Tata Boardroom Battle: టాటా సన్స్ వివాదం కోర్టుకెక్కితే.. న్యాయపోరాట ఖర్చులు ఎవరు భరించాలి?
ఈ వార్తాకథనం ఏంటి
టాటా గ్రూప్ మాతృసంస్థ టాటా సన్స్‌లో బోర్డురూమ్ వివాదం మరింత ముదురుతోంది. ఎన్. చంద్రశేఖరన్‌ను మరో ఐదేళ్లపాటు టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా కొనసాగించేందుకు బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని మెజారిటీ వాటాదారు అయిన టాటా ట్రస్ట్స్ వ్యతిరేకిస్తోంది. ఈ నిర్ణయం కంపెనీ నిబంధనలకు విరుద్ధమని, చట్టబద్ధంగా చెల్లదని ట్రస్ట్స్ పేర్కొంటున్నాయి. దీంతో వ్యవహారం న్యాయస్థానానికి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో న్యాయపోరాటానికి అయ్యే ఖర్చులను ఎవరు భరించాలన్న అంశం చర్చనీయాంశంగా మారింది.
వివరాలు
TEDT నుంచి స్పష్టమైన వ్యతిరేకత..
టాటా ట్రస్ట్స్-టాటా సన్స్ మధ్య తలెత్తిన వివాదానికి సంబంధించిన న్యాయపరమైన ఖర్చుల కోసం టాటా ఎడ్యుకేషన్ అండ్ డెవలప్‌మెంట్ ట్రస్ట్(TEDT)నిధులను వినియోగించడాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు ట్రస్టీ మెహ్లీ మిస్త్రీ స్పష్టం చేసినట్లు సమాచారం.
ఈ విషయాన్ని టాటా ట్రస్ట్స్ సీఈఓ సిద్ధార్థ శర్మతోపాటు ట్రస్ట్స్ ఛైర్మన్ నోయెల్ టాటాకు ఆయన ఈమెయిల్ ద్వారా తెలియజేసినట్లు తెలుస్తోంది.
టాటా సన్స్‌కు దాదాపు 150 ఏళ్ల చరిత్ర ఉందని, ఇలాంటి వివాదం చోటుచేసుకోవడం అనూహ్యమని మెహ్లీ మిస్త్రీ పేర్కొన్నట్లు సమాచారం.
అయితే తమ ట్రస్ట్‌కు టాటా సన్స్‌లో వాటా లేదని,అందువల్ల ప్రస్తుత వివాదంతో తమకు ప్రత్యక్ష సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు.
ఈ కారణంగా న్యాయపరమైన ఖర్చులను TEDT భరించలేదని ఆయన అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.
వివరాలు
నాడు రూ.200 కోట్ల వ్యయం..
టాటా ట్రస్ట్స్ గతంలోనూ న్యాయపరమైన వ్యవహారాల కోసం భారీగా ఖర్చు చేసింది.
టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీతో జరిగిన సుదీర్ఘ న్యాయపోరాటంలో టాటా సన్స్, టాటా ట్రస్ట్స్ కలిసి దాదాపు రూ.200 కోట్లు ఖర్చు చేసినట్లు మీడియా కథనాలు వెల్లడించాయి.
మరోవైపు సైరస్ మిస్త్రీ తరఫున సుమారు రూ.50 కోట్లు ఖర్చయినట్లు సమాచారం.
గత అనుభవాలను దృష్టిలో ఉంచుకునే తాజా వివాదంలో TEDT నిధులను ఉపయోగించడంపై మెహ్లీ మిస్త్రీ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
వివరాలు
సింఘ్వీ వర్సెస్ సాల్వే..
ప్రస్తుత వివాదం న్యాయస్థానానికి చేరితే టాటా ట్రస్ట్స్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించనున్నట్లు సమాచారం.
టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ తరఫున సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే వాదించనున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే టాటా గ్రూప్‌లో నెలకొన్న పరిణామాలపై ఈ ఇద్దరు న్యాయవాదులు తమ అభిప్రాయాలను మీడియా ముందు వెల్లడిస్తున్నారు.
వివరాలు
కాస్టింగ్ ఓటుతో ఆమోదం..
చంద్రశేఖరన్ పదవీకాలాన్ని మరో ఐదేళ్లపాటు పొడిగించే ప్రతిపాదనపై ఈ నెల 17న జరిగిన టాటా సన్స్ బోర్డు సమావేశంలో ఓటింగ్ జరిగింది.
టాటా ట్రస్ట్స్ తరఫున బోర్డులో ఉన్న ఇద్దరు నామినీ డైరెక్టర్లలో నోయెల్ టాటా ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఓటు వేశారు.
మరో ట్రస్ట్ నామినీ డైరెక్టర్ వేణు శ్రీనివాసన్ మాత్రం ప్రతిపాదనకు అనుకూలంగా ఓటేశారు.
ఓటింగ్‌లో సమాన పరిస్థితి ఏర్పడటంతో బోర్డు కాస్టింగ్ ఓటును ఉపయోగించి చంద్రశేఖరన్ పదవీకాలం పొడిగింపు ప్రతిపాదనను ఆమోదించింది.
అయితే, ఈ నిర్ణయం టాటా సన్స్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ (ఏఓఏ)లోని నిబంధనలను ఉల్లంఘించిందని టాటా ట్రస్ట్స్ ఆరోపిస్తోంది.
దీంతో బోర్డు నిర్ణయం చట్టబద్ధతపై ఇరువర్గాల మధ్య వివాదం మరింత తీవ్రతరం అయ్యే పరిస్థితి కనిపిస్తోంది.