Tata Sons: టాటా సన్స్ ఛైర్మన్ వివాదం.. వేణు శ్రీనివాసన్‌ను ప్రశ్నించిన డారియస్ ఖంబటా
ఈ వార్తాకథనం ఏంటి
టాటా సన్స్ (Tata Sons) ఛైర్మన్ పదవికి సంబంధించిన వివాదం రోజురోజుకూ ముదురుతోంది. తాజాగా ఈ వ్యవహారంపై టాటా మాజీ ట్రస్టీ, ప్రముఖ న్యాయవాది డారియస్ ఖంబటా (Darius Khambata) నాలుగు పేజీల లేఖను విడుదల చేశారు. టాటా సన్స్ ప్రస్తుత ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ పునఃనియామకంపై ట్రస్టీ వేణు శ్రీనివాసన్ అనుసరించిన వైఖరిని ఆయన ప్రశ్నించారు. టాటా ట్రస్టుల్లో అంతర్గత విభేదాలు తీవ్రరూపం దాల్చుతున్న సమయంలో ఈ లేఖ వెలువడటం ప్రాధాన్యం సంతరించుకుంది.
వివరాలు
చంద్రశేఖరన్ పునఃనియామకంపై ప్రశ్నలు
ఆగస్టు 12న చంద్రశేఖరన్ మరోసారి ఛైర్మన్‌గా కొనసాగాలని తాను కోరుకోవడం లేదని ప్రకటించారని ఖంబటా గుర్తుచేశారు. ఆగస్టు 13న జరిగిన సమావేశంలో ఆయన కోరికను గౌరవించాలని వేణు శ్రీనివాసన్, విజయ్‌సింగ్‌తో పాటు అందరూ నిర్ణయించుకున్నారని తెలిపారు.
కొత్త ఛైర్మన్ ఎంపిక కోసం సెలక్షన్ కమిటీ ఏర్పాటుకు కూడా చర్యలు ప్రారంభించారని పేర్కొన్నారు.
అయితే సెప్టెంబర్ 3న జరిగిన నామినేషన్ అండ్ రెమ్యూనరేషన్ కమిటీ (NRC) సమావేశంలో చంద్రశేఖరన్‌నే కొనసాగించాలని, తన నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరినట్లు ఖంబటా వెల్లడించారు.
ఈ నేపథ్యంలో ఆగస్టులో ట్రస్టీలు ఏకగ్రీవంగా తీసుకున్న నిర్ణయాన్ని ఎన్‌ఆర్‌సీ దృష్టికి వేణు శ్రీనివాసన్ తీసుకెళ్లారా? అని ప్రశ్నించారు. ఆగస్టు 12న చంద్ర పునఃనియామకం కోరడం లేదని ప్రకటించారు.
వివరాలు
సెలక్షన్ కమిటీని సిద్ధం చేశాం
ఆయన కోరికను గౌరవించాలని ఆగస్టు 13న జరిగిన సమావేశంలో మీ ఇద్దరితో సహా (వేణు, విజయ్‌సింగ్) అందరం నిర్ణయించాం.
కొత్త ఛైర్మన్ కోసం సెలక్షన్ కమిటీని సిద్ధం చేసే పని మొదలుపెట్టాం. అయితే సెప్టెంబర్ 3న ఎన్‌ఆర్‌సీ సమావేశమైనప్పుడు చంద్రశేఖరన్‌నే కొనసాగించాలని, ఆయన నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరింది.
ఆ సమయంలో ఆగస్టులో ట్రస్టీలు ఏకగ్రీవంగా తీసుకున్న నిర్ణయాన్ని ఎన్‌ఆర్‌సీ దృష్టికి వేణు తీసుకొచ్చారాని ఖంబటా లేఖలో ప్రశ్నించారు.
సెప్టెంబర్ 3న ఎన్‌ఆర్‌సీ తీసుకున్న నిర్ణయం ఆధారంగా సెప్టెంబర్ 17న టాటా సన్స్ బోర్డు చంద్రశేఖరన్‌కు మరో ఐదేళ్ల పదవీకాల పొడిగింపు ఇచ్చింది.
వివరాలు
టాటా సన్స్ లిస్టింగ్‌పై వైఖరిని ప్రశ్నించిన ఖంబటా
నవంబర్ 11న వేణు శ్రీనివాసన్, విజయ్‌సింగ్ చేసిన పలు ఆరోపణలకు కూడా ఖంబటా తన లేఖలో సమాధానమిచ్చారు.
తాను ఎలాంటి వ్యక్తిగత ప్రయోజనాలను ఆశించడం లేదని స్పష్టం చేశారు. టాటా సన్స్ లిస్టింగ్ అంశాన్ని ప్రస్తావిస్తూ.. 2024 మార్చి, 2025 మే, 2025 జులైలో జరిగిన ఓటింగ్‌లో వేణు శ్రీనివాసన్, విజయ్‌సింగ్ లిస్టింగ్‌కు వ్యతిరేకంగా ఓటు వేశారని గుర్తుచేశారు.
అయితే 2026 ఏప్రిల్‌లో వారిద్దరూ తమ వైఖరిని పూర్తిగా మార్చుకున్నారని పేర్కొన్నారు.
లిస్టింగ్‌కు సంబంధించిన అంశాన్ని ట్రస్టీల సమావేశంలో వారిద్దరూ ఎందుకు చర్చకు తీసుకురాలేదని ప్రశ్నించారు.
లిస్టింగ్ వల్ల కలిగే లాభనష్టాలపై ట్రస్టీల సమావేశంలో చర్చ జరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
వివరాలు
నోయల్ టాటా ప్రభావం ఉందన్న ఆరోపణలపై వివరణ
తన అభ్యంతరాలన్నీ సెప్టెంబర్ 17న తీసుకున్న నిర్ణయాలపైనే తప్ప.. చంద్రశేఖరన్ సంస్థకు చేసిన సేవలపై కాదని ఖంబటా స్పష్టం చేశారు.
నోయల్ టాటా ప్రభావంతో తాను స్వతంత్రంగా వ్యవహరించలేదన్న ఆరోపణలను కూడా తోసిపుచ్చారు.
గతంలో ట్రస్టీ ఛైర్మన్‌తో తాను పలుమార్లు విభేదించిన విషయాన్ని ప్రస్తావించారు. వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఖంబటా సూచించారు.
తీసుకునే నిర్ణయాలు టాటా సన్స్, టాటా ట్రస్టులు, మొత్తం టాటా గ్రూప్ విస్తృత ప్రయోజనాలకు అద్దం పట్టాలని పేర్కొన్నారు.
కాగా ఖంబటా విడుదల చేసిన ఈ లేఖపై వేణు శ్రీనివాసన్, విజయ్‌సింగ్ ఇప్పటివరకు స్పందించలేదు.