Tata Electronics:పెగాట్రాన్ టెక్నాలజీ ఇండియాలో 60 శాతం వాటాను కొనుగోలు చేసిన టాటా ఎలక్ట్రానిక్స్
ఈ వార్తాకథనం ఏంటి
టాటా గ్రూప్ ఎలక్ట్రానిక్స్ తయారీలో తన దూకుడును కొనసాగిస్తోంది.
గతంలో ఐఫోన్ల తయారీకి సంబంధించిన విస్ట్రన్ కార్పొరేషన్ భారత విభాగాన్ని సొంతం చేసుకున్న టాటా, ఒక్క సంవత్సరం తిరగకముందే మరో కంపెనీలో మెజారిటీ వాటాను సంపాదించింది.
తైవాన్‌కి చెందిన పెగట్రాన్ కార్పొరేషన్ అనుబంధ సంస్థ పెగట్రాన్ ఇండియాలో 60 శాతం మెజారిటీ వాటాను టాటా ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ స్వాధీనం చేసుకుంది.
ఈ కొనుగోలు టాటా ఎలక్ట్రానిక్స్‌ను భారతీయ ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్తుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.
పెగట్రాన్ ఇండియాలో మెజారిటీ వాటాను కొనుగోలు చేసిన తర్వాత, ఇరు సంస్థలు కలిసి పనిచేసేందుకు ప్రత్యేకంగా దృష్టి సారిస్తాయని టాటా ఎలక్ట్రానిక్స్ వెల్లడించింది.
వివరాలు
వివిధ దేశాలకు ఉత్పత్తుల ఎగుమతిలో పెగట్రాన్ కీలక పాత్ర
ఈ వ్యూహాత్మక కొనుగోలు టాటా ఎలక్ట్రానిక్స్ ఉనికిని మరింత బలపరుస్తుందని, ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో తన స్థానాన్ని మెరుగుపరుస్తుందని టాటా ఎలక్ట్రానిక్స్ సీఈఓ. ఎండీ రణ్‌ధీర్ ఠాకూర్ తెలిపారు.
ఆపిల్ వంటి గ్లోబల్ బ్రాండ్లకు ఎలక్ట్రానిక్స్ తయారీ సేవలను అందించడం మాత్రమే కాకుండా, వివిధ దేశాలకు ఉత్పత్తుల ఎగుమతిలో పెగట్రాన్ కీలక పాత్ర పోషిస్తోందని ఆయన చెప్పారు.
గతేడాది మార్చిలో విస్ట్రన్ ఇండియా వ్యాపారాన్ని కొనుగోలు చేసి, యాపిల్ ఐఫోన్ల తయారీలోకి అడుగుపెట్టిన టాటా, ఏడాది పూర్తికాక ముందే పెగట్రాన్‌లో మెజారిటీ వాటాను దక్కించుకోవడం విశేషం.