SpiceJet Flight Delays: ముంబై ఎయిర్‌పోర్టులో స్పైస్‌జెట్ విమానాల నిలిపివేత.. వందలాది మంది ప్రయాణికుల అవస్థలు
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలోని అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో ఒకటైన ముంబై ఎయిర్‌పోర్టులో స్పైస్‌జెట్ విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మంగళవారం రాత్రి 7 గంటల నుంచి ఆ సంస్థకు చెందిన ఒక్క విమానం కూడా టేకాఫ్ కాలేదు. దీంతో వందలాది మంది ప్రయాణికులు విమానాశ్రయంలోనే చిక్కుకుపోయారు. స్పైస్‌జెట్ కౌంటర్ వద్ద ప్రయాణికులు పెద్ద సంఖ్యలో గుమిగూడిన దృశ్యాలు కనిపించాయి. విమానయాన సంస్థకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ అసహనాన్ని వ్యక్తం చేశారు.
వివరాలు
అర్ధరాత్రి విమానాలకూ తప్పని ఆలస్యం
స్పైస్‌జెట్ కార్యకలాపాల్లో అంతరాయం కారణంగా అర్ధరాత్రి బయలుదేరాల్సిన విమానాలపైనా ప్రభావం పడింది.
రాత్రి 11.30 గంటలకు బయలుదేరాల్సిన ఓ విమానానికి ఇంకా బోర్డింగ్ కూడా ప్రారంభం కాలేదు. విమానాలు ఎప్పుడు బయలుదేరుతాయనే దానిపై స్పష్టత లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
విమానాల ఆలస్యానికి కారణం ఏమిటి? సవరించిన బయలుదేరు సమయాలు ఎప్పుడు? అనే విషయాలపై స్పైస్‌జెట్ ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.
విమానాలు ఎప్పుడు టేకాఫ్ అవుతాయో తెలియక గంటల తరబడి విమానాశ్రయంలోనే వేచి ఉండాల్సి వస్తోందని వాపోతున్నారు. ఈ అంతరాయంపై స్పైస్‌జెట్ ఇప్పటివరకు స్పందించలేదు.
వివరాలు
దుబాయ్ నుంచి నాలుగు విమానాలు రద్దు
గత కొన్ని రోజులుగా స్పైస్‌జెట్ విమాన కార్యకలాపాల్లో తీవ్ర అంతరాయాలు చోటుచేసుకుంటున్నాయి.
గత ఆదివారం దుబాయ్ నుంచి బయలుదేరాల్సిన నాలుగు విమానాలను సంస్థ రద్దు చేసింది.
బకాయిలు చెల్లించకపోవడంతో ఆ సంస్థకు గ్రౌండ్ హ్యాండ్లింగ్ సేవలు అందిస్తున్న కంపెనీ చెక్-ఇన్ సేవలను నిలిపివేసినట్లు ఎన్డీటీవీ ప్రాఫిట్ వెల్లడించింది.
స్పైస్‌జెట్.. గ్రౌండ్ హ్యాండ్లింగ్ సంస్థ డ్నాటా (Dnata)కు 14 మిలియన్ యూఏఈ దిర్హామ్‌లకు పైగా బకాయిపడినట్లు ఆ నివేదిక పేర్కొంది. అయితే చెక్-ఇన్ సేవల నిలిపివేత నవంబర్ 12వ తేదీ వరకే పరిమితమైంది.
వివరాలు
ఢిల్లీ, ముంబై విమానాశ్రయాల ప్రయాణికులకు ముందస్తు హెచ్చరికలు
స్పైస్‌జెట్ ఎదుర్కొంటున్న కార్యకలాపాల సమస్యల కారణంగా విమానాల రాకపోకల్లో అంతరాయాలు ఏర్పడే అవకాశం ఉందని గత శుక్రవారం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (IGIA) ప్రయాణికులకు సూచన జారీ చేసింది.
అలాగే శనివారం ముంబై విమానాశ్రయం కూడా ప్రయాణికుల కోసం ఇదే తరహా హెచ్చరికను విడుదల చేసింది.
తాజాగా అక్కడ స్పైస్‌జెట్ విమానాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.