Sugar Prices: పండగల వేళ పెరిగిన చక్కెర ధరలు.. కొనుగోళ్లపై పరిమితులు
ఈ వార్తాకథనం ఏంటి
పండగల సీజన్ వచ్చిందంటే ప్రతి ఇంట్లోనూ పిండివంటలు, స్వీట్ల సందడి మొదలవుతుంది. బంధుమిత్రులకు తీపి పంచుకోవడం కూడా ఆనవాయితీ. అయితే ఈసారి పండగల తీపిపై చక్కెర ధరల పెరుగుదల ప్రభావం పడే పరిస్థితి కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా చక్కెర ధరలు వేగంగా పెరుగుతుండటంతో గృహిణులు, స్వీట్లు తయారు చేసే వ్యాపారుల్లో ఆందోళన నెలకొంది. ఒకవైపు ధరలు పెరగడంతో ఖర్చులు భారమవుతుండగా.. మరోవైపు అవసరమైనంత చక్కెర లభించకపోవడం వినియోగదారులకు ఇబ్బందిగా మారింది.
వివరాలు
ఆన్‌లైన్‌లోనూ అదే పరిస్థితి
చక్కెర కొనుగోళ్లపై ప్రస్తుతం పలు రిటైల్ సంస్థలు పరిమితులు విధిస్తున్నాయి.
ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసినా, నేరుగా సూపర్‌మార్కెట్‌కు వెళ్లినా నిర్ణయించిన పరిమితిలోనే చక్కెర కొనాల్సి వస్తోంది.
బ్లింకిట్, జెప్టో, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ వంటి క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో ఒక్కో ఆర్డర్‌కు నిర్దిష్ట పరిమాణంలో మాత్రమే చక్కెర ప్యాకెట్లను కొనుగోలు చేసే అవకాశం ఇస్తున్నారు.
ఉదాహరణకు స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో క్రిస్టల్ షుగర్ కొనుగోలును ఒక్కో ఆర్డర్‌కు రెండు కేజీల ప్యాకెట్లకు పరిమితం చేశారు.
మరికొన్ని ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో కొన్ని బ్రాండ్ల చక్కెర అందుబాటులో లేకపోవడం కూడా కనిపిస్తోంది. ఆయా ఉత్పత్తులకు 'స్టాక్ లేదు' అనే సమాచారం చూపిస్తోంది.
వివరాలు
ఆఫ్‌లైన్ స్టోర్లలోనూ కోత
ఈపరిమితులు కేవలం ఆన్‌లైన్ కొనుగోళ్లకే పరిమితం కాలేదు. డి-మార్ట్,రిలయన్స్ వంటి ప్రముఖ రిటైల్ చైన్లలోనూ ఒక్కో వినియోగదారుడికి 2 నుంచి 3కేజీలకు మించి చక్కెర విక్రయించడం లేదు.
మార్కెట్‌లో కృత్రిమ కొరత ఏర్పడకుండా చూడటం,వ్యాపారులు పెద్ద మొత్తంలో చక్కెర కొనుగోలు చేసి నిల్వ చేసుకోకుండా నిరోధించడమే ఈ పరిమితుల ఉద్దేశంగా తెలుస్తోంది.
రోజువారీ అవసరాల కోసం కేజీ లేదా అరకేజీ చక్కెర కొనేవారికి ఈ నిబంధనలు పెద్దగా ఇబ్బంది కలిగించకపోవచ్చు.
కానీ పండగల సందర్భంగా పెద్ద మొత్తంలో పిండివంటలు తయారు చేసుకునే కుటుంబాలు,స్వీట్ షాపుల నిర్వాహకులకు మాత్రం ఈ పరిమితులు సమస్యగా మారుతున్నాయి.
ముఖ్యంగా పండగల డిమాండ్ పెరిగే సమయంలో అవసరమైన పరిమాణంలో చక్కెర అందుబాటులో లేకపోవడం వ్యాపారులపై ప్రభావం చూపే అవకాశంఉంది.
వివరాలు
కేంద్రం కీలక నిర్ణయం
మార్కెట్‌లో పరిస్థితిని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టింది.
దేశీయ మార్కెట్‌లో చక్కెర లభ్యతను పెంచడంతో పాటు నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్‌ను నియంత్రించడంపై దృష్టి పెట్టింది.
శ్రావణ మాసం నుంచి వినాయక చవితి, దసరా, దీపావళి వరకు వరుసగా పండగలు ఉండటంతో ఈ సమయంలో చక్కెరకు డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో సుమారు 10 లక్షల టన్నుల రా షుగర్‌ను ఎలాంటి దిగుమతి సుంకం లేకుండా దేశంలోకి తీసుకొచ్చేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది.
దిగుమతి చేసిన ముడి చక్కెరను రిఫైన్ చేసి దేశీయ మార్కెట్‌లోకి అందుబాటులోకి తీసుకురావడం దీని ప్రధాన ఉద్దేశం.
వివరాలు
రిఫైనరీలకు అదనపు సమయం
ఈ రా షుగర్‌ను ప్రాసెస్ చేసే గడువుకు సంబంధించి ప్రభుత్వం తాజాగా మార్పు చేసింది.
తొలుత అక్టోబర్ 31 వరకు మాత్రమే ప్రాసెసింగ్‌కు గడువు ఉండగా.. ఇప్పుడు దిగుమతి చేసుకున్న ముడి చక్కెరను శుద్ధి చేసి మార్కెట్‌లోకి విడుదల చేయడానికి అదనపు సమయం కల్పించింది.
దిగుమతిదారులు 'బిల్ ఆఫ్ ఎంట్రీ' దాఖలు చేసిన తేదీ నుంచి రెండు నెలల్లో రా షుగర్‌ను రిఫైన్ చేసి మార్కెట్‌కు విడుదల చేసే అవకాశం కల్పించారు.
ఈ నిర్ణయం రిఫైనరీలకు కొంత వెసులుబాటు కల్పించడంతో పాటు దిగుమతి చేసిన చక్కెరను దశలవారీగా మార్కెట్‌లోకి తీసుకురావడానికి ఉపయోగపడనుంది.
వివరాలు
ధరలు ఎప్పుడు తగ్గుతాయి?
అయితే కేంద్రం తీసుకున్న చర్యల ప్రభావం వెంటనే మార్కెట్‌పై కనిపించే అవకాశం లేదు.
దిగుమతి చేసిన రా షుగర్ దేశానికి చేరడం, దాన్ని రిఫైన్ చేయడం, ఆ తర్వాత మార్కెట్‌లోకి సరఫరా చేయడానికి కొంత సమయం పడుతుంది.
ఇదే సమయంలో పండగల డిమాండ్ మరింత పెరిగితే పరిస్థితి ఎలా ఉంటుందన్నది ప్రశ్నగా మారింది.
ప్రభుత్వ చర్యల వల్ల మార్కెట్‌లో చక్కెర సరఫరా ఎంత త్వరగా పెరుగుతుంది? ధరలు ఎప్పుడు తగ్గుతాయి? రిటైల్ సంస్థలు విధించిన కొనుగోలు పరిమితులు ఎప్పుడు తొలగుతాయి? అనేది ఇప్పుడు కీలకంగా మారింది.
ప్రస్తుత పరిస్థితుల్లో చక్కెర కొనుగోలు చేసే సామర్థ్యం ఉన్నప్పటికీ, అవసరమైన పరిమాణంలో సరుకు లభించకపోవడం వినియోగదారులకు పండగ వేళ మరో సమస్యగా మారింది.