా ముగిశాయి, ఎస్‌అండ్‌పీ 500 సూచీ 0.05%, నాస్‌డాక్ 0.40% లాభపడగా, డోజోన్స్ స్వల్ప నష్టంతో ముగిసింది. దక్షిణ కొరియాలో నెలకొన్న రాజకీయ అనిశ్చితి ఆసియా-పసిఫిక్ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. జపాన్ నిక్కీ 0.25% మరియు ఆస్ట్రేలియా ఏఎస్‌ఎక్స్ సూచీ 0.58% నష్టాలను చవిచూశాయి. దక్షిణకొరియా కోస్పి సూచీ 2.03% క్షీణించింది.