Loading...
Tata Electronics: టాటా ఎలక్ట్రానిక్స్‌తో భారత్ తొలి సెమీకండక్టర్ వేఫర్ తయారీ ప్లాంట్.. ధోలేరాలో ఏర్పాటు
టాటా ఎలక్ట్రానిక్స్‌తో భారత్ తొలి సెమీకండక్టర్ వేఫర్ తయారీ ప్లాంట్.. ధోలేరాలో ఏర్పాటు

Tata Electronics: టాటా ఎలక్ట్రానిక్స్‌తో భారత్ తొలి సెమీకండక్టర్ వేఫర్ తయారీ ప్లాంట్.. ధోలేరాలో ఏర్పాటు

వ్రాసిన వారు Moogati Shabari
Jul 17, 2026
05:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాటా గ్రూప్‌కు చెందిన టాటా ఎలక్ట్రానిక్స్.. భారత్‌లో తొలి భారీ స్థాయి సెమీకండక్టర్ వేఫర్ తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. ప్రారంభంలో ప్రణాళిక రూపొందించిన అత్యాధునిక 28 నానోమీటర్ (nm) టెక్నాలజీకి బదులుగా, ప్రస్తుతం 90 నానోమీటర్ ప్రాసెస్ టెక్నాలజీతో ఉత్పత్తి ప్రారంభించాలని కంపెనీ నిర్ణయించింది. దేశీయంగా స్వయం సమృద్ధి కలిగిన చిప్ పరిశ్రమను అభివృద్ధి చేయాలన్న భారత ప్రభుత్వ లక్ష్యాల్లో భాగంగానే ఈ ప్రాజెక్టు ముందుకు సాగుతోంది. గుజరాత్‌లోని ధోలేరాలో నిర్మిస్తున్న ఈ సెమీకండక్టర్ ఫ్యాబ్‌లో 28nm నుంచి 110nm వరకు వివిధ టెక్నాలజీ నోడ్లలో చిప్‌లను తయారు చేయనున్నట్లు టాటా ఎలక్ట్రానిక్స్ ప్రతినిధి బ్లూమ్‌బర్గ్‌కు తెలిపారు.

వివరాలు

చిప్‌ల తయారీ సామర్థ్యాన్ని పెంచడంలో కీలక అడుగు..

ఈ ప్రాజెక్టుకు అవసరమైన సాంకేతిక సహకారం కోసం తైవాన్‌కు చెందిన పవర్‌చిప్ సెమీకండక్టర్ మాన్యుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ (PSMC)తో టాటా ఎలక్ట్రానిక్స్ భాగస్వామ్యం కుదుర్చుకుంది.

ఈ భాగస్వామ్యం కింద పలు టెక్నాలజీ నోడ్లపై కలిసి పని చేస్తున్నామని, ముందుగా పాత తరహా టెక్నాలజీ నోడ్లతో ఉత్పత్తి ప్రారంభించి, అనంతరం 28 నానోమీటర్ వంటి అధునాతన టెక్నాలజీ వైపు వెళ్లనున్నామని PSMC ప్రతినిధి ఎరిక్ టాంగ్ వెల్లడించారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశీయ సెమీకండక్టర్ ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో చేపట్టిన కార్యక్రమాల్లో ధోలేరా సెమీకండక్టర్ ఫ్యాబ్ కీలక ప్రాజెక్టుగా భావిస్తున్నారు.

విదేశీ దిగుమతులపై ఆధారపడకుండా దేశీయంగా చిప్‌ల తయారీ సామర్థ్యాన్ని పెంచడంలో ఇది ముఖ్యమైన అడుగుగా నిలవనుంది.

వివరాలు

ఆధిపత్యంలో అమెరికా, కొరియా దేశాలు..

భారత్‌ను ప్రపంచ స్థాయి చిప్ తయారీ కేంద్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో టాటా గ్రూప్ సెమీకండక్టర్ తయారీ, అసెంబ్లీ ప్లాంట్లలో బిలియన్ల డాలర్ల పెట్టుబడులు పెట్టుతోంది.

అయితే ఈ రంగంలో ఇప్పటికే దశాబ్దాల అనుభవంతో తైవాన్, దక్షిణ కొరియా, అమెరికా వంటి దేశాలు బలమైన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాయి.

అలాంటి పోటీ ఉన్న పరిశ్రమలో భారత్ ఇప్పుడు అడుగుపెడుతోంది.

28 నానోమీటర్ చిప్‌లు ఆటో మొబైల్, వినియోగదారుల ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ పరికరాలు, పారిశ్రామిక రంగాల్లో విస్తృతంగా ఉపయోగించబడుతున్నాయి.

ADVERTISEMENT

వివరాలు

రూ.1.28 లక్షల కోట్ల (13.3 బిలియన్ డాలర్లు) ప్రోత్సాహక ప్యాకేజీ..

అయితే ప్రారంభంలో 90 నానోమీటర్ టెక్నాలజీతో ఉత్పత్తి చేపట్టడం వల్ల, టాటా ఎలక్ట్రానిక్స్ తక్కువ లాభదాయకమైన సెమీకండక్టర్ మార్కెట్ విభాగంలో కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇదిలా ఉంటే, చిప్ డిజైన్, తయారీ పరికరాలు, సెమీకండక్టర్ సరఫరా వ్యవస్థను బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం తాజాగా రూ.1.28 లక్షల కోట్ల (13.3 బిలియన్ డాలర్లు) ప్రోత్సాహక ప్యాకేజీకి ఆమోదం తెలిపింది.

ఈ నిధులు భవిష్యత్తులో కొత్త పెట్టుబడులకు మద్దతు ఇవ్వనున్నప్పటికీ, ధోలేరా ప్రాజెక్టు కోసం టాటా ఎలక్ట్రానిక్స్ ఇప్పటికే కేటాయించిన పెట్టుబడులకు మాత్రం ఇవి వర్తించవని సమాచారం.

ADVERTISEMENT